* ఆప్కోలో డిజిటిలైజేషన్ కు ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ అవార్డు
* గతేడాది 7 ఓడీ-ఓపీ అవార్డు రాక
* సత్ఫలితాలిస్తున్న కూటమి ప్రభుత్వ చర్యలు
* అసెంబ్లీలో చేనేత స్టాళ్లకు అనూహ్య స్పందన
* వారం రోజుల్లో రూ.35 లక్షలకు పైగా అమ్మకాలు
* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
అమరావతి : రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. తాజా మరో కేంద్ర ప్రభుత్వ అవార్డు ఆప్కో సొంతమైంది. ఆప్కోలో చేపట్టిన డిజిటిలైజేషన్ ను అభినందిస్తూ స్కోచ్ అవార్డునే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ వస్తోందన్నారు. నేతన్నలకు వ్యక్తిగతంలో ఆర్థికభరోసా కలిగించేలా సంక్షేమ పథకాలు అమలుచేయడంతో పాటు వారికి 365 రోజుల పాటు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు ఒప్పందాలు సైతం చేసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచే లక్ష్యంతో ఆప్కోను బలోపేతం చేస్తున్నామన్నారు.
ఆప్కోలో డిజిటిలైజేషన్ చేపట్టామన్నారు. ఫోన్ పే ద్వారా వస్త్రాలు కొనుగోలు, విధుల్లో పారదర్శకతకు ముఖాధారిత హాజరు, కొనుగోలు చేసిన వస్త్రాలకు కంప్యూటర్ బిల్లింగ్ వంటి ఎన్నో సాంకేతికతను ప్రవేశపెట్టామన్నారు. ఈ కామర్స్ సంస్థల ద్వారా వినియోగదారుల ఇళ్లకు నేరుగా చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నామన్నారు. ఆప్కో చేపట్టిన సంస్కరణలతో చేనేత అమ్మకాలు పెరిగాయన్నారు.
ఈ నేపథ్యంలో ఆప్కో చేపట్టిన డిజిటిలైజేషన్ కు కేంద్ర ప్రభుత్వం స్కోచ్ అవార్డు ప్రకటించిందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ ఏడాది ఏపీకి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించిందన్నారు. ఈ అవార్డు సాధన వెనుక సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కృషి ఉందని కొనియాడుతూ, స్కోచ్ అవార్డు ప్రకటించిన కేంద్రానికి మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు. గతేడాది రాష్ట్రంలో చేనేత, హస్త కళల ఉత్పత్తులకు ఏడు ఓడీ ఓపీ అవార్డులు వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇదే ఉత్సాహంతో చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచడంతో పాటు ఆప్కో షో రూమ్ ల మరింత బలోపేతానికి కృషి చేస్తామని మంత్రి సవిత తెలిపారు.
అసెంబ్లీలో అమ్మకాలు అదుర్స్
ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభించిందని మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 19వ తేదీన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి చేతుల మీదుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రఖ్యాతగాంచిన పొందూరు షర్ట్ లు, పంచెలు, కండువాలు, మాధవవరం, వెంకటగిరి, ధర్మవరం, రాజమండ్రి, ఉప్పాడ, బందరు, మానపల్లి పట్టు, సాధారణ చీరలతో పాటు రెడీమేడ్ దుస్తులను ఈ స్టాళ్లలో అమ్మకానికి పెట్టారు.
వాటితో పాటు లుంగీలు, టవళ్లు, దుప్పట్లు, ఇతర చేనేత వస్త్రాలను సైతం విక్రయానికి పెట్టారు. ఆకర్షణీయమైన రంగుల్లో ఉన్న చేనేత చీరలు, షర్ట్ లు, మోడి జాకెట్ల కొనుగోలుకు మంత్రులు, ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి అనుచరులు, అధికారులు ఆసక్తి చూపారన్నారు. అసెంబ్లీ, సచివాలయ ఉద్యోగులు సైతం చేనేత దుస్తుల కొనుగోలు చేశారన్నారు. వారం రోజుల పాటు నిర్వహించిన స్టాళ్లలలో రూ. 35 లక్షలకు పైగా అమ్మకాలు జరిగాయన్నారు.
స్టాళ్లు ఏర్పాటు చేసిన వివిధ జిల్లాలకు చెందిన నేతన్నలు ఆనందం వ్యక్తంచేశారన్నారు. అసెంబ్లీలో స్టాళ్ల ఏర్పాటుకు అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబుకు, స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ధన్యవాదాలు తెలియజేశారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసిన నేతన్నలకు అండగా నిలిచిన… మంత్రులకు, విప్ లకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఉద్యోగులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చేనేత అమ్మకాల పెరుగుదలకు అసెంబ్లీ స్టాళ్ల మాదిరిగా మరికొన్ని చోట్ల ఇటువంటి స్టాళ్లు, ఎగ్జిబిషన్లు విస్తృతంగా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు.