– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించే దిశగా కీలకంగా భావిస్తున్న కొహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణ పనులు తుది దశలోకి చేరుకున్నాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు కొహెడ సమగ్ర మార్కెట్‌కు సంబంధించిన సవరించిన లేఅవుట్పై మార్కెటింగ్ అధికారులతో ఈ రోజు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల… రైతులు, వ్యాపారులు మరియు ఇతర భాగస్వాముల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు రూపకల్పనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.
ప్రాజెక్టును 3 దశలలో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. తొలి దశ నిర్మాణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్ 9న మార్కెట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం బాటసింగారం మార్కెట్లో కొనసాగుతున్న లావాదేవీలను కొహెడ సమగ్ర మార్కెట్‌కు సాఫీగా తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులు, వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సమన్వయంతో తరలింపు ప్రక్రియను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 9 నుంచే కొహెడ మార్కెట్లో లావాదేవీలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
కొహెడ సమగ్ర మార్కెట్‌ను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఓపెన్ ప్లాట్‌ఫారాలు, ట్రక్ డాకింగ్ షెడ్లు, డ్రైయింగ్ యార్డులు, విశాల రహదారులు, రవాణా సౌకర్యాలు, పారదర్శక లావాదేవీల కోసం సాంకేతిక వసతులు, రైతులకు అవసరమైన అన్ని సేవలను అందుబాటులో ఉంచేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సమగ్ర మార్కెట్ ద్వారా రైతులకు తమ ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు, మధ్యవర్తుల ప్రభావం తగ్గి, పారదర్శక మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధిలో కొహెడ సమగ్ర మార్కెట్ మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.
మొత్తం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన తుది ప్రతిపాదనను ముఖ్యమంత్రికి ఆమోదం కోసం సమర్పిస్తున్నామని వెల్లడించారు