– కేంద్రానికి ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి
తెలంగాణ, మధ్య భారతానికి వ్యూహాత్మక జీవనాధారమైన ఖమ్మం- బస్తర్ కారిడార్‌ను వెంటనే నాలుగు లేన్లుగా విస్తరించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.
తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాలలో అనుసంధానం, భద్రత, ఆర్థికాభివృద్ధిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఒక కీలకమైన మౌలిక సదుపాయాల లోపం గురించి దృష్టి సారించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
హై- స్పీడ్ కారిడార్ల ద్వారా హైదరాబాద్ నుండి ఖమ్మం వరకు ఉన్న రహదారి మార్గంలో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తున్నదన్నారు.
అయితే, ఖమ్మం వెలుపల కొత్తగూడెం-భద్రాచలం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాల అనుసంధానం నిర్లక్ష్యానికి గురైందన్నారు. వ్యూహాత్మకంగా ఇది అత్యంత కీలకమైన ఒక జీవనాడి అని, దీనిని ఒడిషా వైపు కూడా అనుసంధానం చేయొచ్చని ఎంపీ రవిచంద్ర తెలిపారు.
రాజ్యసభలో శుక్రవారం ఆయన జీరో అవర్ లో మాట్లాడుతూ,ఈ కారిడార్ కేవలం ఒక రహదారి మాత్రమే కాదని,ఇది తెలంగాణ- ఛత్తీస్‌గఢ్-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానించే వ్యూహాత్మకమైనదని చెప్పారు. ఈ నెట్‌వర్క్‌కు కొత్తగూడెం కేంద్ర బిందువుగా ఉంటుందన్నారు.
సింగరేణి బొగ్గు క్షేత్రాలు, థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, ప్రధాన పరిశ్రమలకు నిలయమైన కొత్తగూడెం-పాల్వంచలు తెలంగాణ పారిశ్రామిక, ఇంధన వెన్నెముకగా ఉన్నాయని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నా కూడా ఖమ్మం దాటాక ఈ ప్రాంతంలో రహదారి మౌలిక సదుపాయాలు సరిగా లేవని ఎంపీ రవిచంద్ర కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
ఈ ప్రాంతం గుండా వెళ్లే వాహనాలు తరుచూ ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోవాల్సి వస్తున్నదని వివరించారు.ఖమ్మం-కొత్తగూడెం-భద్రాచలం-బస్తర్ కారిడార్ ను వెంటనే నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నాలుగు లేన్ల కారిడార్ కొత్తగూడెంను త్రిరాష్ట్ర లాజిస్టిక్స్ కేంద్రంగా రూపుదాల్చి రాష్ట్రాల మధ్య బొగ్గు, ఖనిజాలు, అటవీ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువుల నిరాటంక రవాణాను సులభతరం చేస్తుందని ఎంపీ వద్దిరాజు వివరించారు.
ఈ రహదారి అత్యంత గిరిజన, వెనుకబడిన ప్రాంతాల గుండా వెడుతుందని, ఈ అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా ఈ వర్గాలను ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఏకీకృతం చేయొచ్చని,విద్య, ఆరోగ్య సంరక్షణ, మార్కెట్లను మరింత మెరుగుపరుస్తుందని చెప్పారు
బస్తర్,సుక్మా వైపు విస్తరించి ఉన్న ప్రాంతాలతో సహా ఇది నక్సల్ ప్రభావిత ప్రాంతమని, మౌలిక సదుపాయాలు కేవలం అభివృద్ధి మాత్రమే కాదు అని,అవి భద్రతా దళాలకు, పరిపాలనకు, స్థిరత్వానికి ఒక వ్యూహాత్మక అవసరం అని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.
అదనంగా ఈ కారిడార్ హైదరాబాద్ నుండి బస్తర్ అనుసంధాన్ని మరింత బలోపేతం చేసి, దీనిని ప్రత్యక్ష ఆర్థిక, మానవతా జీవనాడిగా మారుస్తుందని ఆయన వివరించారు. ఇప్పటికే ఖమ్మం వరకు పటిష్టమైన కారిడార్లను నిర్మించామని, అత్యంత కీలకమైన లోపించిన అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా ఈ దార్శనికతను పూర్తి చేయాల్సి ఉందని ఎంపీ రవిచంద్ర అభిప్రాయపడ్డారు.
ఈ కారిడార్ ఆర్థిక, సామాజిక వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించి, దీనిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం తగు ప్రాధాన్యతనిచ్చి అనుమతులు మంజూరు చేయాల్సిందిగా ఆయన కోరారు.దీంతో,మూడు రాష్ట్రాల అనుసంధానానికి, అభివృద్ధికి కొత్తగూడెం కేంద్ర బిందువుగా ఆవిర్భవిస్తుందని ఎంపీ వద్దిరాజు వివరించారు.