హఠాత్తుగా నా అలోచనలు నన్ను పిలిచాయి;
నా ఎదురుచూపులు నాకు బాటను వేశాయి.
పదాల నుంచి బయటకొచ్చేశాను,
వాక్యాల నుంచి బయటకొచ్చేశాను,
వ్యాకరణం నుంచి బయటకొచ్చేశాను.
బయటకొచ్చేశాను… బయటకొచ్చేశాను…
ఒకడన్నాడు “నేను విమర్శకుణ్ణి” అని
అతణ్ణి పక్కకు నెట్టేశాను;
ఒకడన్నాడు “నేను విశ్లేషకుణ్ణి ” అని
అతణ్ణి పక్కన పెట్టేశాను.
వ్యాఖ్యానాల నుంచి బయటకొచ్చేశాను;
విశ్లేషణల నుంచి బయటకొచ్చేశాను.
వ్యాకరణం అడ్డుకోలేని అందంలోకి వెళ్లాను;
వాక్యాలు చెప్పలేని అభిరుచిలోకి చేరాను;
పదాలు పంచి ఇవ్వని అనుభూతిని పొందాను.
నేను అనుభావినయ్యాను;
నేను అభివ్యక్తినయ్యాను.
అభిప్రాయాలకు అతీతంగా
నన్ను నేను నడిపించుకున్నాను;
నిర్వచనాల నుంచి విడివడి
నిర్మలతత్త్వంలోకి నడిచాను.
నిర్వాణ భావాల్ని ఆఘ్రాణించాను;
నిజ రసావిష్కారాల్ని ఆస్వాదించాను.
మీరూ నాతో వస్తారా స్వచ్ఛందంగా?
అందఱమూ ఉందామా ఆనందంగా??
రోచిష్మాన్
9444012279