– ఏపీ జెన్కో నుండి ఎస్పీడీసీఎల్ కు డీఈ దుర్గా ప్రసాద్
– రెడ్కో ఎండీగా ఆంధ్రా ప్రాంత అధికారి
– విద్యుత్ సంస్థల డైరెక్టర్ పోస్టుల్లోనూ ఆంధ్రా ప్రాంత అధికారులే
– తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్న సర్కారు
– ఆనాడు చంద్రబాబు కోసం బ్యాగులు మోసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరోసారి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు
– బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో.. ఉద్యోగాల అంశం ఆనాడు కీలకంగా ఉంది. ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు తెలంగాణ యువతకు, ఇక్కడి ఉద్యోగులకు దక్కాల్సిన పదవులకు లాక్కుంటున్నారని.. దానికి అడ్డుకట్ట వేయాలని ఆనాడు ఉద్యమం చేశాం.
కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గద్దెనెక్కగానే మళ్లీ ఆంధ్రా ప్రాంత ఉద్యోగులను తీసుకొచ్చి, తెలంగాణలో రాచమర్యాదలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్యుత్ శాఖను పూర్తిగా ఆంధ్రా ప్రాంత ఉద్యోగులతో నింపేస్తున్నారు. కీలకపదవులన్నీ వారికే కట్టబెడుతున్నాడు. తెలంగాణలో ఉన్నవారిని పక్కనపెట్టి.. ఆంధ్రా నుండి డిప్యూటేషన్ పై వస్తున్న వారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారు.
తాజాగా ఏపీ జెన్కో నుండి దుర్గా ప్రసాద్ అనే డీఈని తీసుకొచ్చి తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలో పెట్టారు. ఇప్పటికే తెలంగాణ రెడ్కో సంస్థ ఎండీ పదవిని ఆంధ్రా ప్రాంత అధికారికే కట్టబెట్టారు. అలాగే విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టుల్లో కూడా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ట్రాన్స్ కో, జెక్ కో, డిస్కంలలోని కీలక పదవులన్నీ ఒక్కొక్కటిగా ఆంధ్రా ప్రాంత అధికారుల చేతుల్లో పెట్టేస్తున్నారు.
ఇది ఎంత మాత్రం కూడా సబబు కాదు. వారిని తీసుకొచ్చి ఇక్కడ పోస్టులు ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్న సీనియర్ ఉద్యోగులు తమకు రావాల్సిన ప్రమోషన్లను కోల్పోవాల్సి వస్తున్నది. దీనిపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం.
మన ఉద్యోగాలు మనకే.. అన్న రాష్ట్ర సాధన ఉద్యమ కీలక నినాదానికే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు తూట్లు పొడుస్తోంది. ఇవన్ని ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరుగుతున్నాయా.? లేకపోతే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కనుసన్నల్లో జరుగుతున్నాయా బయటపెట్టాలి. రాష్ట్ర ఉద్యోగులకు అన్యాయం చేసేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నవారు ఖచ్చితంగా ద్రోహులుగా మిగిలిపోతారు.