– ప్రజలను బెదిరించి, రైతులపై దాడులు చేసి భూములను లాక్కుంటున్నారు
– వేములకట్ట, కూకట్పల్లి, కొండాపూర్, మానసా హిల్స్, కొత్తవలగూడ, వట్టినాగులపల్లి, నాదర్గుల్ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి
– పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి
– భూ కబ్జాదారులపై బీఆర్ఎస్ ధర్మయుద్ధం
– ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది దోపిడీ పాలన
– ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకులు హరీష్ రావు , సవితా ఇంద్రారెడ్డి , దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే హరీష్ రావు ఎక్కడ ఉంటే అక్కడికి వందల వేల మంది కార్యకర్తలు చేరుకుని ముట్టడి చేస్తారని హెచ్చరిస్తున్నాము. ఈ రోజు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ , అభిలాష్ రావు , శ్రీనివాస్ యాదవ్ , నరసింహ గౌడ్ కలిసి ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నారు.
తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజగిరి, ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల భూ యజమానులకు అత్యంత కీలక హెచ్చరిక జారీ చేస్తున్నాము. గతంలో దొంగలు, దోపిడిదారులను చూశాం, ఇప్పుడు ప్రభుత్వ ముసుగులో రియల్ ఎస్టేట్ మాఫియా, భూదొంగలు తయారయ్యారు. ఖాళీ భూమి కనబడితే గద్దల మాదిరిగా దూకి, నకిలీ పత్రాలు సృష్టించి, అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని కోర్టు తీర్పులను కూడా లెక్కచేయకుండా భూదోపిడికి పాల్పడుతున్నారు.
ప్రజలు తమ భూములను కాపాడుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి, దోపిడిదారులను ఎక్కడికక్కడ ఎండగట్టాలి. నాదర్గుల్ ప్రాంతంలోని సర్వే నంబర్ 613లో సుమారు 373 ఎకరాల భూమి కేసు స్పష్టమైన ఉదాహరణ. 1974 ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం ప్రకారం ఈ భూమి ప్రభుత్వానికి చెందాల్సి ఉండగా, అక్రమంగా వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. తర్వాత ప్రభుత్వం ఈ భూమిని టీఎస్ఐఐసి కు కేటాయించింది, అలాగే ఆర్డీఓ కూడా ఇది ప్రభుత్వ భూమి అని ప్రకటించారు.
హైకోర్టు కూడా 2020లో ఇచ్చిన తీర్పులో ఈ భూమి ప్రభుత్వానిదేనని స్పష్టంగా పేర్కొంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ హైకోర్టు తీర్పు అమల్లోనే ఉంది. అయినా కూడా నకిలీ పత్రాలతో భూమిని తమదిగా చూపిస్తూ ఫెన్సింగ్ చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి ఈ దోపిడికి సహకరించడం దారుణం. వేల కోట్ల రూపాయల విలువైన భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మానసా హిల్స్, వట్టినాగులపల్లి, నాదర్గుల్ వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో భూదోపిడీ జరుగుతోంది. ప్రజలను బెదిరించి, రైతులపై దాడులు చేసి భూములను లాక్కుంటున్నారు. ఈ దోపిడీ ద్వారా వచ్చిన డబ్బులు ఇతర రాష్ట్రాల ఎన్నికలకు పంపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది దోపిడీ పాలన. ఒక మంత్రి తప్పు చేస్తుంటే, ముఖ్యమంత్రి సమర్థిస్తుంటే, మిగతా మంత్రులు మౌనం వహించడం అనుమానాస్పదం.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ , శ్రీధర్ బాబు ఎందుకు స్పందించడం లేదు? మంత్రులు మాత్రమే కాదు, అధికారులు కూడా ఈ దోపిడీలో భాగస్వాములయ్యారు. కలెక్టర్, ఆర్డీఓ , ఎమ్మార్వో ఎవరూ మినహాయింపు కాదు. అందరూ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందే. నకిలీ పత్రాలతో ప్రజలను మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు.
నాదర్గుల్ భూమి వ్యవహారం ప్రభుత్వ-అధికారుల కుమ్మక్కు ఎలా ఉందో చూపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మూడు స్తంభాలు—విధాన నిర్ణేతలు, కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ—ఇవన్నీ ప్రమాదంలో పడుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది.
వేములకట్ట, కూకట్పల్లి, కొండాపూర్, మానసా హిల్స్, కొత్తవలగూడ, వట్టినాగులపల్లి, నాదర్గుల్ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. మీడియా ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలి. లేకపోతే భవిష్యత్ తరాలకు భూమి మిగలదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద మంత్రి సహా సంబంధిత అధికారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ధర్మయుద్ధం కొనసాగిస్తుంది.