– జగిత్యాల సభ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రక మలుపు
– తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతున్న కేసీఆర్ సభ
– ప్రజల ఆకాంక్ష ఒక్కటే.. ‘రేవంత్ పోవాలి – కేసీఆర్ రావాలి’
– ముఖ్యమంత్రికి కమీషన్ల యావ
– 16 ఏళ్ల క్రితం మెట్పల్లిలో మొదలైన బంధం.. మళ్ళీ అదే స్ఫూర్తితో పనిచేద్దాం
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
మెట్పల్లి / కోరుట్ల: ఈ నెల 20వ తేదీన జగిత్యాలలో నిర్వహించనున్న భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బహిరంగ సభను కోరుట్ల నియోజకవర్గం నుండి వేలాది గా తరలివచ్చి విజయవంతం చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
జగిత్యాల సభ కేవలం ఒక రాజకీయ సభ మాత్రమే కాదని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోయే సభ జగిత్యాల సభ అని ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.
కొరుట్ల నియోజకవర్గ ప్రజలు ఈ సభలో భాగస్వాములు కావడం వారి అదృష్టమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ పాలన పోవాలి –మళ్ళీ కేసీఆర్ రావాలి” అనే నినాదం మార్మోగుతుంది అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై విమర్శల జల్లు కురిపించారు. సరిగ్గా 16 సంవత్సరాల క్రితం, 2010లో జరిగిన బై-ఎలక్షన్స్ (ఉప ఎన్నికలు) సమయంలో కేసీఆర్ తనను మెట్పల్లి రూరల్ మండల ఇంచార్జ్‌గా పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
జగిత్యాల సభ కోసం కోరుట్ల నియోజకవర్గ బాధ్యతను తనకు అప్పగించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తుంటే సభ విజయంపై తనకు పూర్తి నమ్మకం కలుగుతోందని అన్నారు. “కార్యకర్తలు లేకపోతే నాయకుడు లేడు, పార్టీ లేదు. మీతోనే నాయకుడు.. మీతోనే పార్టీ” అని స్పష్టం చేశారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకుని, నాయకుడికి వెన్నంటి ఉండే ఇలాంటి కార్యకర్తలు ఉన్నంత వరకు ఏ ఎన్నికనైనా సునాయాసంగా గెలవవచ్చని పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కి ఆ పార్టీలో జరుగుతున్న అన్యాయంపై వేముల స్పందించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిబద్ధత కలిగిన జీవన్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎటువంటి స్పష్టమైన పాలసీ లేదని కొందరు అంటుంటే.. నేను మాత్రం ఆయనకు ఒక బలమైన పాలసీ ఉందని అది “లాగుల్లో తొండలు వేయడం”, “పేగులు తీసి మెడలో వేసుకోవడం”, “నెత్తి మీద కాలు పెట్టి తొక్కడం”. ఇవే రేవంత్ రెడ్డి అసలైన పాలసీలని ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఎన్నికల సమయంలో 3 నెలల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు అమలు చేయలేక రేవంత్ రెడ్డి మాట మారుస్తున్నారు. “మూడు నెలల్లోనే పిల్లలు పుడతారా?” అని రేవంత్ రెడ్డి అడగడం విడ్డూరంగా ఉంది. 3 నెలల్లో చేస్తానని చెప్పింది మీరు కాదా? అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ అన్నట్లు మూడు నెలలు కాదు 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే ఆ లోపం ఎవరిదో రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి.
“రుణమాఫీ చేశానంటాడు ముఖ్యమంత్రి.. కానీ ఎందరికి రుణమాఫీ అయిందో తెలియదు అని ఆయన్నే అంటాడు.రైతుబంధు ఎన్నిసార్లు వేశారో తెలియదు అంటాడు,తెలియకపోతే మరి నువ్వెందుకు ముఖ్యమంత్రివి?” అని ప్రశాంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరుతో రూ. 1,50,000 కోట్లతో అతిపెద్ద దోపిడీకి కాంగ్రెస్ స్కెచ్ వేసిందని విమర్శించారు. డ్రైనేజీ నీటిని ఆపడం,శుద్ధి చేయడం,గోదావరి నీళ్లు తెచ్చి మూసీని క్లీన్ చేయడం పక్కనపెట్టి, వేల కోట్ల భూముల చుట్టూ ముఖ్యమంత్రి ప్రదక్షిణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ‘స్నానం చేసినాక మేకప్ వేసుకోవడం కాదు.. మేకప్ వేసుకున్నాక స్నానం చేయడం’ లాంటి విడ్డూరమని ఎద్దేవా చేశారు.
మార్కెట్లో రూ. 6,500 కే దొరికే ఫోన్లను, అంగన్వాడీల కోసం రూ. 11,600 పెట్టి కొనుగోలు చేస్తూ రూ. 30 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కిలోమీటరు రోడ్డు విస్తరణకు రూ. 1.5 కోట్లు ఖర్చవుతుంటే, హామ్ (HAM) మోడల్ పేరుతో కి. మి కు రూ. 3.30 కోట్లు కేటాయించి, ముందస్తుగా 10% అడ్వాన్స్ ఇస్తూ కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు.
సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,ఎమ్మెల్సీ రమణ, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.