-సామాన్యుడి గొంతు ఎండుతుంటే.. ప్యాలస్‌లోకి వెళ్లిన వేల కోట్లు!
ఈ కుంభకోణంలో షాకింగ్ నిజాలు
గత ఐదేళ్ల జగన్ పాలనలో మద్యం విక్రయాలు కేవలం ప్రభుత్వ ఆదాయ వనరుగా మాత్రమే కాకుండా, ఒక పక్కాగా ప్రణాళికాబద్ధంగా రూపొందించిన “క్యాష్ కన్వర్షన్ సెంటర్”గా మారాయి. సామాన్య ప్రజలు ప్రాణాలకు హానికరమైన ‘జే బ్రాండ్ల’ మద్యం తాగి అనారోగ్యం పాలవుతుంటే, ఆ విక్రయాల వెనుక ఒక భారీ చీకటి సామ్రాజ్యం విస్తరించింది.
ఇది కేవలం మద్యం అమ్మకాల వ్యవహారం కాదు, సామాన్యుడి రక్తాన్ని పిండి, ఆ సొమ్మును అక్రమ మార్గాల్లో మళ్లించిన ఒక వ్యవస్థీకృత నేరం. తాడేపల్లి ప్యాలస్ కేంద్రంగా సాగిన ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలోని లోతుల్ని పరిశీలిస్తే దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి.
నలుపును తెలుపు చేసే లిక్కర్ లాండ్రీ సర్వీసెస్
మద్యం ద్వారా సేకరించిన భారీ మొత్తంలో నగదును హవాలా మార్గాల్లోకి మళ్లించి, తిరిగి ‘వైట్ మనీ’గా మార్చే ఒక వ్యవస్థ ఇక్కడ పనిచేసింది. తాడేపల్లి ప్యాలస్ పరిసరాల్లో కొన్ని ప్రత్యేక కంటైనర్ల రాకపోకల కోసం “గ్రీన్ ఛానల్” ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ కదలికలు వేగవంతం కావడం మీడియలో రాచ్చ అవ్వడం మనకు తెలిసిందే. వైకాపా ప్రభుత్వ అండతో జరిగిన ఒక వ్యవస్థీకృత నేరమని స్పష్టమవుతోంది. ఈ ‘లిక్కర్ లాండ్రీ సర్వీసెస్’ ద్వారా సామాన్యుడి సొమ్ము పక్కదారి పట్టింది.
“సామాన్యుడు జేజే బ్రాండ్ తాగి లివర్ పాడు చేసుకుంటే, ఆ సొమ్ము మాత్రం హవాలా మార్గంలో… మళ్ళీ ‘వైట్’ అయిపోయింది.”
ముంబయి హవాలా – అనిల్ చోఖ్రా నెట్వర్క్
ఈ కుంభకోణంలో తాడేపల్లి ప్యాలస్ నుండి ముంబయి వరకు ఉన్న హవాలా లింకులు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. ముంబయికి చెందిన హవాలా వ్యాపారి అనిల్ చోఖ్రా ఈ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ప్యాలస్ చుట్టుపక్కల నివసించే ప్రజలను, విల్లాల, అపార్ట్మెంట్ల వారిని ఐదేళ్ల పాటు కనీసం రోడ్డు మీద తిరగనివ్వకుండా, కిలోమీటర్ల కొద్దీ దూరం ప్రయాణించేలా కఠిన నిబంధనలు విధించారు. ఈ స్థాయిలో సామాన్య ప్రజలను హింసిస్తూ భద్రతను కట్టుదిట్టం చేయడం వెనుక ఉన్న అసలు రహస్యం.. కంటైనర్ల ద్వారా సాగే ఇటువంటి అక్రమ రవాణాను గుట్టుచప్పుడు కాకుండా సాగించడమేనని ఇప్పుడు అర్థమవుతోంది.
ఇన్వాయిస్ ఇంద్రజాలికుడు రాజ్ కెసిరెడ్డి!
సరుకు కొనరు, సేవలు అందవు.. కానీ వేల కోట్ల రూపాయల నకిలీ ఇన్వాయిస్లు సృష్టించడంలో రాజ్ కెసిరెడ్డి ఇంద్రజాలికుడిలా వ్యవహరించారు. ఆడిట్ ట్రయల్స్‌ను అత్యంత పకడ్బందీగా ధ్వంసం చేయడం, రికార్డులను మాయం చేయడం వంటి చర్యలు చూస్తుంటే ఏదో ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలో హై-టెక్ నేరగాళ్లు చేసే ఆపరేషన్లను తలపిస్తున్నాయి.
ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ విచారణలో తన తప్పును ఒప్పుకుంటూ ‘పెద్దల’ పేర్లు బయటపెట్టడం ఒక ‘సుప్రభాతం’లా విన్పించింది. అయితే, తన బాధ్యతను తోడల్లుడైన రాజ్ కెసిరెడ్డి మీదకు నెట్టేస్తూ ఆయన చెప్పిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి.
“నేను గరెటెలో చేయి పెట్టా కానీ.. కుండలో అన్నం ఉడికిందో లేదో నాకు తెలియదు” అన్నట్లుంది.
రూ. లక్ష కంపెనీలో 60 కోట్ల పెట్టుబడి – వింత లాజిక్!
విజయసాయి రెడ్డి కూతురి బావ అయిన అరబిందో శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన కంపెనీల్లో జరిగిన పెట్టుబడుల తీరు విస్మయానికి గురిచేస్తోంది. కేవలం లక్ష రూపాయల విలువైన కంపెనీలోకి ఏకంగా 60 కోట్ల రూపాయల పెట్టుబడి ఏ ప్రాతిపదికన వచ్చిందో ఏ ఆర్థిక మేధావికీ అర్థం కాని విషయం. లాజిస్టిక్స్ పేరుతో కేవలం కాగితాలకే పరిమితమైన సంస్థలను సృష్టించి, ప్రజల రక్తాన్ని పిండిన సొమ్మును మళ్లించారు. తీరా లాభాలు వచ్చేసరికి వాటాల కోసం వీరు కొట్టుకోవడం చూస్తుంటే, “దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు” తయారైంది వీరి పరిస్థితి.
పక్కా స్క్రిప్ట్ ప్రకారం పరారీ
సిట్ అధికారులు ఏడు గంటల పాటు నిర్వహించిన విచారణలో సంధించిన 80 ప్రశ్నల బాణాలకు అవినాష్ రెడ్డి పలువురు ‘పెద్దల’ పేర్లను వెల్లడించక తప్పలేదు. అయితే, ఈ కేసు దర్యాప్తు ముమ్మరం కాగానే, ‘పెద్దల’ సలహాతో నిందితులు విదేశాలకు పారిపోవడం వెనుక ఒక పక్కా స్క్రిప్ట్ ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తి స్వతంత్రంగా చేసిన తప్పు కాదు, వ్యవస్థలోని ఉన్నత స్థానాల్లో ఉన్నవారి అండదండలతో, ఒక పద్ధతి ప్రకారం జరిగిన భారీ వ్యవస్థాగత కుట్ర.
వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విక్రయాలు సామాన్యుడి ప్రాణాలతో చెలగాటమాడే ఒక “అవినీతి ప్రయోగశాల”గా మారాయి. పేదవాడి రక్తాన్ని పిండి, హవాలా మార్గాల్లో మళ్లించి కూడబెట్టిన ఈ అక్రమ సంపాదన వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనేది ఒక్కొక్కటిగా బయటపడుతోంది. అవినాష్ రెడ్డి వంటి వారు “నాకు తెలియదు” అని తప్పించుకోవాలని చూస్తున్నా, ఆ డబ్బు వెళ్లే అసలు ‘చిరునామా’ ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది.