– బిల్లు ఆమోదంతో ప్రజా సంకల్పానికి గౌరవం
– రాజధానికి వ్యతిరేకంగా వాకౌట్ చేసిన వారిని బ్లాక్ అవుట్ చేయాలి
– మావిగన్ అంటూ రాజధానిపై అపహాస్యమా.?
– అమరావతి రైతులతో సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
– సతీసమేతంగా దీపహారతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి
– ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, బిల్లుకు మద్ధతు తెలిపిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం
అమరావతి: అమరావతి రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులో తిరుగులేని శాసనం చేశారని.. ఇది ప్రజా సంకల్పానికి దక్కిన గౌరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వద్ద గురువారం రైతులతో కలిసి సతీ సమేతంగా అమరావతికి దీపహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”దేశ చరిత్రలో అమరావతి విజయం సువర్ణ అక్షరాలతో లిఖించదగింది. అమరావతి చరిత్ర శాశ్వతం.. అందులో రైతులు చేసిన త్యాగం శాశ్వతం. అనేక కుట్రలను ఎదుర్కొని రాజధానిని దక్కించుకున్నాం. రాజధానిని స్మశానం అన్న వారు నేడు అడ్రస్ లేకుండా పోయారు. అమరావతిపై పార్లమెంటులో తిరుగులేని శాసనం చేసుకున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రానికి అడ్రస్ లేదు, కానీ నేడు ఒక శాశ్వత అడ్రస్ వచ్చింది. అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నం.
29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చి చేసిన త్యాగం వల్లే ఈ విజయం సాధ్యమైంది. 1,631 రోజుల ఉద్యమం ఒక చరిత్ర. ఉద్యమాన్ని అడ్డుకున్న ప్రభుత్వంపై రాజధాని రైతులు, మహిళలు వీరత్వం, ప్రతాపం చూపారు. నాడు ముళ్ల కంచెలు దాటుకుని ఉద్యమం చేస్తున్న రైతుల వద్దకు పవన్ కళ్యాణ్ వచ్చారు.
భువనేశ్వరి తన చేతికి ఉన్న రెండు గాజులను రాజధాని రైతుల ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు. ఎంతో మంది రైతులకు అండగా నిలిచారు. అమరావతి ఉద్యమం కోసం నేను స్వయంగా జోలె పట్టాను. న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమాన్ని నాటి ప్రభుత్వం అడ్డుకుంది. ఒక్క అడుగూ వెనక్కుక తగ్గినా… తర్వాత పది అడుగులు వేసి సింహాల్లా దూకారు. 2024లో కూటమి పార్టీకి అద్భుత విజయం అందించారు… ఇప్పుడు రాజధానికి చట్టబద్దత కలిగింది. రైతులు, రైతు కూలీలు, ప్రజల ఐకమత్యం వల్లే ఈ విజయం సాధించుకున్నాం. 2019లో ఏమార్చారు. ఐదేళ్ల పాటు చీకటి రోజులుగా రాష్ట్రానికి దాపురించాయి. ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన చీకటి రోజులు ముగిశాయి.”అని ముఖ్యమంత్రి అన్నారు.
తెలుగు జాతి గౌరవం అమరావతి
“అమరావతికి అపజయం లేదు… అన్ స్టాపబుల్. ప్రజా రాజధానిని సాధించుకున్నాం. ఇది ప్రజా విజయం. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రధానికి ధన్యవాదాలు. హోం మంత్రి అమిత్ షా సహా కేంద్రం, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఈ బిల్లుకు సహకరించాయి. పవిత్రమైన మట్టి-నీటిని రాజధాని శంకుస్థాపన చేసిన రోజున ప్రధాని తెచ్చారు. పార్లమెంట్ వద్ద ఉన్న పవిత్ర మట్టిని… పవిత్ర యమునా నది జలాలతో పునీతమైన పుణ్యభూమి ఇది. దేశం మొత్తం అమరావతికి అండగా ఉంటుందని నాడే ప్రధాని మోదీ చెప్పారు.
ఆదర్శ రాజధాని తెలుగు జాతి గుండె, జాతి గౌరవం అమరావతి. ఓ ప్రాజెక్టుకు రెండు సార్లు ప్రధాని రావడం అమరావతి పనుల విషయంలోనే జరిగింది. అమరావతి నిర్మాణాలు పూర్తి అయ్యాక మరోమారు ప్రధాని ప్రారంభోత్సవాలకు వస్తారు. ప్రపంచంలోని ప్రతీ అభివృద్ధి మోడల్ అమరావతికి తెస్తాను. అమరావతికి శాశ్వతత్వం తెచ్చినందుకు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. పార్లమెంటులో చేసిన చట్టాన్ని ఎవరూ మార్చలేరు.
ఇప్పటి వరకు రాష్ట్రానికి అడ్రస్ లేదు..ఇప్పుడు మనకు ఓ అడ్రస్ వచ్చింది. వివిధ ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించి.. నాడు శంకుస్థాపన చేశాం. ప్రధాని మోదీ తెచ్చిన పవిత్ర మట్టి-నీటితో పునీతమైన ఈ భూమిపై ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తాం. రాష్ట్రంలో ప్రతీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అమరావతి సాక్షిగా ప్రజలకు హామీ ఇస్తున్నా.”అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
అమరావతిని చంపాలనుకున్న పార్టీ పీడ విరగడవ్వాలి
“ఒక్క వైసీపీ మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి ఇవాళ అండగా నిలబడ్డాయి. అమరావతిని స్మశానం అన్నారు కానీ ఇవాళ పార్లమెంటులో అమరావతికి తిరుగులేని శాసనం చేసుకున్నాం. రాజధానితో మూడు ముక్కలాట ఆడారు… అడ్రస్ లేకుండా పోయారు. అమరావతి విషయంలో ఇంత జరిగినా వైసీపీకి మాత్రం బుద్ది రాలేదు. వారి పిచ్చి ఇంకా ముదిరింది. అమరావతికి చట్టబద్దత కల్పించే అంశంపై తీర్మానం పెడితే ఆ పార్టీ అసెంబ్లీకి కూడా హాజరు కాలేదు. పార్లమెంటులో చట్టం చేస్తుంటే.. వాకౌట్ చేసింది.
వాకౌట్ చేసిన ఆ పార్టీని ప్రజలు బ్లాక్ అవుట్ చేయాలి. అమరావతిని చంపాలనుకున్న వైసీపీ బాగుపడదు. ఇంతటి నీతిమాలిన రాజకీయం నా చరిత్రలో చూడలేదు. వైసీపీని అంతా మరిచిపోవాలి, రాష్ట్రానికి ఆ పార్టీ పీడ విరగడవ్వాలి. మావిగన్ అంటూ ఓ కొత్త ప్రతిపాదన చేశారు. డిక్షనరిలో చూశాను నాకు అర్థం కాలేదు. వైసీపీవి అన్నీ బుద్ది లేని వ్యాఖ్యలు..దుర్మార్గపు ఆలోచనలే.”అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
శంకుస్థాపన స్థలంలో దీప హరతి- ప్రత్యేక పూజలు
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన శిలాఫలకాన్ని పరిశీలించారు. పవిత్ర మట్టి, జలాలు ఉన్న వేదిక వద్ద వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజధాని భూమికి సాష్టాంగ ప్రణామం చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో దీప హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పి. నారాయణ, అచ్చెన్నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్, అమరావతి రైతులు, మహిళలు పాల్గొన్నారు.