సంతోషమే సగం బలం..
ఆ సంతోషాన్ని కూడా
పిచ్చి పనులతో..
పిచ్చిపిచ్చి ఆలోచనలతో
సగం చేసుకుంటున్నారు
గనకనే సగం జీవితం గడిచేపాటికే హరీ అంటున్నారు జనం..
అదే సంతోషాన్ని
ద్విగుళం బహుళం
చేసుకోగలిగితే
రెట్టింపు కాలం
జీవించడా..
చిరంజీవిగా మనిషి..!
నీ సంతోషంతో పాటు
ఎదటోడి సంతోషం..
మీ ఇద్దరి సంతోషమే
అందరి సంతోషం..
ఇలా అనుకుని ఆచరించడానికి
ఎందుకు లెక్కపెడతావోయ్
మీనం మేషం..!
నువ్వు సంతోషంగా ఉండడానికి గంటకో వేషం..
అవతలోడు సంతోషంగా
ఉంటే అదెందుకు ఉక్రోషం..
నువ్వు ఆల్వేస్ హ్యాపీ..
ఎదటోడు ఒక్క నిమిషం
హ్యాపీగా కనిపిస్తే
లాగేస్తావా కూపీ..
వాడింటి ముందు జల్లేస్తావా
కన్నీటి కల్లాపి..
నీ పనులన్నీ ఆపి..!
అయినా..
ఈ బుద్ధులన్నీ ఏల గాని..
హాయిగా ఉండరాదా నవ్వుతూ..
సంతసం..
అందులో ఎంత రాజసం..
విడిచేయి అసూయ కుబుసం..
నేను సైతం
మంచివాణ్ణే అంటూ
సదా మెలివేయవోయి మీసం.!
– సురేష్
.9948546286
7995666286