– దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోం
– మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
– నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం
– తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఒక “హైబ్రిడ్ ముఖ్యమంత్రి
– రేవంత్ రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదు
– ఉదయం ఆయన కాంగ్రెస్‌ను ప్రతినిధిగా ఉంటారు.. సాయంత్రానికి బీజేపీతో కలిసిపోతారు
– హైబ్రిడ్ విధానం ఆయన పాలనలో కూడా కనిపిస్తోంది
– పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో ఉన్న అస్పష్టతలపై కేటీఆర్ ఆందోళన
– దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్ల శాతం 24% గానే కొనసాగాలి.
– దీనిని మార్చే ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు
– దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది
– కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయాల మీద కాకుండా, పాలన మరియు ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని సూచన
– న్యూస్ ఏజెన్సీలతోపాటు ఫిర్జాదిగూడ మీటింగ్ లో మాట్లాడిన కేటీఆర్
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లుకు భారత్ రాష్ట్ర సమితి (BRS) మొదటి నుంచి చిత్తశుద్ధితో సంపూర్ణ మద్దతు ఇస్తోందని, తమ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత కోసం అనేక చర్యలు అమలు చేసిన రికార్డు తమకు ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియా సంస్థలతో కేటీఆర్ మాట్లాడారు.
కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడమే కాకుండా, అసెంబ్లీ మరియు కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేసిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా, స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, మార్కెట్ కమిటీల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా మహిళా సాధికారత పట్ల తమకున్న అచంచలమైన నిబద్ధతను చాటుకున్నామని తెలిపారు.
అయితే, మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మరియు రాజ్యాంగ సవరణలతో అనవసరంగా ముడిపెట్టడాన్ని కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అత్యంత సరళమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సంక్లిష్టం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. “మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయండి. పార్లమెంటులో 543 సీట్లు ఉన్నాయి, అక్కడ వర్తింపజేయండి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఇక్కడ కూడా అమలు చేయండి. సీట్ల పెంపు మరియు పునర్విభజనతో ముడిపెట్టి ఎందుకు అయోమయాన్ని సృష్టిస్తున్నారు?” అని ఆయన నిలదీశారు.
రాజ్యాంగ విధివిధానాల ప్రకారం మొదట జనగణన (Census), తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, ఆ తర్వాతే నిర్మాణాత్మక మార్పులు జరగాలని కేటీఆర్ స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగని ఏ సహేతుకమైన ప్రతిపాదనకైనా బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని, కానీ దక్షిణాదికి అన్యాయం చేసే ప్రయత్నం జరిగితే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తామని, అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, ఆయనను ఒక “హైబ్రిడ్ ముఖ్యమంత్రి”గా కేటీఆర్ అభివర్ణించారు. రేవంత్ రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదని ఆరోపించారు. “ఉదయం ఆయన కాంగ్రెస్‌ను ప్రతినిధిగా ఉంటారు, సాయంత్రానికి బీజేపీతో కలిసిపోతారు. సహజంగానే ఇలాంటి హైబ్రిడ్ విధానం ఆయన పాలనలో కూడా కనిపిస్తోంది” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇతరుల నుంచి నిబంధనలు కోరుతున్న ముఖ్యమంత్రి, హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదన విషయంలో జీహెచ్ఎంసీ (GHMC) ప్రతినిధులు, జెడ్పీటీసీ (ZPTC) సభ్యులు లేదా ఎమ్మెల్యేలను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. “మీకో విధానం, ఇతరులకో విధానం అంటే కుదరదు. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయకుండా స్పష్టతతో, బాధ్యతతో మాట్లాడాలి” అని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో ఉన్న అస్పష్టతలపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 50% సీట్లు పెరుగుతాయని కేంద్ర నేతలు చెబుతున్నప్పటికీ, బిల్లులో మాత్రం ఆ ప్రస్తావన ఎక్కడా లేదని గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై 2022–23 నుంచే బీఆర్ఎస్ గళమెత్తుతోందని, కేవలం జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
1971లో పార్లమెంటు సీట్లపై విధించిన స్తంభన జనాభా నియంత్రణ ప్రాతిపదికన జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. గత ఐదు దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేశాయని తెలిపారు. “జాతీయ జనాభా విధానాన్ని తూచా తప్పకుండా పాటించినందుకు ఇప్పుడు మమ్మల్ని శిక్షిస్తారా?” అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం సుమారు 24% ఉందని, ఈ శాతాన్ని ఏ స్థితిలోనైనా కాపాడాలని ఆయన నొక్కి చెప్పారు. “0.01% శాతం తగ్గుదల కూడా మాకు ఆమోదయోగ్యం కాదు. ఆరు దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్ల శాతం 24% గానే కొనసాగాలి. దీనిని మార్చే ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు” అని కేటీఆర్ హెచ్చరించారు.
ఈ ఆందోళనలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. “మీరు ఒక నిప్పుల కుంపటి (Powder keg) మీద కూర్చున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది” అని కేటీఆర్ అన్నారు. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయాల మీద కాకుండా, పాలన మరియు ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని సూచిస్తూ కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.