– నాగార్జున సాగర్ కేంద్రంగా అత్యాధునిక విమాన ఇంజన్ టెస్టింగ్ సదుపాయం
(పతంజలి వడ్లమూడి)
భారత్ తన స్వదేశీ విమాన ఇంజన్ అభివృద్ధి కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరుకోబోతోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ తెలంగాణలో ఇంజన్లను పరీక్షించే అధునాతన సదుపాయం నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ‘హై-ఆల్టిట్యూడ్ టెస్ట్ సెల్’ ఏర్పాటుతో దేశీయ ఇంజన్లను స్వయంగా పరీక్షించుకునే సామర్థ్యం పెరుగుతుంది. విదేశాలపై ఆధారపడకుండా స్వావలంబన సాధించడం ఇందులో లక్ష్యం.
నాగార్జున సాగర్ రిజర్వాయర్ సమీపంలో కృష్ణా నది ఒడ్డున ఈ జాతీయ విమాన ఇంజన్ టెస్ట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని జీటీఆర్‌ఈ తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఇక్కడ 1,10,000 నుంచి 1,30,000 న్యూటన్ల 110-130 కెఎన్ థ్రస్ట్ కలిగిన శక్తివంతమైన ఇంజన్లను పరీక్షించవచ్చు.
ఇలాంటి ఇంజన్లు భవిష్యత్ ఫైటర్ జెట్లు, ముఖ్యంగా అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ మార్క్-2 వంటి స్టెల్త్ విమానాలకు చాలా అవసరం. అలాగే ఫ్రాన్స్ సాఫ్రాన్ కంపెనీతో కలిసి జీటీఆర్‌ఈ అభివృద్ధి చేస్తున్న 130 కెఎన్ ఇంజన్ ప్రాజెక్ట్‌కు ఈ సదుపాయం బలం చేకూరుస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది మన విమానాలు ఆకాశంలో ఎంత ఎత్తుగా ఎగురుతాయో, ఎంత వేగంగా పోతాయో గ్రౌండ్‌లోనే తెలుసుకునే ల్యాబ్ లాంటిది.
ప్రస్తుతం భారత్‌లో అధిక థ్రస్ట్ ఇంజన్లను అధిక ఎత్తుల్లో పరీక్షించడానికి సరైన సదుపాయాలు లేవు. దీని వల్ల ఇంజన్ అభివృద్ధి ప్రక్రియలో ఆలస్యం జరుగుతోంది. విదేశాల్లో పరీక్షలు చేయాల్సి వస్తుంది. కొత్త టెస్ట్ సెల్ వస్తే ఇందుకు చెల్లించాల్సిన విదేశీ మారకం ఆదా అవుతుంది. 2011 లెక్కల ప్రకారం ఒక్క సైకిల్ పరీక్షకు సుమారు 80 కోట్లు ఖర్చు అవుతుంది.
ఇవి కాకుండా లాజిస్టిక్స్ మరియు అదనపు ఖర్చులు ఉంటాయి. ఈ సెంటర్ ఏర్పాటుకు ఒక్కసారి అయ్యే ఖర్చు 2000 కోట్లు. ఆ తరువాత పరీక్షలకు 70% ఖర్చు ఆదా అవుతుంది. సాంకేతిక రహస్యాలు కూడా రక్షించబడతాయి. ఈ సదుపాయంలో 40,000 అడుగులు ఎత్తులో ఉన్న వాతావరణ పరిస్థితులను పూర్తిగా అనుకరించవచ్చు. అక్కడ గాలి చాలా సన్నగా, ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. విమానం ఎగురుతున్నప్పుడు ఇంజన్ ఎదుర్కొనే సమస్యలను గ్రౌండ్‌లోనే తెలుసుకోవచ్చు. ఇది సైన్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.
అయితే, ఈ పరీక్షలకు అధిక మొత్తంలో నీరు, విద్యుత్ అవసరం. ఇంజన్ నుంచి వెలువడే వేడిని చల్లబరచడానికి నీటిని ఉపయోగించి స్ప్రే చేస్తారు. ఒక్క పరీక్షకు కోట్ల లీటర్ల నీరు కావాల్సి వస్తుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ సమీపంలో ఉండటం వల్ల నీటి సరఫరా సులభం. ఇది టెక్నికల్‌గా ఎంతో సులభమైన సదుపాయం. వాక్యూమ్ సిస్టమ్స్ ద్వారా తక్కువ ఒత్తిడిని, రిఫ్రిజిరేషన్ ద్వారా చల్లని పరిస్థితులను సృష్టిస్తారు. ఎగ్జాస్ట్ గ్యాసులను సరిగ్గా నిర్వహించాలి. ఇంజన్ పరీక్ష అనేది ఒక పెద్ద ఇంధన ఫ్యాక్టరీ లాంటిది, దాన్ని హిమాలయాల ఎత్తులో ఉంచి పరీక్షించడం అనేది ఇప్పుడు తెలంగాణలోనే సాధ్యమవుతుంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే భారత రక్షణ రంగం బలపడుతుంది. స్వదేశీ ఇంజన్లతో తయారు చేసే విమానాలు, డ్రోన్లు మరింత సమర్థవంతమవుతాయి. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది పెద్ద బూస్టర్. జీటీఆర్‌ఈ ఇప్పటికే కావేరి ఇంజన్ వంటి ప్రాజెక్టులపై పని చేస్తోంది. కొత్త సదుపాయం వచ్చాక ఇంజన్ టెక్నాలజీలో భారత్ ప్రపంచ స్థాయికి చేరుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం నుండి కూడా ఈ ప్రాజెక్టుకు అన్ని రకాలుగా సహాయాలు అందించాలని ఆశిస్తున్నారు.
ఇది రాష్ట్రానికి కూడా ఆర్థిక, సాంకేతిక ప్రయోజనాలు కలిగిస్తుంది. ఈ ప్రణాళికతో భారత్ విమాన ఇంజనీరింగ్ రంగంలో స్వతంత్రత సాధించడం జరుగుతుంది. యువ ఇంజనీర్లు, సైంటిస్టులు మరిన్ని ఆవిష్కరణలు చేసే అవకాశం ఏర్పడుతుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దిశగా చురుగ్గా కదులుతోంది. భవిష్యత్ యుద్ధాల్లో స్వదేశీ సాంకేతికత ఎంతో కీలకం. ఈ టెస్ట్ సెల్ ఏర్పాటు దానికి పునాది వేస్తుంది. ఇలా భారత్ ఆకాశంలో తన స్వంత బలాన్ని పెంచుకుంటోంది.