– త్వరలోనే మెట్రో విస్తరణ
– బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి కూడా అండర్ పాస్ రోడ్డుకు అనుమతి
– మూసీ ప్రక్షాళనపై ఎందుకు రాజకీయం చేస్తున్నారు?
– ప్రారంభించి మీరు వదిలేస్తే మేం ముందుకు తీసుకెళుతున్నాం
– మీకున్న అభ్యంతరమేంటి?
– ఇప్పుడు మనం దృష్టి సారించాల్సింది గుడ్ గవర్నెన్స్ పై కాదు.. స్మార్ట్ గవర్నెన్స్ పై
– తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం
– ప్రజల్లో అపోహలు సృష్టించకండి..అభివృద్ధిని అడ్డుకోకండి
– శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దేశంలో ఎన్నో నగరాలున్నా ప్రధానంగా ఐదు నగరాల గురించి మాత్రమే చర్చించుకుంటాం. పొలిటికల్ రాజధానిగా ఢిల్లీ, ఫైనాన్షియల్ కేపిటల్ ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల గురించి చర్చించుకుంటాం. పొలిటికల్ కేపిటల్ గా ఉన్న ఢిల్లీలో కాలుష్యం కారణంగా పాఠశాలలలకు, ఆఫీసులకి సెలవులు ఇస్తున్నారు.
ముంబై లో వర్షాలు వస్తే వరదలు వచ్చే పరిస్థితి. ఫైనాన్షియల్ కేపిటల్ గా ఉన్న ముంబైలో నివసించలేని పరిస్థితి. బెంగళూరులో విపరీతమైన ట్రాఫికక్. చెన్నైలో వరదలతో ఇబ్బందులు పడే పరిస్థితి.హైదరాబాద్ రాక్స్ అండ్ లేక్స్ సిటీ. అది ఓల్డ్ సైట్ అని మనం చెప్పుకుంటున్న అది ఒరిజినల్ సిటీ. చార్మినార్, గుల్జార్ హౌస్, మనం ఉన్న శాసన మండలి ఎన్నో చారిత్రక కట్టడాలు నగరంలో ఉన్నాయి.
ఇలాంటి ఘన చరిత్ర ఉన్న నగరంలో మానవ తప్పిదాలతో సమస్యలు వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా వాహనాల సంఖ్య పెరిగింది. వీటికి పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రవాణాలో రోడ్లు, రైల్వే, ఎయిర్ పోర్టు, పోర్టు కీలకం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి చేసుకున్నాం. మెట్రోను నిర్మించుకున్నాం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం.
తెలంగాణను మూడు జోన్లుగా విభజించుకున్నాం. క్యూర్, ప్యూర్, రేర్ అని మూడు జోన్లుగా విభజించాం. ఔటర్ రింగురోడ్డు ఇన్ సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఈ ప్రాంతంలోని కాలుష్య కారక పరిశ్రమలకు ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తే, మధ్యతరగతికి భూమి అందుబాటులోకి వస్తుంది. నగరం నివాస యోగ్యంగా మారుతుంది.
రోడ్లను అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్ అని మూడు భాగాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రణాళికలు తీసుకున్నాం. 29 ప్రాంతాల్లో జరుగుతున్న పనుల ప్రణాళికలు మీముందు పెట్టాం. మెట్రో పై ఎల్ అండ్ టీ తో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయించాం. మెట్రోలో లాస్ట్ మైల్ కనెక్టివీటీ లేదు. అందుకే మెట్రోను విస్తరిస్తున్నాం. మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. త్వరలోనే మెట్రో విస్తరణ చేపట్టబోతున్నాం.
బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి కూడా అండర్ పాస్ రోడ్డుకు అనుమతి తీసుకొచ్చాం. దేశంలో రన్ వే కింద ఇలాంటి రోడ్డు ఎక్కడా లేదు. నల్గొండ, విజయవాడ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం. నగరంలో సిగ్నల్ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించి ప్రయాణం సాఫీగా సాగేలా చేయాలనేది మా ప్రయత్నం. కొంత కఠినం అనిపించినా ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలనుకుంటున్నాం. ఫుట్ పాత్ లో ఉండే చిరు వ్యాపారుల కోసం ఎక్కడైనా స్థలాన్ని కేటాయించి, అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు ప్రోత్సహిద్దాం.
కేబీఆర్ పార్క్ దగ్గర మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేశాం. సంస్కరణల్లో భాగంగా మేం ఇలాంటి చర్యలను చేపడుతున్నాం. ఢిల్లీ లాంటి నగరంలా హైదరాబాద్ మారవద్దనే హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు బయటకు తరలిస్తున్నాం.
ఇండస్ట్రియల్ జోన్ కు మల్టీ జోన్ గా భూమిని బదలాయిస్తున్నాం. అంతే తప్ప మేం యాజమాన్య హక్కులు ఎవరికీ అందించడం లేదు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీ వెంట సిటీ మధ్యలో నుంచి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబోతున్నాం. గండిపేట నుంచి గౌరెల్లి వరకు కేవలం 40 కిమీ ప్రయాణంతో చేరుకోవచ్చు.
మూసీ ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించాం. 10 వేల స్క్వేర్ కిమీ పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నాం. క్యూర్ పరిధిని సర్వీస్ సెక్టార్ గా, ప్యూర్ ను మన్యూఫ్యాక్చార్ హబ్ గా, రెర్ ను అగ్రికల్చర్ రంగంగా అభివృద్ధి చేయబోతున్నాం. ఒక దూర దృష్టితో ప్రణాళికలు రూపొందించాం. పారదర్శకంగా పనులు జరిగేలా ప్రతీ విభాగానికి ఒక పాలసీని తీసుకొచ్చాం. ఇప్పుడు మనం దృష్టి సారించాల్సింది గుడ్ గవర్నెన్స్ పై కాదు.. స్మార్ట్ గవర్నెన్స్.. పరిపాలన సౌలభ్యం, అధికారుల మధ్య సమన్వయం ఉండేలా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి పరిధిని ఒకే విధానం తీసుకొచ్చాం.
హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా మూడు కార్పొరేషన్లుగా విభజించాం. నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తు అభివృద్ధి కోసం ఒక రోడ్ మ్యాప్ ను తయారు చేసుకున్నాం. దయచేసి అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దు. మూసీ రీవర్ డెవలమెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది తామే అని సిరిసిల్ల ఎమ్మెల్యే చెప్పాడు. ప్రారంభించి మీరు వదిలేస్తే మేం ముందుకు తీసుకెళుతున్నాం. మీకున్న అభ్యంతరమేంటి? మూసీ ప్రక్షాళనపై ఎందుకు రాజకీయం చేస్తున్నారు?
ఆపాలని కాకుండా ముందుకు తీసుకెళ్లడానికి సలహాలు ఇవ్వండి. ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు రండి. రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టండి. నాకు మీ సూచనలు ఇవ్వడానికి ఇబ్బంది అనుకుంటే ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తా. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబుతో ఒక కమిటీ వేస్తాం. మీ సలహాలు, సూచనలను కమిటీకి సమర్పించండి. మేం ఎవరినీ నిరాశ్రయులను చేయడంలేదు.
మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఎవరినీ నిరాశ్రయులను చేయం…. పునరావాసం కల్పిస్తానని మీ ద్వారా ప్రభుత్వం మాట ఇస్తుంది. ఏ ఒక్కరికీ నష్టం చేయం.. మెరుగైన వసతులు కల్పిస్తాం. మీ ద్వారా మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దని కోరుతున్నా. మా అధికారులు మీకు సహాయం అందిచేందుకు సిద్ధంగా ఉంది. రాజకీయ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించకండి.అభివృద్ధిని అడ్డుకోకండి.