– బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు హైదరాబాద్ నగరాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని RRR కు రూపకల్పన చేసింది కేసీఆర్ గారేనని, 2015 లోనే అలైన్మెంట్, డిజైన్ పనులు పూర్తి చేస్తే కేంద్రం కాలయాపన చేసి 2021లో భారత్ మాలా ప్రాజెక్టులో చేర్చారని గుర్తు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అత్యంత వేగంగా (యుద్ధ ప్రాతిపదికన) 80% మేర 3D సర్వే పనులు, భూముల గుర్తింపు పూర్తి చేశామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 27 నెలల్లో కేవలం మిగిలిన 20% సర్వే పనులు మాత్రమే చేసి భూసేకరణకు ఒక్క పైసా కుడా ఖర్చు చేయకుండా ప్రాజెక్ట్ ని గాలికొదిలేశారు.
2024 డిసెంబర్ 29న ఉత్తర భాగం RRR కు టెండర్లు పిలిచినా సందర్బంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ “RRR రైట్ రైట్” “రోడ్డెక్కిన ఉత్తర రింగ్ రోడ్” అని, ఫిబ్రవరి 2025 లో పనులు మొదలు పెట్టి,రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆర్భాటంగా మీడియా ముందు ప్రకటనలు చేసి 15 నెలలు గడుస్తున్న నేటికీ టెండర్లు ఓపెన్ చేయలేదని ఏద్దేవా చేశారు.
అసలు వాస్తవం ఏంటంటే… ప్రాజెక్ట్ సంబందించి కేంద్రం ప్రభుత్వం (Morth) నుండి ఇంకా తుది ఆమోదం లభించలేదని రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ పద్దుల్లో వెల్లడించింది అని చెప్పారు.వరుసగా గత రెండు బడ్జెట్ లల్లో కుడా RRR కోసం రూ.1525 కోట్లు కేటాయించినట్లు చూపుతున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ఒక్క రూపాయి కుడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
దక్షిణ రింగ్ రోడ్ అలైన్మెంట్ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, దీనివల్ల ప్రాజెక్టు మొత్తం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. “మంత్రి గారు కేవలం ప్రెస్ మీట్లకు, పేపర్ ప్రకటనలకే పరిమితం కాకుండా.. చేతల్లో అభివృద్ధి చూపాలని” వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు
హ్యామ్ ఒక పెద్ద స్కామ్
తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి ముసుగులో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో చేపట్టే రోడ్ల నిర్మాణాల్లో 8 వేల కోట్ల భారీ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. R&B శాఖలో సుమారు 6092 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ. 13,000 కోట్ల టెండర్లు పిలిచారని, ఇందులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.
గతంలో ఎప్పుడు లేని 10 % మొబైలైజేషన్ అడ్వాన్స్ పద్దతిని తీసుకవచ్చి పనులు మొదలు పెట్టకముందే HAM కాంట్రాక్టర్లకు సుమారు రూ. 1300 కోట్లు R&B లో, 600 కోట్లు పంచాయతి రాజ్ లో మొత్తంగా 1900 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చి దోపిడీకి ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు.
పాత మరియు ప్రస్తుతం నడుస్తున్న పనుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా, HAM కాంట్రాక్టర్లకు ప్రత్యేకంగా మొబైలైజేషన్ అడ్వాన్స్ లు ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు.
టెండర్లలో 5% కంటే ఎక్కువ వేయకూడదనే నిబంధనను ఎత్తివేసి, కాంట్రాక్టర్లకు ఎంతైనా అదనంగా వేసుకునే వెసులుబాటు కల్పించారని, దీనివల్ల 40% వరకు మార్జిన్ వచ్చేలా ప్లాన్ చేసి సుమారు 5200 కోట్ల R & B HAM పనుల్లో, 2400 కోట్లు పంచాయతీ రాజ్ HAM పనుల్లో మొత్తంగా 7600 కోట్లు దోపిడీకి తెర లేపరని ఆరోపించారు.
సాధారణంగా కిలోమీటర్ డబుల్ రోడ్డు వైడెనింగ్ నిర్మాణానికి రూ. 1.75 కోట్లు ఖర్చయితే, ఈ HAM మోడల్ లో ప్రభుత్వం రూ. 3.30 కోట్లుగా టెండర్లో చూయించారని అంటే రెట్టింపు ఖర్చు చూపిస్తూ ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తున్నారని గణాంకాలతో వివరించారు.
15 సంవత్సరాల మెయింటెనెన్స్ పేరుతో ఏటా 4% నిధులను 15 సార్లు కేటాయించడం ద్వారా,రెండు సార్లు 8 % నిధులను కేటాయించడం ద్వారా మరో రూ.10,000 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు.
ఈ HAM మాడల్ లో ఇప్పుడు చేపట్టిన 6090 కి.మి రోడ్ల అభివృద్ధి పనులను సాధారణంగా 6100 కోట్ల రూపాయలతో పూర్తి చేయవచ్చు. కావున Ham టెండర్ల లో చూయించిన 13000 కోట్ల ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం సమాకూర్చే 40 శాతం నిదులు అంటే 5200 కోట్లతోనే ఈ పనులను అటు ఇటుగా పూర్తి చేయవచ్చు. కాబట్టి HAM మాడల్ అవసరం లేదు.
కావున కేవలం ప్రజల సొమ్మును దోచుకొని దాచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం HAM మాడల్ ను తెస్తున్నారు. మొత్తం 34 ప్యాకేజీలను కేవలం 5, 6 గురు కాంట్రాక్టర్లు 20 శాతం ఎక్సెస్ తో దక్కించుకోబోతున్నారని, ఇది ముందస్తు ప్రణాళికతో జరిగబోయే దోపిడీ అని విమర్శించారు.
ఈ కుంభకోణంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) తో పాటు అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ అవినీతిలో భాగస్వాములైన అధికారులు, కాంట్రాక్టర్లు కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదని, బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో దీనిపై పోరాడుతుందని స్పష్టం చేశారు.