– చెప్పినవన్నీ అబద్ధాలు.. ఇచ్చివన్నీ మోసాలే
– కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు 25 వేల కోట్లు విడుదల
– రైతుల గోస సర్కారుకు శాపం
– రైతుబంధుపై మూడుసార్లు మాట మార్చిన సీఎం
– మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు ఫైర్
హైదరాబాద్: రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోంది. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి.
పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వానికి.. అన్నంపెట్టే రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి మాత్రం నిధులు కరువయ్యాయి. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమకు తాజా పరిణామాలే సాక్ష్యం.
ఫిబ్రవరి 4న మిర్యాలగూడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు? మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేస్తాం. ఇప్పటికే నిధులు సమకూర్చుకున్నాం అని ప్రగల్భాలు పలికారు. పత్రికల్లో లీకులు ఇచ్చి అనుకూల వార్తలు రాయించుకున్నారు.
తీరా ఎన్నికల కోడ్ ముగిసి పది రోజులు దాటుతున్నా రైతుబంధు ఊసే లేదు. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లోనూ దీనిపై ఉలుకు లేదు, పలుకు లేదు.
ఎన్నికల ముందు ఎకరానికి 15,000 ఇస్తామని రైతులను నిలువునా మోసం చేసి, ఇప్పటికే రెండు సీజన్ల రైతుబంధుకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం ఓట్ల కోసమే రైతుబంధు పేరుతో నాటకాలు ఆడిందని ఇప్పుడు బట్టబయలైంది.
రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వడానికి నిధులు లేవంటున్న రేవంత్ రెడ్డి కి.. మూసీ సుందరీకరణకు వేల కోట్లు, సుందరీకరణలో భాగంగా కూల్చే ఇండ్లకు వేల కోట్లు పంచిపెట్టడానికి, మూసీలో పార్కులు కట్టడానికి వేలకోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయి?
ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణకు వేలకోట్లు, రోడ్ల నిర్మాణానికి వేల కోట్లు కేటాయిస్తున్నారు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే బడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం 25 వేల కోట్ల బిల్లులు చెల్లించిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపడానికి వేల కోట్లు ఉంటాయి కానీ, కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి మాత్రం చేతులు రావా?
ఒకవైపు ఇనుప కంచెలు లేని ప్రజా పాలన అని గొప్పలు చెప్తూనే.. ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ లో వందల కోట్లతో ప్యాలెస్ లాంటి క్యాంప్ కార్యాలయం కట్టుకుంటున్నారు. ఆ క్యాంప్ ఆఫీస్ చుట్టూ బలమైన ఇనుప కంచెల కోసమే 9 కోట్లు ఖర్చు చేస్తుండటం చూస్తుంటే.. మీ ఏడో గ్యారెంటీ ‘ప్రజాస్వామిక పాలన’ ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో అర్థమవుతోంది.
ఆ ప్యాలెస్ పక్కనే 5 కోట్లతో ఫుట్ బాల్ ఆడుకోవడానికి ప్రత్యేకంగా కోర్టు కట్టుకుంటున్నారు. అందాల పోటీలకు, ఫుట్ బాల్ మ్యాచ్ లకు వందల కోట్లు ఖర్చు పెడుతూ.. అన్నంపెట్టే రైతన్న నోట్లో మాత్రం మట్టి కొడుతున్నారు.
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ మోసపూరిత వైఖరిని, అన్నదాతలను పెడుతున్న తిప్పలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పగటివేషాలు, ఓట్ల కోసం నాటకాలు కట్టిపెట్టి, వెంటనే రైతులందరికీ రైతుబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం..