– పాలమూరు రిజర్వాయర్లను వచ్చే వానాకాలంలో ఖచ్చితంగా నింపాలి
– దానికి కావాల్సిన పనులను చేపట్టాలి
– ఒక్కసారి కూడా జిల్లా వాసి అయిన సీఎం కనీసం ఎందుకు సమీక్షించడం లేదు ?
– జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు హైలెవెల్ రివ్యూ కోసం ఎందుకు అడగడం లేదు ?
– డిండి టన్నెల్ తవ్వకాలలో ఎక్కడ కేఎల్ఐ టన్నెల్ తగిలినా మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది
– తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి
హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. పాలమూరు రిజర్వాయర్లను వచ్చే వానాకాలంలో ఖచ్చితంగా నింపాలి. దానికి కావాల్సిన పనులను చేపట్టాలి. మే మొదటివారంలో మా కార్యచరణ పూర్తి చేస్తాం. ప్రత్యక్ష యుద్దానికి పూనుకుంటాం. ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేందుకు మండుటెండల్లో పాదయాత్రలు చేస్తాం. పాలమూరును ఎందుకు పడావుపెట్టిండ్రో ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం.
కేఎల్ఐ నీళ్లు ఎలాంటి ఆంటంకం లేకుండా ఆ ప్రాంతానికి నీళ్లు చేరేలా చర్యలు తీసుకోవాలి. గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 1956కు ముందు పాలమూరు అత్యధిక వ్యవసాయ భూములు, చెరువులు, కుంటలు, బావులతో సస్యశ్యామలంగా ఉన్న జిల్లా సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత అవలంభించిన విధానాల మూలంగా తెలంగాణ వచ్చే నాటికి పాలమూరు జిల్లా వలసల జిల్లా , కరువు జిల్లా, ఆకలి జిల్లా, పేదల జిల్లా, వెనకబడిన జిల్లా. దాదాపు 14 లక్షల మంది వలసపోయిన జిల్లా.
ఈ బాధలు, కష్టాల ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమంలో పాటలు, సాహిత్యం, వ్యాసాలు అన్నీ పాలమూరు వెతలను కేంద్ర బిందువుగా చేసుకుని వచ్చినవే. తెలంగాణ ప్రకటించి వెనక్కి తీసుకున్న తర్వాత ఢిల్లీలో శ్రీక్రిష్ణ కమిటీ ముందు ఏప్రిల్ 16 2010న జయశంకర్ , కేసీఆర్, విద్యాసాగర్ రావు సమక్షంలో 16 మందిమి తెలంగాణకు ఉన్న హేతుబద్దతను వివరిస్తూ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రముఖంగా పాలమూరు జిల్లాకు జరిగిన నష్టాలను వివరించడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రంగానే ఉండి ఉంటే పాలమూరు ఎలా ఉండేది అని వివరించడం జరిగింది.
కేసీఆర్ అత్యంత ప్రభావశీలంగా తెలంగాణ ఏర్పాటు గురించి వివరించారని శ్రీకృష్ణ కమీషన్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ నేతలు వాస్తవాలను, ఆధారాలను, కండ్ల ముందు నిజాలను వదిలేసి సిగ్గు, ఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారు 2014కు ముందు పాలమూరు పరిస్థితి ఏమిటి అన్నది ప్రపంచం ముందు ఉన్నది. 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పు ఏమిటి అన్నది కండ్ల ముందు కనిపిస్తున్నది
ప్రభుత్వ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 2014లో పాలమూరు జిల్లాలో తలసరి ఆదాయం 74 వేలు. 2024 – 25 నాటికి 352.86 శాతం పెరిగి రూ.3,36, 898కి చేరింది. ఇవి ప్రభుత్వం యొక్క గణాంకాలు ఇవి. పాలమూరు జిల్లాలో వచ్చిన ఆర్థిక, రాజకీయ, సాంఘీక చైతన్యానికి ఒక ప్రతిరూపంగా నిలిచిన గణాంకాలు ఇవి. ఇవి విభజనకు ముందు, విభజన తర్వాత పాలమూరు ముఖచిత్రం ఇది.
ఈ రోజు కాంగ్రెస్ విధానాల మూలంగా తిరిగి రైతులు వలసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీళ్లు అందించడం జరిగింది. నిజాలు మాట్లాడితే వ్యక్తులను కించపరచడం తప్ప వాస్తవాలను అంగీకరించడం లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్ని రకాల అనుమతులు సాధించడం జరిగింది. 2013 భూసేకరణ చట్టంలోని కఠిన నిబంధనలను అధిగమించి పబ్లిక్ హియరింగ్ లు పూర్తి చేశాం. 5 రిజర్వాయర్లు కట్టి, నాలుగు పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసి, మోటార్లు పెట్టి ట్రయల్ రన్ నిర్వహించాం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడో ఏడాది నడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జిల్లా వాసి అయిన సీఎం కనీసం ఎందుకు సమీక్షించడం లేదు ? జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు హైలెవెల్ రివ్యూ కోసం ఎందుకు అడగడం లేదు ?
2014 పాలమూరు ఎన్నికల సభలో స్వయంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇచ్చి చేపడతాం అని ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. మూడోసారి ఆయన ప్రధాని అయ్యారు. లోక్ సభలో బీఆర్ఎస్ సభ్యులు లేని లోటు కానవస్తుంది. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కనీసం ఒక్కసారయినా పాలమూరు ప్రాజెక్టు అనుమతులు, నీటి కేటాయింపుల గురించి ఒక లేఖ, ప్రధానిని కలిసి ఒక విజ్థప్తి ఎందుకు చేయడం లేదు. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేస్తే కరివెన వరకు 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉంది.
ఏపీ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా అంటూ మొండివాదన చేస్తూ లేఖలు రాస్తున్నారు. కేసులు వేస్తున్నారు. దీని మీద రేవంత్ రెడ్డి మాట్లాడడం లేదు. చంద్రబాబును, మోడీని ఒప్పించి ఎందుకు పూర్తి చేయడం లేదు ? కాంగ్రెస్ ప్రభుత్వమే దీని సర్వేకు అనుమతులు ఇచ్చింది కదా? కృష్ణా బేసిన్ తో సంబంధం లేని ఏపీలో సగటున రోజుకు 13 టీఎంసీల నీళ్లు తరలించేందుకు పనులు పూర్తి చేసుకున్నారు. పెండింగ్ పనులు పూర్తయితే అది 16 టీఎంసీలకు చేరుకుంటుంది
కనీసం 2 టీఎంసీలు రోజుకు ఎత్తిపోసుకునే పాలమూరు రంగారెడ్డికి ఇన్ని అంటంకాలు ఉంటే పాలమూరు బిడ్డ అయిన రేవంత్ రెడ్డికి ఎందుకు పట్టడం లేదు. ఈ నిర్లక్ష్యం యొక్క భారీ మూల్యం పాలమూరు భావితరాలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. సమస్యల పరిష్కారానికి కేంద్రం మీద ఎందుకు వత్తిడి తేవడం లేదు. 70 మండలాకు మంచినీళ్లు, 12.50 లక్షల ఎకరాలకు సాగునీటి కోసం ఈ ఎత్తిపోతల చేపట్టడం జరిగింది.
అంతరాష్ట్ర వివాదాలు లేకుండా వట్టెం వద్ద ఒక తూము ఏర్పాటు చేసి లక్ష 50 వేల ఎకరాలకు కల్వకుర్తి ఎత్తిపోతల కింద సాగు నీరు ఇచ్చేందుకు నిర్ణయించాం. కేఎల్ఐ కాలువల సామర్ధ్యం తగ్గించిన నేపథ్యంలో నాలుగు మోటార్లు నడిస్తే ఆ కాలువలు సరిపోవు కాబట్టి ఈ ఏర్పాటు చేశాం. కల్వకుర్తి ప్రాంతంలోకానీ, జడ్చర్ల వద్ద కానీ ఒక రిజర్వాయర్ ప్రతిపాదిస్తే బావుండేది. కేఎల్ఐ కింద కేవలం నాలుగు టీఎంసీలలోపే రిజర్వాయర్లు ఉన్న నేపథ్యంలో రిజర్వాయర్ల ఏర్పాటుకు సర్వే చేయించడం జరిగింది.
పాలమూరు రంగారెడ్డి చేపట్టిన తర్వాత కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డికి కేఎల్ఐ ని అనుసంధానించడం జరిగింది. గతంలో ప్రతిపాదించిందే అంటూ ఏదుల రిజర్వాయరుకు ఆనుకుని 2.9 టీఎంసీల గొల్లపల్లి రిజర్వాయర్ 6 టీఎంసీలకు కడ్తామని రూ.1800 కోట్లతో ప్రతిపాదన తీసుకువచ్చారు. దానికి వ్యతిరేకంగా ప్రజలు 100 రోజులు దీక్షలు చేశారు. వారికి మద్దతుగా హరీష్ రావుతో బహిరంగసభ నిర్వహించారు. కానీ ప్రజలకు మద్దతుగా ఒక్క మంత్రి, ఎమ్మెల్యే స్పందించడం లేదు ఎందుకు ?
మంత్రి కృష్ణారావుకు ఏ సంబంధం లేదు. జూరాల, భీమా, కేఎల్ఐ నుండి సాగునీళ్లు వచ్చాయి. దేంట్లోనూ ఆయనకు ఎలాంటి పాత్ర లేదు. టెయిల్ ఎండ్ కు సాగునీళ్లు ఇవ్వడం కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా రామన్నగట్టు రిజర్వాయర్ కోసం గతంలో శంకుస్థాపన చేయడం జరిగింది. 10 వేల ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే దానిని రద్దు చేయించి గొల్లపల్లి రిజర్వాయర్ కడతాం అంటున్నారు.
నార్లాపూర్ – ఏదుల లింకులో కల్వకోలు వద్ద కాలువ పని పెండింగ్ లో ఉంది. 15 లక్షల మెట్రిక్ టన్నుల క్వాంటిటీ ఉన్న మట్టి పని, ఆరు స్ట్రక్చర్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. చిత్తశుద్దితో పనిచేస్తే ఆరు నెలలలో పనులు పూర్తవుతాయి. ఇవి పూర్తయితే 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉంది. రూ.1200 కోట్లతో ఈ పనులు పూర్తవుతాయి. దీంతో నాలుగు రిజర్వాయర్లు నింపుకుంటే జిల్లాలో భూగర్బజలాలు పెరుగుతాయి. రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే డిస్ట్రిబ్యూటరీ కాలువలతో సహా అన్నీ పనులు అయిపోతాయి.
నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల విఫల ప్రాజెక్టుగా మిగిలిపోతుంది. జూరాల కింద ఇప్పటికే ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. అక్కడి ప్రజలకు మేలు జరగాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల ద్వారా నారాయణపేట -కొడంగల్ కు సాగునీరు ఇవ్వాలని తలపెట్టారు. కానీ పెండింగ్ పనుల పూర్తికి కనీసం ప్రభుత్వం సమీక్ష చేయడం లేదు. డిండికి సాగునీళ్లు ఇవ్వాలని గతంలో పాలమూరు బీఆర్ఎస్ నేతలందరం ప్రతిపాదించాం. కాంగ్రెస్ వచ్చాక ఏదుల నుండి డిండి ఎత్తిపోతలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించి టెండర్లు పూర్తి చేసింది.
డిండి టన్నెల్ తవ్వకాలలో ఎక్కడ కేఎల్ఐ టన్నెల్ తగిలినా మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది. అందుకే వట్టెం వద్ద ఏర్పాటు చేసిన తూము ద్వారా దుందుబీ వాగులోకి నీళ్లు వదలడం ద్వారా డిండికి నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది. ప్రస్తుత మంత్రి జూపల్లి, అప్పటి ఎంపీ జితేందర్ రెడ్డి అందరూ ఈ ప్రతిపాదన మీద సంతకాలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మంత్రి నోరెత్తడం లేదు.
పాలమూరు ప్రజల శాశ్వత ప్రయోజనాల కోసం పాలమూరు మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేయాలి. మొండి వాదనతో పనులు చేస్తామన్న దోరణిని వదులు కోవాలి. ప్రతి ఎకరానికి సాగునీరు అందాలన్న తపనతో తాము పనిచేశాం. గతంలో తాము చొరవ తీసుకుని చేసిన పనుల మూలంగానే భీమా ద్వారా కొల్లాపూర్ ప్రాంతానికి 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది.