– కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి
– మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.
– ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వద్ద చేపట్టిన ఆందోళన
హైదరాబాద్: నీట్-యుజి 2026 పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో హైద్రాబాద్లోని ఆర్టీ సీ ఎక్స్ రోడ్డు వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొని, నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… “నీట్ పేపర్ లీకేజీ అనేది దురదృష్టకరం మరియు బాధాకరం. లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రుల డాక్టర్ కావాలనే కలలు ఈ లీకేజీతో కృంగిపోయాయి. కష్టపడి చదువుకున్న అర్హులైన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయింది. అర్హత లేని వ్యక్తులు డాక్టర్లు అయితే దేశానికి ఎలాంటి సేవలు అందించగలరు?” అని ప్రశ్నించారు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన ఏజెన్సీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ను పూర్తిగా రద్దు చేయాలి. బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు రూపొందించాలి. పేపర్ లీకేజీ చేసిన వారికి ఉరి శిక్ష విధించేలా చట్టాలను సవరించాలి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే పరీక్షలను ఒక్క ఏజెన్సీ చేతుల్లో పెట్టడం సరైన పద్ధతి కాదు, కేంద్రానికి నిర్వహించే శక్తి లేనప్పుడు, రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలి.
సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపి, లీకేజీలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ సంఘటనపై స్పందించి విద్యార్థులకు భరోసా కల్పించాలి. “గతంలో మహబూబ్నగర్ రైలు ప్రమాదం సందర్భంగా రైల్వే మంత్రి రాజీనామా చేశారు. అదే విధంగా ఈ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి” అని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సురేష్, నందగోపాల్, సాయి, సతీష్, ప్రవీణ్, హరి శంకర్, వినయ్, వినోద్ మరియు తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.