– 7 వేల కోట్లతో నియోజకవర్గానికో ఏఐ సెంటర్ పెట్టొచ్చు
– రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి డబ్బు సంపాదించాలని ఉంటే,న్యాయబద్దంగా సంపాదించాలని,భూ కబ్జా చేయడం ద్వారా కాదని,అవసరమైతే ఎల్.బి నగర్ చౌరస్తా,బోడుప్పల్ చౌరస్తా వద్ద అడ్డాకూలాలుగా పని చేసి,షాపింగ్ మాల్స్ లో సేల్స్ మెన్ గా పనిచేసి సంపాదించుకోవాలని, రాష్ట్ర ప్రజల ఆస్తిని దోచుకుంటే ఊరుకునేది లేదని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సి డా.దాసోజు శ్రవణ్ తో కలిసి పత్రికా సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,తెలంగాణ హై కోర్టు, భారత సుప్రీం కోర్టు,భూ సంస్కరణల చట్టాన్ని ఉల్లంఘిస్తూ,స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి,రెవెన్యూ శాఖ మంత్రి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నాదర్ గుల్ లో 374 ఎకరాలు ప్రభుత్వ భూమేనని హైకోర్టు చెప్పినప్పటికీ వినకుండా దౌర్జన్యంగా అధికారులను బెదిరించి భూ కబ్జాకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.అక్కడ అనేక సంవత్సరాలుగా భూమిని సాగు చేస్తున్న రైతులు వస్తే,ప్రైవేట్ బౌన్సర్లనుపెట్టి దాడులకు పాల్పడటాన్ని వ్యతిరేకించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్,ఫ్యూచర్ సిటీ పోలీస్ కమీషనర్, జిల్లా ఆర్డీవో, ఆదిబట్ల ఇన్సిపెక్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేసి కబ్జాకు పాల్పడుతుంటే, పోలీసులు ఎస్ఓపి సెక్షన్ 30 ప్రకారం సుమోటో కేసుగా నమోదు చేసి ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీ భూ కబ్జాకు పాల్పడుతుంటే,పోలీసులు అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. అధికారులు రెవెన్యూ మంత్రి కుమ్మక్కై, ముఖ్యమంత్రి సహకారంతో ప్రభుత్వ విలువైన భూములను లాక్కుంటున్నారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రేవంత్ రెడ్డి ప్రణాళిక బద్దంగా ముఖ్యమంత్రి, హోంశాఖ,మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలు దగ్గర పెట్టుకున్నారని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూశాఖ, పౌరసరఫరాల శాఖ దగ్గర పెట్టుకొని, ప్రజలకు ఎవరికీ తెలియకుండా లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతున్నారన్నారు. లగచర్ల,వెలుగుమట్ల,కొత్వాల్ గూడ,నానక్ రాం గూడ,పరిగి,రేగడి దోస్వాడ,హిల్ట్, మూసీ వంటి ప్రాంతాల్లో కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
నిన్న నాదర్ గుల్ భూములకు సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడకుండా,కంపెనీలతో ప్రెస్ మీట్ పెట్టించారని,అక్కడ విలేకర్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోయారని,దమ్ముంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తి వివరాలతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. పాలేరు,గాంధీభవన్,ప్రెస్ క్లబ్ ఎక్కడికైనా రావడానికి సిద్దమేనని స్పష్టం చేశారు.
నాదర్ గుల్ లో ప్రభుత్వం లాక్కోవాలని చూస్తున్న 7 వేల కోట్లు ప్రజలకోసం ఉపయోగిస్తే,ప్రజలకు 1,32,000 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించవచ్చు, 7 లక్షల ఎకరాలను సాగు చేస్తున్న 9 లక్షల రైతులకు రుణమాఫీ చేయవచ్చని,ఒక్కొక్క పౌరునికి రూ.500 ఇచ్చి,అన్ని టెస్టులు చేసి ప్రజలు మరణాల బారిన పడకుండా కాపాడవచ్చని గుండె,లివర్,బిపి,షుగర్ వంటి టెస్టులు చేయించవచ్చని,ఒక్కో పౌరునికి స్మార్ట్ వాచ్, షూస్ ఇచ్చి,ఆరోగ్యం కాపాడవచ్చని,రాష్ట్ర వ్యాప్తంగా 1400 నుండి 3500 స్పోర్ట్స్ అకాడమీలు పెట్టి, సిరాజ్,రొనాల్డో, నిఖత్ జరీన్ లను తయారుచేయవచ్చని, 40 లక్షల మంది నిరుద్యోగుల కోసం మండలాల్లో ఎసి కోచింగ్ సెంటర్లు పెట్టవచ్చు.
బీహార్ వాల్లు రైల్వే ఉద్యోగాలు పొందుతున్నట్టు మనం కూడా అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా చేయవచ్చు,1,40,000 లైబ్రరీలు కట్టవచ్చు,.ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్లు ప్రతి నియోజకవర్గంలో పెట్టొచ్చని,విదేశాలకు వెళ్లే విద్యార్థులకు 2,80,000 మందికి సాయం చేయొచ్చని, వారు నెలకు 1000 ఇచ్చినా 2800 కోట్ల ఆదాయం వస్తుందని వివరించారు. కానీ ఇన్ని అవకాశాలు ఉన్నా, కేవలం ముఖ్యమంత్రి,రెవెన్యూశాఖ మంత్రి కలిసి 7 వేల కోట్లు తమ జేబులో వేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
భూసంస్కరణ చట్టం సెక్షన్ 28 ప్రకారం, సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూమి అయితే 54 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న మిగిలిన 320 ఎకరాల భూమిని కాపాడాలని అధికారులకు సూచించారు. అధికారులే ఫైల్స్ పై సంతకాలు చేయాల్సి ఉంటుందని,ప్రభుత్వం మారిన తర్వాత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, తమిళనాడులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించినట్టుగానే, భూ కబ్జాలకు సహకరిస్తున్న అధికారులపై కూడా చట్ట పరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.
అధికారులకు 72 గంటల సమయం ఇస్తున్నాం, వెంటనే భూ కబ్జాకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైడ్రా అధికారులు అమీన్ పూర్ భూమిని కాప్డినట్టుగానే నాదర్ గుల్ భూమిని ఎందుకు కాపాడడంలేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల ఆయుష్షు 1 సంవత్సరం 2 నెలలు తగ్గిందన్నారు.ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించకుండా,తీవ్రమైన ఒత్తిడి,అసహనం,భయాందోళనకు గురిచేయడం వల్ల కార్డియాల్ హార్మోన్ అదుపులో లేక స్టీరాయిడ్స్ విడుదలై ప్రజల ఆయువు తగ్గిందన్నారు.
అదే కేసిఆర్ పాలనలో మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్,రైతు బంధు, రైతు భరోసా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజల ఆయుర్దాయం 2,3 ఏళ్లు పెరిగిందని పేర్కొన్నారు.
ఈ అంశంపై ప్రజలు,ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండి,ఈ భూ కబ్జాలపై రీల్స్,షాట్స్ చేసి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఇది కేవలం నాదర్ గుల్ సమస్య కాదని,ఆదిలాబాద్,అలంపూర్ రైతులు కూడా స్పందించాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఆదిలాబాద్ లో మాట్లాడుతూ,ప్రజలకు ఏడవ గ్యారంటీ కింద స్వేచ్ఛ,స్వాతంత్య్రం ఇచ్చామని,ప్రజలకు ఏమైనా మాట్లాడవచ్చు,ఎక్కడైనా తిరగవచ్చు అని చెప్పి, 24 గంటలైనా గడవకముందే పరిగి భూ బాధితులను కలవడానికి వెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులను అక్రమంగా అరెస్ట్ చేసి బాధితుల పక్షాన మాట్లాడకుండా, వారిని కలగకుండా గొంతునొక్కుతున్నారని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అభిలాష్ రావు, శ్రీనివాస్ యాదవ్, నర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.