– రావుల చంద్రశేఖర్ రెడ్డి
హైదరాబాద్: ప్రముఖ కవి, సాహితీవేత్త, తెలంగాణ ఉద్యమ గొంతుక నందిని సిధారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేస్తూ, సిధారెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. “నందిని సిధారెడ్డి తన కలం ద్వారా తెలంగాణ మట్టి వాసనను, ఇక్కడి ప్రజల జీవన పోరాటాలను, ఆకాంక్షలను ప్రపంచానికి చాటిచెప్పారు. దశాబ్దాలుగా వారు చేస్తున్న సాహిత్య కృషికి, నిబద్ధతకు ఈ పురస్కారం దక్కడం సముచితం. ఇది తెలుగు సాహిత్యానికే గర్వకారణం” అని కొనియాడారు.
తెలంగాణ సాయుధ పోరాటం నుండి మలిదశ ఉద్యమం వరకు సిధారెడ్డి అందించిన స్ఫూర్తి చిరస్మరణీయమని, వారి రచనలు ఎందరో యువ కవులకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సిధారెడ్డి మరిన్ని అద్భుతమైన రచనలు చేస్తూ, ఇలాంటి ఉన్నత పురస్కారాలు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు…