– మన వైకాపా లిక్కర్ మాఫియాకు ‘ధైర్యం’ ఎక్కువ!
– ఏకంగా ‘సిట్’ పైన.. ‘లంచం’ బాణం!
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఏం అభివృద్ధి చెందిందో లేదో గానీ, వైకాపా నేతల ‘జేబులు’ మాత్రం జెట్ స్పీడ్‌తో పెరిగాయని చెప్పడానికి తాజా మద్యం రవాణా కుంభకోణం ఒక నిలువెత్తు సాక్ష్యం. ఎక్కడైనా తప్పు చేస్తే భయం ఉంటుంది, కానీ మన వైకాపా నేతలకు మాత్రం ‘ధైర్యం’ ఎక్కువ. అది ఎంతలా అంటే, తమ తప్పులను విచారిస్తున్న సిట్ (SIT) అధికారులకే లంచం ఆశ చూపేంత!
కోట్లు కొల్లగొట్టి.. లక్షలతో సరిపెడదామనా?
మద్యం రవాణా కాంట్రాక్టుల్లో ఏకంగా 200 నుంచి 400 కోట్ల రూపాయల మేర దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో ‘చేతివాటం’ ప్రదర్శించిన కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు సునీల్ కుమార్ గారు, తమ పేరు కేసులో రాకుండా ఉండటం కోసం సిట్ అధికారులకు 25 లక్షలు ఇవ్వజూపారట.
“వందల కోట్లు మింగిన తిమింగలాలకు, పాతిక లక్షల ఎర వేస్తే అధికారులు లొంగిపోతారని అనుకోవడం వారి అమాయకత్వమా లేక అహంకారమా?”
నేరాల్లోనూ ‘ఫ్యామిలీ’ ప్యాకేజీ!
వైకాపాలో ఏదైనా పని జరిగితే అది కుటుంబ సమేతంగా జరగాల్సిందే. ఈ కుంభకోణంలోనూ మాజీ మంత్రి గారు, వారి అబ్బాయి, కోడలు ఇలా అంతా కలిసి ఒకే గూటి పక్షులుగా తేలడం విశేషం. సిగ్మా లాజిస్టిక్స్ నుంచి కోట్ల రూపాయల కమీషన్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటూనే, మరోవైపు సాక్షులను బెదిరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్యగా కనిపిస్తోంది.
సందీప్ సాక్ష్యం.. కారుమూరి గుట్టు రట్టు!
పాపం, సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి సందీప్‌ను పిలిచి బెదిరిస్తే అతను భయపడిపోతాడు అనుకున్నారు కాబోలు. కానీ అతను ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు ఈ ‘నీలి’ నేతల పునాదులను కదిలిస్తోంది. మధ్యవర్తుల ద్వారా అధికారులను మేనేజ్ చేయాలనుకున్న వీరి ప్లాన్ వికటించి, ఇప్పుడు కొత్తగా 318(4), 61(2) వంటి సెక్షన్లు మెడకు చుట్టుకున్నాయి.
అయ్యా నేతల్లారా! కోట్లు కొల్లగొట్టేటప్పుడు ఉన్న ప్లానింగ్, ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి లంచం ఇచ్చేటప్పుడు లేకపోవడం విచారకరం. అధికారులకే ఎర వేయాలనుకున్న మీ సాహసానికి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తప్పు చేస్తే చట్టం ముందు తలవంచాలి గానీ, చట్టాన్నే కొనాలనుకోవడం మీ పతనానికి ఆరంభం.
– చాకిరేవు