– ఏపీ పేరు పక్క రాష్ట్రం.. తెలుగు రాష్ట్రమట
– ఏపీ పేరు- ఎన్టీఆర్ పేరు చెప్పకుండానే ఆయన పేరు అవార్డు తీసుకున్న చిరంజీవి
– దానిపై విమర్శలు రావడంతో దిద్దుబాటు
– ఎన్టీఆర్ మహానుభావుడంటూ ట్వీట్
– రేవంత్‌రెడ్డి సినీ పరిశ్రమను బాగా ప్రోత్సహిస్తున్నారని భజన
– పక్క రాష్ట్రం అట్లా ప్రోత్సహించడం లేదంటూ ‘చిరు’ అసంతృప్తి
– తెలంగాణ మాదిరిగా ఏపీ కూడా ఆవిధంగా సినిమాను ప్రోత్సహించాలట
– జగన్, కేసీఆర్ అవార్డులివ్వకపోయినా నోరెత్తని చిరంజీవి
– జగన్ అవమానించి నడిపించినా కిమ్మనని చిరంజీవి అండ్ కో
– జగన్ మూడు రాజధానుల విధానాన్ని సమర్ధించిన చిరంజీవి
– అమరావతి రైతులు తమకు మద్దతునివ్వాలని రోడ్డుపై నిల్చున్నా కారు ఆపని చిరంజీవి టీమ్
– ఆస్తులు హైదరాబాద్‌లో.. కలెక్షన్లు ఆంధ్రాలోనా?
– ఏపీలో ఎక్స్ట్రా షోలు.. ఎక్స్స్ ట్రా టికెట్ రేట్లతో సిని‘మా’కు కనకవర్షం
– అల్లు అర్జున్ అరెస్టు.. నాగార్జున ఫంక్షన్‌హాల్ కూల్చివేతను ఖండించని మెగాస్టార్
– సిని‘మా’ భజన చూసి సిగ్గుపడుతున్న ‘విదూషకులు’
– ‘మెగా’ది ఎప్పుడూ ఏ రోటికాడ ఆ రోటిపాట అంటూ ఏపీ వాసుల ఆగ్రహం
– అసలు సినీ పరిశ్రమతో ఏపీకి ఏం సంబంధమంటూ ఏపీ ప్రజల ప్రశ్నల వర్షం
– చిరును ప్రసన్నం చేసుకునేందుకే మంత్రి దుర్గేష్ నంది అవార్డుల ప్రకటన?
– క్యాబినెట్లో చర్చించకుండానే నంది అవార్డులపై ప్రకటనా?
– దుర్గేష్ చిరంజీవి ప్రతినిధా? ఏపీ ప్రజలకు ప్రతినిధా అంటూ తమ్ముళ్ల ఆగ్రహం
– చిరంజీవి తీరుపై రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు
– మంత్రి దుర్గేష్ ప్రకటనపై సోషల్‌మీడియా ఎదురుదాడి
(మార్తి సుబ్రహ్మణ్యం)
పూర్వకాలంలో పాలనతో అలసిపోయే రాజులను విదూషకులు తమ పొగడ్తల ‘భజన’ కార్యక్రమాలతో మెప్పించేవారు. రాజు గారూ వాటిని బాగా ఆస్వాదించేవారు. ‘నవ్వు.. నవ్వించు.. మా నవ్వులు పండించు’ అంటూ.. అటు రాజు గారు కూడా వారి భజనను అంతే తాదాత్మ్యంతో విని, నజరానాలు గిరాటు వేసేవారు.
ఇప్పుడు రాజులు పోయారు. రాజరికాలూ పోయాయి. అయినా ‘విదూషకుల వ్యవస్థ’ మాత్రం, వివిధ రూపాల్లో నిర్విఘ్నంగా కొనసాగుతోంది. సజీవంగా కనిపిస్తోంది. అది మీడియా కావచ్చు. సినిమా కావచ్చు. సినిమా స్టార్లు కావచ్చు. మెగా స్టార్లు కావచ్చు. ఒక్కోరిదీ ఒక్కో అవసరం. అందరిదీ ‘ఆర్ట్ ఆఫ్ లివింగే’. అంటే ‘బతకనేర్చే కళ’ అన్నమాట.
గత మూడు రోజుల నుంచి సొషల్మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి.. సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో.. ఆయనను కీర్తిసూ ‘భజన’ చేసిన క్రమంలో వాడిన పదాలు.. చేసిన వ్యాఖ్యలు వైరల్ అయి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాయి. పోనీ చిరంజీవేమీ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన వ్యక్తేమీ కాదు. స్వతహాగా పశ్చిమ గోదావరి జిల్లా వాసి. ఏపీ నియోజకవర్గంలో గెలిచి ఎమ్మెల్యే అయిన మాజీ నాయకుడు.
అయినా తానేదో ‘పుట్టు తెలంగాణ’వాసిలా, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని-తెలంగాణ ప్రభుత్వాన్ని జమిలిగా కీర్తిస్తూ.. పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని మాత్రం నేరుగా విమర్శించకుండా, కూటమి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడమే, ఏపీ ప్రజలు- తెలుగుదేశం కార్యకర్తల ఆగ్రహానికి అసలు కారణం. చిరంజీవి భాషలో ‘పక్క రాష్ట్రమయిన’ ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వంలో.. తన తమ్ముడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అన్న స్పృహను, ఆ ‘భజనాలందలహరి’ కార్యక్రమంలో చిరంజీవి కోల్పోయినట్లు కనిపిస్తోందన్నది విజ్ఞుల ఉవాచ.
ఇంతకూ.. ఆంధ్రా ఓట్లతో ఎమ్మెల్యే, ఆ తర్వాత కేంద్రమంత్రి అయిన చిరంజీవి గద్దర్ సినిమా అవార్డుల ఫంక్షన్లో ఏమన్నారో ఓసారి చూద్దాం. ‘‘ మన పక్క రాష్ట్రమైన మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల వాళ్లను ప్రోత్సహించే విషయంలో కొంచెం వెనకంజలో ఉంది కాబట్టి, సినిమా వారికి అతి దగ్గరగా ఉండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు దీనిని (అంటే తెలంగాణా రాష్ట్రాన్ని) స్ఫూర్తిగా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే, మీరిచ్చే ప్రోత్సాహంతో ఎంతోమంది యువకులు ఉత్సాహంగా సినిమాలు చేస్తారు’’- ఇదీ మెగాస్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్-ఎమ్మెల్సీ నాగబాబు సోదరుడయిన చిరంజీవి ‘అన్నయ్య’, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయనను ఆకాశానికెత్తుతూ చేసిన వ్యాఖ్యలివి!
మొగల్తూరు ముద్దుబిడ్డ, ఆ గ్రామాభివృద్ధికి ‘వందలకోట్లు’ విరాళంగా ఇవ్వడమే కాకుండా.. తన నివాసాన్ని గ్రామ ప్రజలకు ‘నయాపైసా తీసుకోకుండా’ ‘లైబ్రరీ’కి ఉచితంగా ఇచ్చిన పెద్దమనసున్న ఆంధ్రుల ‘అన్నయ్య’, తన ప్రసంగంలో ఏపీ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా.. ‘పక్క రాష్ట్రం-తెలుగు రాష్ట్రం’ అంటూ సంబోధించడమే వింత! బహుశా ఏపీ పేరు చెప్పడానికి ‘ఆంధ్రా’ అన్నయ్య ‘తెలంగాణ తాదాత్మ్యం’తో, మొహమాటపడి ఉంటారు కామోసు! ఎవరి మొహమాటం వారిది. ఎవరి ఇబ్బందులు వారివి!! మరేటి సేత్తం?
ఇంతకూ మన మెగాస్టార్ చిరంజీవి గారి బాధేమిటంటే.. ఏపీ సర్కారు కూడా తెలంగాణ పాలకుల మాదిరిగా సినిమా అవార్డులిచ్చి, కళాకారులు ప్రోత్సహించాలట. ఇప్పటివరకూ కూటమి ప్రభుత్వం ఆ పనిచేయడంలో వెనకబడి పోయిందట. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లాంటి ‘సీనియర్’ను స్ఫూర్తిగా తీసుకోవాలట.
పోనీ ఆ ముక్కేదో నేరుగా.. ఏపీ ప్రభుత్వం కూడా కళకారులకు నంది అవార్డులివ్వాలని చెబితే సరిపోయేది. హుందాగా ఉండేది. కానీ ఏపీ పేరు ఎత్తకుండా.. ‘పక్కరాష్టం-తెలుగు రాష్ట్రం’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కి.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును- కూటమి ప్రభుత్వాన్ని- మొత్తంగా ఏపీ ప్రజలను అవమానించడం ఎందుకన్నది ఏపీ ప్రజలు-ముఖ్యంగా టీడీపీ సైనికుల ఆగ్రహం.
సరే ‘అన్నయ్య’ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ అవార్డు తీసుకుంటున్న సందర్భంలోనయినా, ఆ మహానటుడి పేరు ప్రస్తావించారా అంటే అదీ లేదు. సహజంగా ఎవరైనా ఫలానా వ్యక్తి పేరిట తమకు అవార్డులు ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తి గొప్పతనాన్ని ప్రశంసించి, సదరు వ్యక్తి అవార్డు తనకు ఇవ్వడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు వేదికపై చెప్పటం కనీస ధర్మం. హుందాతనం-మర్యాద-కృతజ్ఞత ఉన్న ఎవరయినా చేసేది అదే.
కానీ చిరంజీవి ‘అన్నయ్య’ మాత్రం, కనీసం మాటవరసకయినా ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకపోవడాన్ని.. తెలుగుతమ్ముళ్లు-ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రధానంగా ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహజ్వాలతో, సోషల్‌మీడియా అట్టుడికిపోయింది. ‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇచ్చి అన్నగారిని అవమానించింది’ అంటూ శివతాండవం చేశారు.
దానితో నష్టనివారణకు దిగిన చిరంజీవి ‘అన్నయ్య’ ఎక్స్‌లో ఒక పోస్టు చేసి, చేతులుదులుపేసుకున్నారు. ‘చరిత్రకర్తగా నిలచిన నందమూరి తారకరామారావు గారు తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకువెళ్లిన మహాకళాకారుడు. ఎన్టీఆర్ అంటే ఎన్..నాట్యం, టీ..తాళం.., ఆర్.. రాగం. కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడి పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నా’’ అంటూ రొటీన్‌గా పీఆర్వో రాసిన ప్రకటనను ట్వీట్ చేశారు.
సంతోషం. బాగానే ఉంది. మరి ఆ ముక్కేదో వేదికపైనే చెప్పి ఉంటే సరిపోయేది కదా? విమర్శలు వచ్చిన తర్వాత దిద్దుబాటకు దిగి చేసే వివరణతో అన్న అభిమానులను నమ్మించడం ఎందుకు? అంటూ ఎన్టీఆర్ అభిమానులు విరుచుకుపడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల వేదికపై.. చిరంజీవి వ్యవహారశైలి చూసిన ఏపీ ప్రజలు-తెలుగుతమ్ముళ్లు, సోషల్‌మీడియా వేదికగా గత మూడురోజుల నుంచి సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు.. యూట్యూబర్లు పేలుస్తున్న విమర్శనాస్త్రాలతో మెగాస్టార్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
‘అసలు చిరంజీవికి ఏపీతో ఏం సంబంధం? ఆయనేమైనా ఇక్కడ స్టుడియో కట్టారా? బ్లడ్‌బ్యాంక్ పెట్టారా? ఆయన పెట్టుబడులేమైనా ఇక్కడ ఉన్నాయా? ఒక్క చిరంజీవి మాత్రమే కాదు. సినిమా హీరోలు-నిర్మాతలకు ఏపీలో-ఏపీతో ఏం పని? వాళ్ల పెట్టుబడులు-వ్యాపారాలన్నీ హైదరాబాద్‌లోనే కదా? పన్నుకట్టేది తెలంగాణకు కదా? వాళ్లకు విశాఖలో స్టుడియోలకు స్థలం ఇస్తే కట్టారా? ఎన్టీఆర్ , నాగేశ్వరరావు, కృష్ణ ఆరోజుల్లో తెగించి మద్రాసు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాతనే కదా చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందింది? రామానాయుడు, రామోజీరావు స్టుడియోలు కూడా టీడీపీ హయాంలోనే కదా నిర్మాణాలు చేసింది?
చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, అల్లు అర్జున్, మహేష్, దిల్ రాజు ఏపీలో స్టుడియోలు ఎందుకు కట్టలేదు? వ్యాపారాల కోసం సినిమా హాళ్లు లీజుకు తీసుకున్నారు తప్ప, ఇక్కడ స్టుడియోలు ఎందుకు కట్టలేదు? షూటింగులకు ఏపీలో అందమైన లోకేషన్లు లేవా? తెలుగు సినీ పరిశ్రమను ఏపీకి తరలించకుండా, కొత్త సినిమాలకు రేట్లు-అదనపు షోలు పెంచుకోవడానికి సిగ్గేయడం లేదా? ఏపీకి నయా పైసా పనికిరాని సినిమా పరిశ్రమకు రాయితీలివ్వడానికి ఏపీ ప్రభుత్వానికీ సిగ్గులేద’ంటూ సోషల్‌మీడియా సైనికులు శివమెత్తుతున్నారు.
ఇక తెలంగాణ లెక్క.. ఆంధ్రా సర్కారు కూడా అవార్డులివ్వాలంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యపై, టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడుసార్లు నంది అవార్డులిచ్చిన విషయాన్ని టీడీపీ సోషల్‌మీడియా సైనికులు గుర్తు చేస్తున్నారు. ‘నంది అవార్డులకు కులం రంగు పూసి గబ్బు చేసుకుంది మీరు. అవి ఆగపోవడానికి మీ ముఠా తగాదాలే కారణం. ఆ చికాకుతోనే ప్రభుత్వం నంది అవార్డులు నిలిపివేసింది’ అంటూ పసుపు సైనికులు, సోషల్‌మీడియాలో అగ్గిరాముళ్లలవుతున్నారు.
అసలు సినిమా పరిశ్రమ వల్ల రాష్ట్రానికి నయాపైసా లాభం లేనప్పుడు, ప్రజాధనంతో వారికి నంది అవార్డులు ఎందుకు ఇవ్వాలన్నది ఏపీ ప్రజలు సంధిస్తున్న ప్రశ్న. ఏపీలో పుట్టి-పెరిగి-హైదరాబాద్‌లో ఆస్తులు కూడబెట్టి, వాటిని కాపాడుకునేందుకు తెలంగాణ పాలకులకు సాగిలబడి, ఏపీని అవమానిస్తున్న వారి సినిమాలకు, టిె ట్లు రే ట్లు పెంచుకునే అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ఏపీ ప్రభుత్వానికి ఆ పాటి పౌరుషం-ఆత్మాభిమానం లేదా? సినిమా వాళ్లకు సలాం చేసి గులాంగిరీ చేయాలా?
పెద్ద హీరోలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏపీలో ఎందుకు చేయరు? ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ హీరోలు ఆదుకున్నారా? ఒకవేళ ఆదుకున్నా వారికొచ్చే ఆదాయంతో పోలిస్తే వారిచ్చే విరాళాలు పిసరంతే కదా? మరి అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వం, సినిమావాళ్లకు ఎందుకు టికెట్ రేట్లు పెంచి సామాన్యులపై భారం వేయాలి? అదనపు షోలకు అనుమతించి సినిమావాళ్లను ఎందుకు కోటీశ్వరులను చేయాలి? అంటే ఏపీ ప్రభుత్వానికి ఆత్మాభిమానం లేదా’’ అంటూ సోషల్‌మీడియాలో విరుచుకుపడుతున్నారు.
సొంత గడ్డపై ఎవరికయినా అభిమానం ఉంటుంది. ఆ ప్రజల సమస్యలపై కనీస సానుభూతి ఉంటుంది. తెలుగువ్యక్తి కాని సోనూ సూద్ అనే ఉత్తరాది క్యారక్టర్ ఆర్టిస్టు, కరోనా సమయంలో చేసిన సాయం గొప్పది. కానీ ఏపీ ప్రజల సొమ్ముతో కోట్లకు పడగలెత్తిన చిరంజీవి సహా.. తెలుగు హీరోలెవరికీ సొంత గడ్డపై మాత్రమే కాదు. ఆ ప్రజల సమస్యలపై ఏమాత్రం సానుభూతి లేకపోవడం క్షంతవ్యం కాదు.
జగన్ సీఎంగా ఉన్న సమయంలో.. ఆయనను కలిసేందుకు ప్రత్యేక విమానంలో చిరంజీవి, మహేష్, ప్రభాస్, నాగార్జున వంటి పెద్ద హీరోలు తాడేపల్లికి వచ్చినప్పుడు.. తమకు మద్దతునీయాలంటూ వారి మద్దతు కోరేందుకు, అమరావతి రైతులు రోడ్డుపై నిలబడ్డారు. ఒక్క నిమిషం తమకు కేటాయించాలని అభ్యర్థించారు. కానీ ఏపీలో పుట్టిన ఆ తెలుగు హీరోలు, నిర్దయగా వారితో కలవకుండా కారెక్కి, గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లారు.
పైగా మెగాస్టార్ చిరంజీవి ‘అన్నయ్య’.. జగనన్నపై ఉన్న అపార-అవ్యాజానురాగాలతో, మూడు రాజధానుల ప్రతిపాదనను మెచ్చుకున్నారు. మూడు రాజధానులతో రాష్ట్రం ఆఫ్రికా మాదిరిగా అభివృద్ధి చెందుతుందని ప్రవచించారు.
మరి అమరావతికి మద్దతునీయకుండా-తెలంగాణ గడ్డపై నుంచి ఏపీని అవమానించే హీరోల కొత్త సినిమాలకు రేట్లు పెంచడం, ఈ మంచి ప్రభుత్వానికి సబబేనా? ఆ పాటి ఆత్మాభిమానం-పౌరుషం కూటమి సర్కారుకు లేదా? వారితో ఉన్న మొహమాటంతో హీరోల సినిమాలకు రేట్లు పెంచడం ద్వారా.. అమరావతి రైతులను అవమానించిన వారికి ప్రభుత్వమే చేయూతనివ్వడం, ఏపీ ప్రజలను అవమానించడం కదా? అసలు ఏపీలో సినిమా స్టుడియోలు, డబ్బింగ్ థియేటర్లు లేవు కాబట్టి, సినిమాటోగ్రఫీ శాఖ అవసరమా? అన్నది ఇప్పుడు సోషల్‌మీడియా సైనికులు, కూటమి సర్కారుపై సంధిస్తున్న ప్రశ్నలు. జవాబు చెప్పే ధైర్యం ఉందా?
ఏపీ సర్కారు నంది ఇవ్వడం లేదంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో, పరోక్షంగా తన అసంతృప్తి వ్యక్తం చేసిన ఇదే చిరంజీవి ‘అన్నయ్య’.. పదేళ్లు తెలంగాణ సీఎంగా పనిచేసిన కేసీఆర్ హయాంలోగానీ, ఐదేళ్లు ఏపీ సీఎంగా చేసిన జగన్‌ను గానీ ప్రశ్నిస్తే ఒట్టు. ‘మాకు అవార్డులు ఎందుకు ఇవ్వర’ని గర్జించిన దాఖలాలు, భూతద్దం వేసినా కనిపించవు. ఆయనొక్కడే కాదు. ఎవరికీ ప్రశ్నించే దమ్ము లేకుండా పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం.. న వరంధ్రాలూ మూసుకుని, కేసీఆర్-జగన్‌కు సాగిలబడిందన్నది మనం మనుషులం అన్నంత నిజం.
జగన్ సీఎంగా ఉన్నప్పుడు తెలుగు సినిమా హీరోలను ఓసారి తన వద్దకు పిలిపించుకోవాలని ముచ్చట పడ్డారు. అంతే! చిరంజీవి, నాగార్జున, మహేష్, ప్రభాస్ వంటి అగ్రహీరోలంతా ప్రత్యేక విమానం వేసుకుని తాడేపల్లికి వచ్చారు. అదే చంద్రబాబునాయుడు సీఎంగా ఉంటే, వారికి గేటు నుంచే రాచమర్యాదలు మొదలయ్యేవి. వారిని స్వాగతించడం దగ్గర నుంచి.. తిరిగి వెళ్లే వీడ్కోలు వరకూ చంద్రబాబు దగ్గరుండి మరీ చూసుకుంటారు.
కానీ జగనన్నయ్య అందుకు భిన్నం. వారిని గేటు నుంచే నడిపించారు. అంతేనా? తన కోసం వారిని వేచి ఉండేలా చేశారు. ఆ సందర్భంలో మెగాస్టార్.. జగన్ వద్ద చేతులు జోడించి అభ్యర్ధిస్తూ మాట్లాడిన మాటలు-వీడియో-ఫొటోలను నాటి సీఎంఓనే మీడియాకు విడుదల చేసింది.
ఇప్పుడు అదే చిరంజీవి.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో.. ఏపీ ప్రభుత్వం కళాకారులకు ఏమీ చేయడం లేదు కాబట్టి, తెలంగాణ ప్రభుత్వాన్ని స్పూర్తిగా తీసుకోవాలని ఉపదేశించే స్థాయికి వచ్చారంటే.. అది కూటమి సర్కారు బలహీనతా? చిరంజీవి బలమా? అన్నదే ప్రశ్న.
ఏపి సర్కారు సినిమా అవార్డులు ఇవ్వడం లేదంటూ మాట్లాడిన చిరంజీవి ధైర్యం.. అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించినప్పుడు దానిని ఇదే చిరంజీవి, ఒక సాటి కళాకారుడిగా ఎందుకు ఖండించలేదు? తన మిత్రుడైన నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను ఇదే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూలిస్తే చిరంజీవి ఎందుకు ఖండించలేదు? అన్న ప్రశ్నలతో సోషల్‌మీడియా హోరెత్తుతోంది.
కందుల దుర్గేష్ ఎవరి ప్రతినిధి?
ఒక నటుడు తాను మంత్రిగా ఉన్న ప్రభుత్వాన్ని.. అది కూడా తన శాఖకు సంబంధించిన అంశంపై విమర్శ చేస్తే, సదరు మంత్రి ఏ స్థాయిలో స్పందించి ఎదురుదాడి చేయాలి? ధీటైన సమాధానం ఇచ్చి, సదరు విమర్శకుడి నోరు మూయించాలి కదా? కానీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ విషయంలో చేసింది అందుకు భిన్నం.
‘‘అవార్డులిచ్చి ప్రోత్సహించే విషయంలో ఏపీ ప్రభుత్వం వెనకబడినందున, ఆ విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల’’ంటూ ఏపీని అవమానించిన చిరంజీవి వ్యాఖ్యలను, సంబంధిత శాఖ మంత్రి దుర్గేష్ కనీసం ఖండించకపోవడమే ఆశ్చర్యం.
పైగా.. చిరంజీవి మాటలకు యుద్ధప్రాతిపదికన స్పందించి.. త్వరలో నంది అవార్డులు ప్రకటిస్తామని ప్రకటించడం చూస్తే, కందుల దుర్గేష్ మెగాస్టార్ చిరంజీవికి ప్రతినిధా? లేక ఏపీ ప్రజలు-ప్రభుత్వానికి ప్రతినిధా? ఈరకమైన ప్రశ్నల విషయంలో మంత్రి ఒక్క చిరంజీవి విమర్శకే స్పందిస్తారా? లేక ఏ నటుడు విమర్శించినా ఇలాగే స్పందిస్తారా? ప్రభుత్వాన్ని-ప్రజలను అవమానించిన హీరోకు ఒక మంత్రి అంత సాగిలబడుతున్నారంటే.. ఆయన చిరంజీవి వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారా? అది ప్రభుత్వ అభిప్రాయమా? ఒకవేళ ప్రభుత్వ అభిప్రాయమే అయితే, ప్రభుత్వం తనపై విమర్శలు చేసిన చిరంజీవి వ్యాఖ్యలను ఆమోదిస్తుందా? అన్న ప్రశ్నలు సోషల్‌మీడియాలో మార్మోగిపోతున్నాయి.
జనసేన మౌనం అంగీకారమా?
కాగా అవార్డుల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించి, తెలంగాణ గడ్డపై నుంచి ఏపీ ప్రజలను అవమానించిన చిరంజీవి వ్యాఖ్యలపై.. కూటమి భాగస్వామి-ఒక రాజకీయ పార్టీగా జనసేన ఇప్పటివరకూ స్పందించకపోవడమే ఆశ్చర్యం. అంటే సినిమాను ప్రోత్సహించడంలో ఏపీ ప్రభుత్వం వెనకబడిందన్న చిరంజీవి వ్యాఖ్యలను, జనసేన ఖండించడం లేదంటే.. దానిని జనసేన అంగీకరించినట్లేనా? అవార్డులివ్వడంలో తాను భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం విఫలమయిందని ఒప్పుకోవడమే కదా? ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వమే ఉత్తమమన్న చిరంజీవి వ్యాఖ్యలను సమర్ధించినట్లే కదా? ఎన్టీఆర్ పేరు చెప్పకపోవడాన్ని కూడా బలపరుస్తున్నట్లే కదా? అన్నది సోషల్‌మీడియాలో ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్.