దేశ రాజకీయాలలో రెండు వేల పైచిలుకు పార్టీలు ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అన్నిటికన్నా విలక్షణమైనది విభిన్నమైనటువంటిది అని చెప్పక తప్పదు. సమకాలీన రాజకీయాలలో స్వదేశీ సిద్ధాంతాల పునాదులతో దేశభక్తి కలిగిన నిబద్ధత కలిగిన కార్యకర్తల నిర్మాణంతో యావత్ సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తూ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నేడు బిజెపి 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలిచాను.
స్వాతంత్రానంతరం స్వదేశీ ఆలోచనలతో జాతీయ భావాలతో ప్రజల్ని ఏకతాటిపై నడుపుతూ వెయ్యి సంవత్సరాల బానిస బ్రతుకు కష్టాలని కడతేర్చి అంతకు మునుపు ఉన్న సుసంపన్న సమృద్ధ భారతావని పునర్ నిర్మించడానికి ఏర్పడిన పార్టీ భారతీయ జన సంఘ్.
1975 లో దేశంలో ఇందిరా గాంధీ గారు ఎమర్జెన్సీని విధించి ప్రజలను చిత్రహింసలకి గురి చేస్తుంటే ఆ దాస్టికాలపై పోరాడిన జన సంఘ్, 1977లో జరిగిన ఎన్నికల్లో దేశం కోసం ఇందిరాగాంధీ గారి ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తమ పార్టీని సైతం రద్దు చేసుకుని జనతా పార్టీతో విలీనమయి మొరార్జీ దేశాయ్ గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
కానీ ఆ ప్రభుత్వం కూలిపోయిన తదనంతరం జన సంఘ్ ఏర్పాటుచేసిన ప్రముఖులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్ కె అద్వానీ గారు వంటి ప్రముఖులు భారతీయ జనతా పార్టీని ఏప్రిల్ 6 1980లో ప్రారంభించారు.
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం “ఏకాత్మ మానవ దర్శనం”, దీన్ని ప్రవచించింది మా పార్టీ వ్యవస్థాపకులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ. భారతదేశం తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే ఉత్తమమైన సమాజ నిర్మాణం చేయక తప్పదు… ఆ లక్ష్యాలని సాధించాలంటే ఉత్తమ వ్యక్తుల నిర్మాణం తప్పదు.
ఉత్తమ వ్యక్తుల నిర్మాణం జరగాలి తద్వారా ఉత్తమ కుటుంబాల నిర్మాణం జరగాలి. తద్వారా ఉత్తమ సమాజం నిర్మాణం తద్వారా ఉత్తమ దేశ నిర్మాణం జరుగుతుంది. ఉత్తమ వ్యక్తి నిర్మాణం అంటే మనిషిని ఒక వస్తువుగా కాక ధర్మార్థ కామ మోక్షాలను జయించే పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలి.
మనిషికి భౌతిక అవసరాలే కాదు. ఆధ్యాత్మిక అవసరాలు తీరినప్పుడు అతను పరిపూర్ణమైన సంతోషకరమైన వ్యక్తిగా కాగలడు అప్పుడే తన ద్వారా కుటుంబం సమాజం దేశం పరిపూర్ణత సాధిస్తుంది అన్నది బిజెపి ఏకాత్మ మానవ దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం.
భారతదేశం తన పునర్ వైభవాన్ని సాధించటానికి మరో ముఖ్య మార్గం “అంత్యోదయ” అని పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రవచించారు. ప్రభుత్వం యొక్క పథకాలు ఆలోచన ఎప్పుడూ సమాజంలో అట్టడుగున ఉన్న పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం రూపొందించి వారికి గౌరవంగా అన్ని అవకాశాలు కల్పించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ప్రజాస్వామ్య ప్రక్రియలు భాగం చేయటం ప్రజాస్వామ్య ఫలాలని వారికి అందించటం అన్నదే అంత్యోదయ విధానం.
బిజెపి సిద్ధాంతాలను ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గడిచిన 12 సంవత్సరాలుగా అనేక పథకాలు, ప్రణాళికలు, కార్యక్రమాల రూపంలో తూచా తప్పకుండా అమలు చేస్తూ పేదల్ని బలోపేతం చేస్తూ పేదరికాన్ని తగ్గిస్తూ ముందుకు సాగటం మనం చూస్తున్నాం.
ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పైచిలుకు పరిపాలించిన పార్టీ అనేక పథకాలు ప్రకటించినప్పటికీ అవి ప్రకటనలు మాత్రమే పరిమితం అయ్యాయి కానీ ఆచరణలో అంతంత మాత్రమే అని చెప్పక తప్పదు. ఢిల్లీ నుండి 100 రూపాయలు పంపితే అది క్షేత్రస్థాయిలో పది రూపాయలు కూడా చేరటం లేదని ఆ నేతలు అంటే ప్రధాని మోడీ గారి నేతృత్వంలో వందకి వంద ప్రజలకి చేరటం నాయకుడి పరిపాలన దక్షత- సిద్ధాంతాల పునాదికి ప్రతీక.
2014 మునుపు దేశంలో కోట్లాదిమంది బ్యాంక్ వ్యవస్థలకి దూరంగా ఉండేవారు, బ్యాంకు ఖాతా తెరవాలి అంటే అదొక యుద్ధ ప్రయాస. అలాంటిది ప్రధాని మోడీ గారు జీరో బ్యాలెన్స్ “జన్ ధన్” ఖాతాలు ఉచితంగా తెరిపించి పేదలని బ్యాంకింగ్ రంగానికి దగ్గర చేస్తే నేడు 55 కోట్ల పైచిలుకు జన్ ధన్ ఖాతాలు ఉంటే దానిలో పేదలు లక్షల కోట్లు డబ్బులు దాచుకున్నారు.
వారికి ముద్ర రుణాలు ఎటువంటి పూచీకత్తు లేకుండా వారి చిన్నచిన్న వ్యాపారాలకి సహకరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. పేదల జీవిత భద్రత కోసం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకాలు, తోపుడు బళ్ళు వ్యాపారస్తులకు స్వనిధి పథకం ద్వారా ఏ పూచీకత్తు లేని రుణాలు, ప్రపంచంలో అతిపెద్ద ఉచిత ఆరోగ్య భద్రత పథకం ఆయుష్మాన్ భారత్, పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇచ్చే జల్ జీవన్ మిషన్, ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం ఉజ్వల పథకం, తక్కువ ధరకి ఎల్ఈడి బల్బులు అందించే ఉజాలా పథకం, కరెంటు లేని మూడు కోట్ల ఇళ్ళకి ఉచితంగా కరెంట్ కనెక్షన్ ఇచ్చే సౌభాగ్య యోజన పథకం, రోడ్లు లేని గ్రామాలకు ప్రధాని మంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా రోడ్లు, మహిళా సాధికారిక కోసం డ్వాక్రా సంఘాలు వాటికి రుణాలు, యువత శిక్షణ కోసం కౌశల్ వికాస్ యోజన పథకం, సన్న చిన్న కారు రైతుల సంక్షేమం కోసం వారికి నేరుగా సంవత్సరానికి 6000 రూపాయలు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ పథకం, రైతులకి భారత్ ఎరువుల ద్వారా తక్కువ ధరకే ఎరువులు అందించడం, కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించడం ఇలా అనేక పథకాలు పేదల అభ్యున్నతి కోసం కుల మత ప్రాంత వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి అందించిన ఘనత ప్రధాని మోడీ గారిది.
అందుకే గడచిన 12 ఏళ్ల కృషి కారణంగా ఇప్పటికీ 25 కోట్ల మంది ప్రజలు కటిక పేదరికం నుంచి బయటపడ్డారని అనేక అంతర్జాతీయ సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. 2014లో భారతదేశం ప్రపంచంలో ఐదు బలహీనమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండేది అలాంటిది ఈరోజు భారతదేశం ప్రపంచంలో నాలుగవ పరిపుష్టమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అంటే ప్రధాని మోడీ గారు గత 12 ఏళ్లుగా అమలు చేస్తున్న పథకాలు బలవంతంగా ప్రజలకి చేరుతున్నాయి అని చెప్పవలసిన ఆవశ్యకత ఉంది అలాగే బిజెపి సిద్ధాంతం అంత్యోదయని మెచ్చుకోవలసిన అవసరం ఉంది.
చాలా రాజకీయ పార్టీలకి ప్రభుత్వం ఏర్పాటు అంటే ఒక అధికారం కోసం అవినీతి సొమ్ము కోసం ఆదిపత్య ఊరు కోసం కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం ప్రభుత్వ ఏర్పాటు అంటే ప్రజల సేవ కోసం, వారి అభివృద్ధి కోసం, దేశ నిర్మాణం కోసం. 2047 కల్లా భారతదేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని వికసిత్ భారత సంకల్ప యాత్రతో లక్ష్యంతో మనమంతా ప్రధాని మోడీ గారి నేతృత్వంలో సాగాలని భారతదేశ పునర్నిర్మాణ ఈ మహా యాత్రలో అందరూ భాగం కావాలని బిజెపితో కలిసి రావాలని నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
– పెద్దిరెడ్డి రవికిరణ్
(బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆంధ్ర ప్రదేశ్)