రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఆ 11 సీట్లు కూడా రావు
జగన్ కు మంచి వైద్యమందించాలని వైసీపీ శ్రేణులే గొణుక్కుంటున్నాయి : మంత్రి సవిత
పెనుకొండలో రూ.40 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ
పూల మార్కెట్ ప్రారంభించిన మంత్రి సవిత .
పెనుకొండ/శ్రీసత్యసాయి: ‘దేశం మొత్తం ఏపీ రాజధాని అమరావతి అని అంటుంటే… జగన్ మాత్రం గంటకో మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి అమరావతే రాజధాని అంటారు.. మరోసారి మూడు రాజధానులంటారు… ఇంకోసారి మావిగన్ అంటారు… తాను ఉంటున్న లోటస్ పాండ్ ప్యాలెస్ కూడా రాజధానే అని అంటున్నారు… జగన్ కు మంచి వైద్యం అందించాలని స్వయాన వైసీపీ నాయకులు గొణుక్కుంటున్నారు ’ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. తన పార్టీ ఉనికి కోసమే జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవడంలేదన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజతో పాటు రూ.6 లక్షలతో నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఘనగిరి పూల మార్కెట్ ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. పూల వ్యాపారులను ప్రోత్సహించేలా పూల మార్కెట్ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించేందుకు రూ.50 లక్షలతో శానిటేషన్ సెంటర్లను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.5 కోట్లతో చేపట్టిన పనులు త్వరలో పూర్తి కానున్నాయన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మడకశిర రోడ్ వరకు కూడా సెంటర్ లైటింగ్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఆ 11 సీట్లు కూడా రావు..
విలేకరులకు అడిగిన ప్రశ్నకు మంత్రి సవిత స్పందిస్తూ… గంటకో మాట మార్చే వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. దేశం మొత్తం ఏపీ రాజధాని అమరావతి అని అంటుంటే జగన్ మాత్రం గంటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకసారి అమరావతే రాజధాని అంటారని, మరోసారి మూడు రాజధానులని, ఇంకోసారి మావిగన్ అని, తాను ఉంటున్న లోటస్ పాండ్ ప్యాలెస్ కూడా రాజధానే అని అంటున్నారని అన్నారు.
ఇలా రాజధానిపై గంటకో మాట మాట్లాడే జగన్ కు మంచి వైద్యం అందించాలని స్వయాన వైసీపీ నాయకులు గొణుక్కుంటున్నారని మంత్రి సవిత అన్నారు. అమరావతి రైతులు, మహిళలను ఇబ్బందులకు గురిచేయడం వల్లే వైసీపీకి ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో గతంలో వచ్చిన సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా వ్యవహరించే వ్యక్తి జగన్ అని మంత్రి సవిత విమర్శించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.