(ఇంద్రాణి)
టీడీపీలో యువనాయకత్వం పోకడ మొదలైనట్లు కనిపిస్తున్నది. రాజకీయాలలో డిఫెన్స్ ఆడటం సంప్రదాయ విధానం. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా అఫెన్స్ ఆడటం కష్టం. కారణం పనిచేయటం ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వం చేసే పనిలో లోపాలను ఎత్తి చూపటం ప్రతిపక్షం హక్కు. దేశంలో రాజకీయాలు గౌరవంగా నడిచినంత కాలం ఆ సంప్రదాయం కొనసాగింది.
కానీ తెలుగురాష్ట్రాలలో రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రతిపక్ష నాయకుడిని కచ్చితంగా ఏదో ఒక కేసులో ఇరికించే ప్రయత్నం చేయటం, శాసనసభలో వ్యక్తిగతంగా అవహేళన చేయటం లాంటి హుందాతనం లేని కార్యక్రమాలు మొదలయ్యాయి.కేసీఆర్‌తో రాజకీయ పదజాలం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రతిపక్షాన్ని నోరెత్తకుండా చేయటం రాజశేఖరరెడ్డి ప్రత్యేకత. ప్రతిపక్షం పైన దాడిచేసే సంస్కృతి రాజశేఖరరెడ్డితో మొదలై, జగన్మోహన్ రెడ్డితో వికృతరూపం దాల్చింది.
ఎదుటి వారిని మాటల దాడితో తప్పించి, విమర్శ అనేది వైసీపీ సంస్కృతిలోనే లేకుండా పోయింది. రాష్ట్రంలో వేరే పార్టీల ఉనికి నామమాత్రం అయింది. పోటీ టీడీపీ, వైసీపీల మధ్యే నడిచింది. కానీ జగన్, టీడీపీని విమర్శించటం కంటే టీడీపీ నాయకులను తిట్టటమే రాజకీయంగా చేస్తూ తన అధికార పర్వాన్ని నడిపాడు. తానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నిర్ణయాల గురించే విమర్శలు గుప్పించేవాడు. అందువలన వైసీపీ చేసే దాడికి, ప్రతిదాడి చేసే అవకాశం కూడా టీడీపీకి ఉండేది కాదు.
కూటమిప్రభుత్వం ఏర్పడినాక కూడా జగన్మోహన్ రెడ్డి అదే బాటలో నడిచే ప్రయత్నం చేశాడు. కానీ టీడీపీ మేల్కొన్నది అనిపిస్తున్నది. ఒకవైపు ఢిల్లీలో అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ నడుస్తూ ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ‘మావిగన్’ అంటూ ఒక అర్థరహితమైన ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చి అమరావతిని అవమానించే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎప్పటి మాదిరిగానే ‘మావిగన్’ అనే పేరు పెట్టటంలో తన చతురతకు విస్తృత ప్రచారం జరుగుతుందని భ్రమించాడు. ట్రోలింగ్‌తోనే తన ప్రతిపాదనకు విస్తృత ప్రచారం లభిస్తుందని ఆశించాడు. కానీ జగన్ ఆశలు ఆవిరి అయ్యాయి.
ఒకవైపు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మరోవైపు టీడీపీ నాయకత్వం వరుసగా ప్రతిరోజూ ఒకరి తర్వాత ఒకరు జగన్‌కు పబ్లిసిటీ ఇవ్వకుండానే అమరావతిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ‘మావిగన్’ను ‘తాలిబన్’గా మార్చేశారు. మొదటిసారిగా వైసీపీ సీనియర్ నాయకుల నుండి సోషల్ మీడియా వరకు, టీడీపీ వారు చేసే వ్యంగ్యోక్తులకు సమాధానం చెప్పటమే సరిపోతున్నది. ఒకవైపు రాధాకృష్ణ తన దగ్గర ఉన్న రహస్యం గురించి వదిలిన బాణానికి టీడీపీ వారితో పాటు వైసీపీ వారు కూడా ఊహలు జోడించే పనిలో మునిగితేలుతున్నారు.
వైసీపీ సీనియర్ నాయకత్వానికి టీడీపీ ఆడుతున్న అఫెన్సుకు సమాధానం చెప్పటమే సరిపోతోంది. సందట్లో సడేమియా అన్నట్లు మిథున్ రెడ్డి టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపయోగించిన ‘ఆత్మాహుతి దళం’ అనే పదాన్ని సమర్థించుకోవటం కూడా కష్టంగానే మారిపోయింది.మావిగన్‌ను సమర్థించబోయి మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని మరింత ఇరుకున పెట్టేశాడు. ప్రెస్ మీట్ పెట్టి బొత్స కార్చిన కన్నీరు తిరిగి బొత్సనే ఆత్మరక్షణ చేసుకోవలసిన పరిస్థితిలోకి నెట్టింది. ఆయనకు రాజశేఖరరెడ్డి గుర్తుకొచ్చి బాధపడ్డారో, జగన్మోహన్ రెడ్డిని గురించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు మరలా వెలుగులోకి తీసుకొచ్చినందుకు బాధపడ్డారో తెలియదు కానీ, ఆయన కన్నీరు మాత్రం సంచలనం అయ్యింది. కాకపోతే అది సానుభూతి పర్వం వైపు పయనించలేదు.
దాడిని ఎదుర్కోవలసిన పరిస్థితికి రావటం వైసీపీకి కొత్త అయితే, ఎదురు దాడి కాకుండా దాడి చేయటం టీడీపీకి కొత్త. ఇది చంద్రబాబు నాయుడు మార్క్ రాజకీయం కాదు. దాడినైనా, ఎదురు దాడినైనా తన పనితో సమాధానం చెప్పటమే చంద్రబాబు నైజం. దానివలన టీడీపీ భారీగానే నష్టపోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీడీపీ చేసిన పనులకు ప్రచారం ఎప్పుడూ తక్కువే. ఈ విషయంలో ఇప్పటికీ వెనుకబడే ఉన్నది, గతం కంటే ఇప్పుడు మెరుగు. ప్రస్తుతం టీడీపీ ఆడుతున్న విధానం గమనిస్తే, పార్టీ లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్నది అని అర్థం అవుతున్నది. లోకేష్ ‘యువగళం’ యాత్రను గమనించిన ఎవరికైనా తండ్రీకొడుకులు నడిచే విధానంలో తేడా అర్థం అవుతుంది. యువగళంలో ప్రధాన ఆకర్షణ ‘రెడ్ బుక్’. టీడీపీ అధికారంలోకి రాకముందే వైసీపీ అక్రమార్కుల, అరాచకవాదుల చిట్టాను రెడ్ బుక్‌లో నోట్ చేసి పెడుతున్నాను, అధికారంలోకి రాగానే చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని ఎవరినీ వదిలిపెట్టను అని హెచ్చరిస్తూ అందరి దృష్టిని రెడ్ బుక్ వైపు మళ్లించాడు.
అప్పటి నుండి రెడ్ బుక్‌లో ఎవరెవరి పేర్లు ఉంటాయో అని టీడీపీ శ్రేణులు ఊహించే ప్రయత్నం చేస్తుంటే, రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నాడు అంటూ వైసీపీ నేతలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పటికీ ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అనే పదాన్ని వైసీపీ వారి ఆలోచనల నుండి చెరపలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ కట్టుతప్పి మాట్లాడినవారిని, సామాజిక మాధ్యమాలలో విచ్చలవిడిగా చెలరేగిపోయిన వారిని మినహాయించి పెద్దగా ఎవరినీ అరెస్ట్ చేసింది లేదు. కానీ ఏ నిమిషంలోనైనా ఏదో చేస్తాడేమో అనే ఆలోచన మాత్రం వైసీపీ వాళ్ళను విడిచిపెట్టటం లేదు. లోకేష్‌ను తలచుకోకుండా రోజు గడవటం లేదు.
స్ట్రాటజీ విషయంలో ఇంతకాలానికి టీడీపీ పైచేయి సాధించింది. ఎప్పుడూ డిఫెన్స్ ఆడటం తెలియని వైసీపీకి ఈ కొత్త ఆట ఎలా ఆడాలో తెలియటం లేదు. “పాదయాత్రతో చంద్రబాబుకు చుక్కలు చూపిస్తా” లాంటి పడికట్టు మాటలతో కాలక్షేపం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా టీడీపీ కూటమి ముందు ఒక బాధ్యత ఉండనే ఉన్నది. పరామర్శలైనా, పాదయాత్రలైనా లోకేష్ యువగళం సాగినంత పద్ధతి ప్రకారం సాగాలి. “రప్పా రప్పలు”, “వేటలు తెగినట్లు తలకాయలు తెగుతాయి” లాంటి డైలాగులు లేకుండా పాదయాత్ర నిబంధనలకు అనుగుణంగా జరిగేలా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
పరామర్శలకు వెళ్లినా, పెళ్లిళ్లకు పేరంటాలకు వెళ్లినా నిబంధనలు విధిస్తున్నారే కానీ వాటి అమలును చూసుకోవటం లేదు. అంబటి రాంబాబు లాంటి వారు పోలీసులతో వాగ్వాదం చేస్తూ, బారికేడ్లను తోసిపారేస్తూ చట్టవిరుద్ధమైన పనులు చేసే పద్ధతులు ప్రజలకు నేర్పకుండా చూడాలి. రాష్ట్రంలో అన్ని పార్టీలు క్రమశిక్షణతో మెలిగేలా చూడవలసిన బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలి.
అల్లరిమూకలను ప్రభుత్వం అణచివేయగలదు అనే విషయాన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలకు, ప్రజలకు తెలియజేయాలి. రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల మాదిరిగా ప్రవర్తించేలా చేసినప్పుడే రాష్ట్ర పురోభివృద్ధి అంశంపైన సంస్కారవంతమైన చర్చలు జరుగుతాయి, ప్రజలకు కూడా రాష్ట్ర సమస్యలు అర్థం అవుతాయి.!