– రియల్ ఎస్టేట్ బ్రోకర్ సీఎం అయితే కన్ను అంతా భూముల మీదే
– మీలాగా రాహుల్ గాంధీని ‘ముద్దపప్పు’ అని అవమానించలేదు
– సభలో బుల్డోజర్ నడిపిన ప్రభుత్వం
– ప్రజలపై చోర్ మోడల్ పాలన”
– సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలో సరుకు, సబ్జెక్టు లేకపోయిందని, ఆరు గ్యారంటీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ప్రజలను మోసం చేసే విధంగా సభను వేదికగా ఉపయోగించుకున్నారని మండిపడ్డారు.
“ప్రేమ కూడా లేదు ఈ ప్రభుత్వానికి. గవర్నర్ తో పచ్చి అబద్ధాలు చెప్పించినందుకు మేము చెప్పాల్సింది అభినందన కాదు, అభిశంసన. ముఖ్యమంత్రి నోరు పారేసుకుని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన విమర్శించారు. “పేదల ఇండ్ల మీద మాత్రమే కాదు, అసెంబ్లీలో కూడా బుల్డోజర్ నడిపారు. రెండున్నర గంటలు పిచ్చి వాగుడు వాగి, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా సభను రద్దు చేసుకుని పారిపోయిన సన్నాసి ముఖ్యమంత్రి” అని తీవ్రంగా విమర్శించారు.
ముఖ్యమంత్రి ప్రవర్తనను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. “ముఖ్యమంత్రి లాగా కాదు, ఒక వీధి రౌడీ లాగా మాట్లాడుతున్నారు. ‘తొక్కుకుంటూ వచ్చినా, తొక్కుకుంటూ పోతా’ అంటూ రౌడీ దర్బార్ నడిపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులనే తొక్కుకుంటూ వచ్చి, పేమెంట్ కోటాలో వెయ్యి కోట్లు ఢిల్లీకి ఇచ్చి సీటు తెచ్చుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, “అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే స్పీకర్ రికార్డుల నుంచి తొలగించాలి” అని కోరారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. “ఒక్క ఫ్రీ బస్సు తప్ప మిగతా గ్యారంటీలు అన్నీ తుస్సు. ఆరు గ్యారంటీలకు మంగళం పాడి, ఇప్పుడు Cure, Pure, Rare అంటూ కొత్త మాటలు చెబుతున్నారు. ఇది చోర్ మోడల్, 420 మోడల్ పాలన తప్ప మరేమీ కాదు” అని అన్నారు.
బడ్జెట్ సమావేశాలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. “ఇది బడ్జెట్ సెషనా లేక కాంగ్రెస్ హిస్టరీ సెషనా అన్నది కూడా అర్థం కాలేదు. నెహ్రూ నుంచి ప్రారంభించి కుటుంబ గాధలు చెప్పడం తప్ప ప్రజలకు ఉపయోగపడే విషయాలు లేవు” అని అన్నారు.
రైతులు, నిరుద్యోగులు, పేదల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. “రైతు బంధు ఎవరి ఖాతాలో వేశారు? రైతుల ఖాతాలోనా, రాహుల్ గాంధీ ఖాతాలోనా? 11 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారు. ఉద్యోగుల పీఆర్సీపై ఒక్క మాట లేదు. గురుకులాల్లో విద్యార్థులు విషాహారం తిని చనిపోతున్నా స్పందన లేదు” అని విమర్శించారు.
మూసీ ప్రాజెక్ట్ పేరుతో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ, “16 వేల కోట్ల పని కోసం లక్షన్నర కోట్ల ప్రణాళిక ఎందుకు? డిపిఆర్ లేదు, ప్రణాళిక లేదు, నిధులు లేవు. ఇది కేవలం దోపిడీ కోసం తీసుకున్న నిర్ణయం” అని అన్నారు. పేదల ఇండ్ల కూల్చివేతలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. “రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. కానీ వేలాది ఇండ్లు కూల్చేశారు. ఇది రాక్షస పాలన” అని విమర్శించారు.
భూములపై ప్రభుత్వ దృష్టి ఉందని ఆరోపిస్తూ, “రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే కన్ను అంతా భూముల మీదే ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇతర సంస్థల భూములను ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తూ, “మిషన్ కాకతీయ ద్వారా 30 వేల చెరువులు అభివృద్ధి చేశాం. కానీ ఈ ప్రభుత్వం మూడు చెరువులు చేసి డబ్బా కొడుతోంది” అని అన్నారు.
నాలుగు వేల పెన్షన్ వచ్చిందా? మహిళలకు రెండున్నర వేల రూపాయలు వచ్చాయా? తులం బంగారం ఎవరికైనా ఇచ్చారా? దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇచ్చారా? ఇదే శాసనసభలో మా నాయకుడు కేసీఆర్. సోనియా గాంధీ కి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. కానీ మీలాగా ‘బలి దేవత’ అని అనలేదు. మీలాగా రాహుల్ గాంధీని ‘ముద్దపప్పు’ అని అవమానించలేదు. మీలాగా రాజశేఖర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు, మీ అనుచరులు రాష్ట్ర రాజధాని చుట్టూ ఉన్న భూములపై ఎలా దోపిడీ చేస్తున్నారో ప్రజలకు తెలిసిందే. అనుముల కుటుంబం మొత్తం ఒక దండుపాళ్యం ముఠాగా వ్యవహరిస్తోంది.
రేవంత్ రెడ్డి గారూ… కేసీఆర్గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఆయన తెలంగాణను సాధించిన నాయకుడు. ఆయన సాధారణ నాయకుడు కాదు. ఉద్యమాలతో రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఢిల్లీని వంగదీసిన నాయకుడు. మీలా చిల్లర రాజకీయాలు చేసి, ఆర్టీఐ పేరుతో బ్లాక్మెయిల్ చేసి ఎదిగిన వ్యక్తి ఆయన కాదు. ఆయన కాలి గోటికి కూడా మీరు సరిపోరు.