– చంద్రబాబు సీఎం అయినంత మాత్రాన కమ్మోరి జీవితాలు ఏమీ మారవు
– పొలంలో కూలి పనికెళ్ళి పొట్టబోసుకునే కమ్మవాళ్ళు ఎంత మంది ఉన్నారో తెలుసా ?
– కమ్మ కులం అంటే .. టీడీపీ అని అనుకోవడం మీ భ్రమ
– ఈ రెండు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు
– అంతమాత్రాన రాజధాని కమ్మరావతి అయిపోతుందా ? డియర్ విజయసాయిరెడ్డిగారు …
మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు .. రాజకీయాలకు సంబంధం లేదన్నారు. మరి కమరావతి లాంటి కామెంట్స్ వల్ల .. మీరు ఏమి చెప్పదల్చుకున్నారు? నేను కమ్మ కులానికి చెందినవాడిని. నేను కృష్ణా జిల్లాకు చెందినవాడిని. మరి నాకు అమరావతిలో సెంట్ భూమి లేదు కదా ?
నాకే కాదు ఇలా అక్కడ సెంట్ భూమి లేని కమ్మ వాళ్ళు కృష్ణా – గుంటూరు జిల్లాల్లో వేలమంది ఉన్నారు. ఈ రెండు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు .. అంతమాత్రాన రాజధాని కమ్మరావతి అయిపోతుందా ? అన్ని కులాల్లో మాదిరే కమ్మకులం లో కూడా బాగా డబ్బున్నోళ్లు , భూములున్నోళ్లు ఉండొచ్చు .
కానీ అదే కమ్మ కులంలో ఈనాటికి పొలంలో కూలి పనికెళ్ళి పొట్టబోసుకునే కమ్మవాళ్ళు ఎంత మంది ఉన్నారో తెలుసా ? రండి నేను చూపిస్తాను .. నా బంధువుల్లో ఈనాటికి కూలి పనికి వెళ్ళేవాళ్ళున్నారు . ఎవరో ఎందుకు మా చెల్లి ఈరోజుకు గుడివాడ దగ్గర రోడ్డు పక్కన బడ్డి కొట్టు పెట్టుకుని సోడాలు, సిగరెట్లు , బీడీలు అమ్ముకుంటుంది.. మా బావ పొలంలో పనికి వెళ్తాడు .
అక్కడ రాజధాని వచ్చినా.. రాకపోయినా కమ్మకులానికి ఒరిగేదేమీ లేదు .. పోయేదేమే లేదు.
సీఎంగా చంద్రబాబుగారు .. ఇదే కులానికి చెందినవారు అయినంత మాత్రాన .. మాలాంటోళ్ళ జీవితాలు ఏమీ మారవు .. కమ్మోళ్లల్లో డబ్బున్నోళ్లు .. ఇలాంటి డబ్బులేని కమ్మోళ్లని కనీసం పలకరించరు.. ఎలాంటి సాయం కూడా చేయరు.. డబ్బు లేని కమ్మోళ్లు .. ఎవరి దగ్గరా సాయం తీసుకోరు కూడా .. ఆత్మాభిమానంతోనే బతుకుతారు ..దయచేసి మీ రాజకీయాల్లోకి కులాన్ని లాగకండి . కమ్మ కులం అంటే .. ప్రత్యేకంగా ఏమీ ఉండదు.. ఇదే అన్ని కులాల లాంటిదే .. అన్ని కులాల్లో ఉన్నట్టే ఇందులోనూ డబ్బున్నోళ్లు , రాజకీయ నాయకులు , సినిమా వాళ్ళు ఎక్కువమంది ఉండొచ్చు .. అంత మాత్రాన అందరూ అదే కోవలోకి రారు.
అలాగే ఈ కులంలోనూ తప్పులు చేసే వాళ్ళు ఉండొచ్చు అంత మాత్రాన అందరూ తప్పులు చేయరు. కులం అనేది.. ఒక సమూహం. దేవుడేమీ .. కులాలకి పేర్లు పెట్టలేదు. అప్పట్లో ఒక సమూహంగా బతికేందుకు ఎవరికి వాళ్ళు ఇలా పేర్లు పెట్టుకున్నారు.
ఆ సంతతి అలా అలా పెరిగి కమ్మ , రెడ్డి , కాపు , యాదవ ,గౌడ , మాల , మాదిగ , లంబాడీ ఇలా అనేక కులాలుగా విభజించుకున్నారు. అదే కులాల పేర్లు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. కమ్మ కులం అంటే .. టీడీపీ అని అనుకోవడం మీ భ్రమ. వైసిపి లోను కమ్మ కులస్తులు ఉన్నారు.
ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలో ప్రధాన స్థానాల్లో కమ్మలు ఉన్నారు. జనసేన , బీజేపీల్లో కమ్మవాలకు ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ , BRS , బీజేపీలో కమ్మలున్నారు . అసలు రాజకీయాలు సంబంధం లేని ఎవరి బతుకు వాళ్ళు బతికే ఎంతోమంది కమ్మలు ఉన్నారు..
అన్ని కులాలు ఒక్కటే. కులం కూడు పెట్టదు. ఫలానా కులంలో పుట్టాలని ఎవరూ అనుకుని పుట్టరు. పుట్టాక ఫలానా కులం అని తెలుస్తుంది .. దయచేసి కులాల ప్రస్తావన పదేపదే తెచ్చి సమాజంలో చీలికలు తేవొద్దు.
– అశోక్ వేములపల్లి