– నేను హీరోను కాదు
– అయితే నన్ను హీరోను చేసింది తెలంగాణ ప్రజలే
– నేను కార్యకర్తల కోసం ఆలోచించే నాయకుడిని
– మూసీ ప్రక్షాళనకు బీజేపీ ఎందుకు అడ్డుపడుతోంది?
– గుజరాత్లో వాళ్లు సబర్మతి సుందరీకరణ చేపట్టలేదా?
– మోదీజీ.. అన్నీ గుజరాత్‌కేనా?
– బిజెపి వాళ్ళు బెంజి కారులో వెళ్ళి దళితుల ఇళ్లలో స్విగ్గి ఫుడ్ తింటున్నారు
– వచ్చే ఎన్నికల్లో ఒకే దెబ్బకు బీజేపీ-బీఆర్ఎస్ను ఓడిస్తా
– బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా, అమెరికా ఏ దేశం కూడా భారత్ తో లేదు
– టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఢిల్లీ: ‘‘ కేసీఆర్ నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. వ్యక్తిగత శత్రువు కాదు. బీఆర్ఎస్ అధినేత ఇంట్లో వారసత్వ పోరు నడుస్తుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా అటు బీఆర్ఎస్ను, ఇటు బీజేపీని ఓడించి రాబోయే పదేళ్ల కాలం తనదే అవుతుందని’’ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో పాల్గొన్న ఆయన.. కేసీఆర్‌తో తనకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవని.. బీఆర్ఎస్ చీఫ్ కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబంలో పదవుల కోసం అంతర్గత యుద్ధం జరుగుతోందని ఎద్దేవా చేశారు.
‘‘కేసీఆర్ ఎదుర్కొంటున్నది రాజకీయ సమస్య కాదు. అది పూర్తిగా వారి కుటుంబ సమస్య. పదవుల కోసం కేటీఆర్, కూతురు పోటీ పడుతున్నారు. గతంలో హరీష్ రావు ముఖ్యమంత్రి అవుతారన్న చర్చ కూడా అందుకే వచ్చింది’’ అని విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ మాట్లాడితే, బడ్జెట్‌పై హరీష్ రావు మాట్లాడుతున్నారు. వారి మధ్య సమన్వయం లేదని వేలెత్తి చూపారు.
బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉనికి కోల్పోతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా వచ్చిందని, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో కేటీఆర్ బెట్టింగులు కట్టించారని, అయినా అక్కడ ఓటమి తప్పలేదని రేవంత్ ఆరోపించారు.
‘‘నా లెక్క ఎప్పుడూ ఒకటే.. ఒక దెబ్బకు రెండు పిట్టలు.. వచ్చే ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ను, ఇటు బీజేపీని రెండింటినీ ఓడించి తీరుతాం’’ అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న సంప్రదాయం ప్రకారం.. ప్రజలు తనకు 2024 నుంచి 2034 వరకు అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేసీఆర్ కనీసం ప్రతిపక్ష పాత్రనైనా సరిగ్గా పోషించాలని హితవు పలికారు.
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. ఇప్పుడున్నట్టుగానే ఉత్తర, దక్షిణ భారత్ మధ్య సంఖ్యలో తేడా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలా జరగకపోతే దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రభావాన్ని కోల్పోతాయన్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య బీజేపీ వివక్ష చూపుతోందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి నిర్మలా సీతారామన్ మినహా ఏ ఒక్కరైనా కీలక శాఖలు చూసే వాళ్లు కేంద్ర కేబినెట్లో ఉన్నారా ?
నియోజకవర్గాల పునర్విభజన కేంద్రం అనుకున్నట్టుగానే చేస్తే, దక్షిణాది రాష్ట్రాలు నామమాత్రంగా మారిపోతాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే తాము ఢిల్లీకి రావడం కూడా వృధానే అన్నారు. డీలిమిటేషన్ అంశంపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడాన్ని కూడా రేవంత్ తప్పుబట్టారు. నిర్ణయం తీసుకోవడానికి ముందు అఖిలపక్షం పెడితే బాగుంటుందని.. నిర్ణయం తీసుకుని తమకు చెప్పడానికి ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకుని ప్రశ్నించారు.
మూసీ ప్రక్షాళనకు బీజేపీ ఎందుకు అడ్డుపడుతోందని ప్రశ్నించారు. గుజరాత్లో వాళ్లు సబర్మతి సుందరీకరణ చేపట్టలేదా? అని ప్రశ్నించారు. గ్యారంటీ హామీల విషయంలో తమకు పూర్తి స్పష్టత ఉందన్నారు సీఎం రేవంత్. అందుకే రాష్ట్ర పరిస్థితిని ప్రజలకు వివరిస్తున్నామన్నారు.
గుజరాత్ మోడల్‌పై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. మోదీ ప్రధానిగా ఉన్నప్పటికీ గుజరాత్ గురించే ఆలోచిస్తున్నారని, ఆ ప్రాంతానికే ఎక్కువగా రాయితీలు ఇచ్చి పెట్టుబడులు తీసుకెళుతున్నారని ఆరోపించారు.
తాను 2034 వరకు తెలంగాణలోనే ఉంటానంటూ పరోక్షంగా అప్పటివరకు తానే తెలంగాణ సీఎం అని సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ తనకు ఎక్కడ ఏ బాధ్యత అప్పగిస్తే అక్కడికి వెళతానని తెలిపారు. తాను హీరోను కాదన్నారు. అయితే తనను హీరోను చేసింది మాత్రం తెలంగాణ ప్రజలే అని వ్యాఖ్యానించారు.
బలవంతులతో పోరాడినప్పుడు ప్రజలు తనకు అండగా నిలిచారన్నారు. ప్రధాని మోదీ చెబుతున్నట్టుగా 2047 లక్ష్యాన్ని తాను నిర్దేశించుకోవడంలో తప్పేముందన్నారు. తాము అనేక సంస్థల నుంచి ఇన్‌ఫుట్‌లు తీసుకుంటున్నామన్నారు. తాను కార్యకర్తల కోసం ఆలోచించే నాయకుడినని అన్నారు. కార్యకర్తలు తమ కోసం సర్వం త్యాగం చేస్తారని.. అందుకే తాను వారి గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ మంచి చేస్తే మంచి చేశారని చెబుతా. తప్పు చేస్తుంటే తప్పని చెబుతానని అన్నారు. ప్రజల సమస్యల ఆధారంగా ఆరు గ్యారెంటీలు ఇచ్చామని.. అవి కచ్చితంగా అమలు అయ్యేలా చూస్తున్నామని అన్నారు. పేదరికం చూస్తూ పెరిగిన వాడినని.. బిజెపి వాళ్ళు బెంజి కారులో వెళ్ళి దళితుల ఇళ్లలో స్విగ్గి ఫుడ్ తింటున్నారని మండిపడ్డారు.
ఆర్థిక వనరులు తక్కువ ఉండటం వల్ల కొన్ని గ్యారెంటీలు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన నాటికి అనుకున్న దానికంటే అధిక అప్పులు ఉన్నాయని తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ విడుదల చేశామన్నారు. 11.90 వడ్డీకి 2 లక్షల కోట్ల అప్పు తీసుకున్నారని దుయ్యబట్టారు. 6-7 శాతం వడ్డీ వదిలేసి అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నారు. నచ్చితే నజరానా నచ్చకపోతే జరిమానా అన్నట్లుగా గత ప్రభుత్వ వైఖరి ఉండేది.
ఇచ్చిన హామీల గురించి ప్రజలకు ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నా. సోలార్ ఎనర్జీ ద్వారా దేశాన్ని కాపాడాలని ప్రతి రోజు సూర్య భగవానుని ప్రార్థిస్తున్నా. బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా, అమెరికా ఏ దేశం కూడా భారత్ తో లేదు. విదేశాలతో భారత్ కు మంచి సంబంధాలు లేకుండా పోయాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.