– ఇస్కపల్లి, పట్టపుపాళెం గ్రామస్తుల సంచలన నిర్ణయం
– నెల్లూరు జిల్లాలో ‘దురాయ్’ దుమారం
– జంజాటంలో జగన్ జువ్వలదిన్నె పర్యటన
– బీద కుటుంబంపై టీడీపీ అనుకూల మీడియా కథనాలు
– కావలి అగ్రనేతకు తెలియకుండానే అక్కడ ఓ కంపెనీ
– లోకేష్ ప్రోత్సాహంతో మత్స్యకారుల కోసం వస్తున్న కంపెనీ
– లోకేష్, బీదపై కావలి టీడీపీ ప్రముఖుడి తిరుగుబాటు
– వారికి వ్యతిరేకంగా మత్స్యకారులను రెచ్చగొడుతున్న కావలి టీడీపీ అగ్రనేత
– ‘తెలుగు’బోటును ముంచేస్తున్న కావలి తమ్ముళ్లు
( సుబ్బు)
మత్స్యకారుల బోటు సమస్య అటు తిరిగి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం నావను ముంచేసే దిశగా వెళుతోంది. సొంత పార్టీ ప్రజాప్రతినిధులే దీనికి ఆజ్యం పోసి.. మత్స్యకారులను రెచ్చగొట్టి, రాజకీయ చలి కాచుకోవడమే ఆశ్చర్యం. అయితే టీడీపీ అగ్రనేతలు, ఒకవైపు సొంత పార్టీ నావనే ముంచేసే రాజకీయంలో బిజీగా ఉంటే.. పడవ రాజకీయాన్ని అగ్గితో రగిలించి చలి కాచుకునేందుకు వస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు, మత్స్యకారులు భారీ ఝలక్ ఇచ్చారు.
బుధవారం జువ్వలదిన్నె రానున్న జగన్ సభకు వెళ్లిన వారిపై, లక్ష రూపాయల జరిమానా విధిస్తామన్న మత్స్యకారుల పెద్దలిచ్చిన ‘దురాయ్’.. ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. వివాదరహిత నేత అయిన ఎంపి బీద మస్తాన్‌రావు, సౌమ్యుడిగా పేరున్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర లక్ష్యంగా టీడీపీలో జరుగుతున్న అంతర్నాటకాన్ని రక్తి కట్టించేందుకు, జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ సఫలమవుతాయో చూడాలి. మొత్తంగా నెల్లూరు జిల్లాను మళ్లీ ‘రెడ్డి రాజకీయమే’ శాసిస్తుండటం గమనార్హం.
నెల్లూరు జిల్లాకు చెందిన బోట్ల వ్యవహారం తమిళనాడు-ఏపీ సరిహద్దులో చిక్కుకుని వివాదమవుతున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన మర పడవలు, సరిహద్దులు దాటి నెల్లూరుకు చేరుకున్న నేపథ్యంలో, వాటిని మన మత్స్యకారులు పట్టుకున్నారు. వాటికి జరిమానా విధించారు. అయితే వాటిని వదిలేసిన క్రమంలో, అందుకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, ఆయన సోదరుడైన టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కారకులుగా జరుగుతున్న ప్రచారం, కొద్దిరోజుల నుంచి హాట్‌టాపిక్‌గా మారుతోంది.
పాండిచ్చేరిలో బీద మస్తాన్‌రావుకు వ్యాపారాలు ఉన్నందునే వారి బోట్లను విడిచిపెట్టార ంటూ.. కావలికి చెందిన ఓ టీడీపీ కీలక నేత చేయించిన ప్రచారమే, ఈ దుమారానికి కారణమని టీడీపీ నాయకత్వం గుర్తించింది. సదరు నాయకుడికి ఎలాంటి సమాచారం లే కుండా ఒక కంపెనీ అక్కడ పనులు ప్రారంభించడం, దానిని మంత్రి లోకేష్ ప్రోత్సహించడం సదరు కావలి అగ్రనేతకు ఏమాత్రం రుచించలేదట. తనకు సమాచారం లేకుండా, తన అనుమతి లేకుండా ఒక కంపెనీ తన ఇలాకాలో వ్యాపారం ప్రారంభించడం సదరు కావలి టీడీపీ అగ్రనేత అహాన్ని దెబ్బతీసిందట.
దానితో.. సదరు డిఫెన్సు కంపెనీ వస్తే మత్స్యకారులకు ఎలాంటి హక్కులు ఉండవని, నిర్బంధాలు ఉంటాయని రెచ్చగొట్టిన ఫలిత ంగా బోట్ల వివాదం ముదురుపాకాన పడింది. అది రోజూ రగులుతూనే ఉంది. వైసీపీ నేతలు రోజూ మీడియా కేంద్రంగా టీడీపీపై విరుచుకుపడుతున్నారు. అయితే, ఎంపి బీద రవిచంద్రకు పాండిచ్చేరిలో ఎలాంటి వ్యాపారాలు లేవని టీడీపీ నాయకులు మత్స్యకారులకు నచ్చచెప్పడంతో వారు శాంతించారు.
ఈలోగా రంగంలోకి దిగిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మత్స్యకారులకు అన్యాయం జరిగితే సిహ ంచేది లేదని, వారికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీనిని రాజకీయం చేస్తున్న వైసీపీ ఆడుతున్న గేమ్‌ను మత్స్యకారులు గమనించాలని పిలుపునిచ్చారు.
అయితే టీడీపీకి అనుకూల మీడియాగా పేరున్న రెండు మీడియా సంస్థలు రంగ ప్రవేశం చేసి.. మత్స్యకారులు ఎవరైనా బీద సోదరుల వద్దకు వెళితే లక్ష రూపాయల జరిమానా విధిస్తామంటూ కథనాలు వండి వార్చింది. దీనితో అటు టీడీపీ-ఇటు మత్స్యకారుల్లో గందరగోళం రేగింది. చివరాఖరకు ఇదంతా కావలి టీడీపీ అగ్రనేత ఆ రెండు మీడియా సంస్థలతో, వండి వార్పించిన కథనాలని నాయకత్వం నిర్థారించుకుంది. కాగా నిజానికి మత్స్యకారుల పెద్దలు అలాంటి నిర్ణయం ప్రకటించలేదని, మిగిలిన వారికి తర్వాత నిర్ధారించుకుంది.
జువ్వలదిన్నె కేంద్రంగా జరుగుతున్న బోటు రాజకీయం తెరవెనక కథ తెలుసుకున్న మంత్రి లోకేష్.. జువ్వలదిన్నె అంశంలో టీడీపీ నాయకులు ఎదురుదాడి చేయాలని పిలుపునివ్వడం ప్రస్తావనార్హం.
దీనిని రాజకీయంగా వాడుకునేందుకు రంగంలోకి దిగిన వైసీపీ చకచకా పావులు కదిపింది. ఈ వివాదాన్ని పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. బోటు వివాద నేపథ్యంలో జగన్ అక్కడికి వెళితే మైలేజీ వస్తుందని, బీద సోదరులను ముద్దాయిలుగా ఇరికించడం ద్వారా, టీడీపీని బలహీనపరచవచ్చన్న వ్యూహంతో జగన్‌ను అక్కడకు తీసుకువచ్చేందుకు నిర్ణయించారు. ఇదంతా వారం నుంచి జరుగుతున్న కథగానే తెలుస్తోంది.
ఈలోగా వాస్తవాలు తెలుకుసుకున్న మత్స్యకారుల పెద్దలు రంగంలోకి దిగి.. అసలు ఈ వ్యవహారంలో ఎవరు రాజకీయ నాయకులను సంప్రదించినా, వారికి లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రధానంగా జగన్ సభకు ఎవరు వెళ్లినా, వారిపై లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీనితో కులం కట్టుబాట్లు పాటించే మత్స్యకారులు వెనక్కి తగ్గడం అనివార్యమయింది.
జగన్ జువ్వలదిన్నె వస్తున్న నేపథ్యంలో.. అక్కడికి ఇస్కపల్లి పట్టపుపాళెం గ్రామానికి చెందిన మత్స్యకారులెవరూ ఆ సభకు, ఆయన కార్యక్రమాలను హాజరుకాకూడదని నిర్ణయించారు. దీనితో జగన్ కార్యక్రమం విజయవంతంపై సహజంగానే ఆసక్తినెలకొంది.
—-..
జువ్వలదిన్నె జగడం ఇదీ
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో మాయమైన నాలుగుబోట్ల వివాదం గత కొద్దిరోజుల నుంచి జిల్లాలో టాపిక్‌గా మారింది. వైసీపీ- ఆ పార్టీ అనుకూల మీడియా మాత్రం… ఇదంతా టీడీపీ ఎంపి బీద మస్తాన్‌రావు, ఆయన సోదరుడైన టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్ దగ్గరుండి పర్యవేక్షించి, పట్టుబడ్డ నాలుగుబోట్లను విడిపించారన్న ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ-మీడియా ప్రచారం వెనక కావలి టీడీపీ అగ్రనేత హస్తం ఉందని, టీడీపీ నాయకత్వం ఆలస్యంగా గుర్తించింది. సదరు ప్రముఖుడే తెరవెనక ఉండి, వారిని రెచ్చగొడుతూ, వైసీపీకి ఆయుధాలు అందిస్తున్నారని గ్రహించింది. ఆమేరకు నిఘా వర్గాలు సైతం నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ క్రమంలో ప్రభుత్వంపై మత్స్యకారుల వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు వస్తున్న జగన్ సభకు, కార్యక్రమానికి ఎవరు వెళ్లినా వారిపై లక్ష రూపాయల జరిమానా, అక్కడికి ఎవరు వెళ్లారో వారి పేర్లు చెబితే వారికి 40 వేల రూపాయల బహుమతి ఇస్తామని మత్స్యకారుల పెద్దలు ప్రకటించటంతో, జగన్ సభకు ఎవరూ హాజరుకాకూడదని ఇస్కపల్లి, పట్టపుపాళెం మత్స్యకారులు నిర్ణయించుకున్నారు. ఈ సమస్య తేలేవరకూ అసలు ఏ రాజకీయ నాయకుడి వద్దకు వెళ్లవద్దని వారు హుకుం జారీ చేశారు.
—