– ఈ సమస్య ముగిసిందని జేఏసీ ఎలా ప్రకటిస్తుంది?
– ఇది బాధితుడిపైనే మళ్లీ దాడి చేసేలా ఉంది
– అధికారులు, ఉద్యోగులకు ఆత్మగౌరవం లేదా?
– నాకు ప్రభుత్వం న్యాయం చేస్తుందనుకుంటున్నా
– బహిరంగలేఖలో తెలంగాణ ఎక్సైజ్ అధికారి సోమిరెడ్డి ఆవేదన
హైదరాబాద్: కానిస్టేబుల్ బదిలీలల వ్యవహారంలో ఎక్సైజ్ కమిషనర్ చేతిలో అవమానానికి గురైన అధికారి సోమిరెడ్డి బహిరంగలేఖ రూపంలో ప్రజల ముందుకొచ్చారు. తన ప్రమేయం లేకుండా, తనతో సంప్రదించకుండా ఈ సమస్య ముగిసిందని జేఏసీ ఎలా ప్రకటిస్తుందని సోమిరెడ్డి ఆ లేఖలో ప్రశ్నించారు. ఉద్యోగులు, అధికారులకు ఆత్మగౌరవం ఉండకూడదా? అని ప్రశ్నించారు.
సోమిరెడ్డి లేఖ పూర్తి పాఠమిదీ..
ఎక్సైజ్ ఉన్నతాధికారులకు, మిత్రులకు, ఎక్సైజ్ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు!
కానిస్టేబుల్ బదిలీల సందర్భంగా జరిగిన సంఘటన లో నేను పొందిన అవమానం , ఆ సమస్య నా ఒక్కడిదిగా భావించలేదు. నా కన్నా ముందు కమీషనర్ గదికి వెళ్లి వచ్చినఅందరి అధికారులను కమీషనర్ చాలా ఘోరంగా , అవమానకరంగా దూషించారు. అదే క్రమంలో నన్ను కూడా దూషించడం జరిగింది.
నా వరకు ఇది నా ఒక్కడి సమస్య కానే కాదు. అందరు సిబ్బంది, అధికారులు, ఉన్నతాధికారులు బాధితులే , పని ఒత్తిడిలో నేను సోమిరెడ్డి ని ఒక మాట అన్నానని గౌరవ కమీషనర్ గారు పేర్కొనడం, దానికి విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పడం తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే. నాకన్నా ముందుగా దూషణలకు గురైన జిల్లా అధికారులు , డివిజన్ అధికారులు మనుషులు కారా? వారికి వ్యక్తిత్వం లేదా? వారి విషయంలో ఎటువంటి విచారం వ్యక్తం చేయలేదు.
కమీషనర్ గదిలో 10 నిమిషాల పాటు వెధవ అనే పదం పదే పదే అనడం , నాతో నేను వెధవ అని చెప్పించాలని చూడటం జరిగింది. నేను అందుకు ఒప్పుకోలేదు. ఆ రోజు పని ఒత్తిడిలో జరిగిందని కమీషనర్ చెప్పడం తాత్కాలికంగా సమస్య నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం మాత్రమే.
ఈ బదీలీ సమయంలో టెలీ కాన్ఫరెన్స్ జరిగే సమయంలో ఏమి పని ఒత్తిడి ఉందని అధికారులపై దూషణలకు దిగారు. సాధారణ సమయ వేళల్లో ఆయన ప్రవర్తన అలాగే ఉంటుందని కదా! మన మంతా బాధ పడింది. ఈ రోజు ఇది ఏదో నా ఒక్కడి సమస్యలా చేస్తున్నారు.
ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న సమస్య ఈ రోజు సమసి పోయిందని JAC నాయకులు నా ప్రమేయం లేకుండా నన్ను సంప్రదించకుండా ప్రకటన విడుదల చేయడం నన్ను చాలా బాధకు గురి చేసింది.
ఆరోజు సంఘటన జరిగిన సమయంలో ఉన్న ఒక్క జిల్లా / డివిజన్ అధికారి ES, AC, DC , JC & Adddl commissioner కూడా ఈ రోజు కమీషనర్ ను కలిసిన JAC లో లేరు.
ఎవరి కోసం ఎవరు ప్రకటన ఇచ్చారు. భాథితుల మీద నే మళ్లీ దాడి చేసేట్లుగా ఈ ప్రకటన ఉన్నది. సమస్య పక్కదారి పట్టి మేము జిల్లా / డివిజన్ స్థాయి ఉన్నతాధికారులము క్రింది స్థాయి సిబ్బందిని దూషించినట్లుగా చిత్రీకరించారు. ఇది సమస్యను జటిలం చేయడమే. ఈ ఒక్క ప్రకటనతో సమస్య సమసిపోలేదు.
గత సంవత్సరం నుండి కమీషనర్ ఆఫీసులో పని చేస్తున్న ప్రతి ఒక్కరు అక్కడ కమీషనర్ తో అవమానం పొందినవారే. ఇది అక్షర సత్యం. ఇందులో కులాలకు, మతాలకు తావు లేదు. అందరినీ తన మాటలతో , వ్యంగ్యంతో, దూషణలతో కమీషనర్ గారు మానసికంగా బాధ పెట్టారు. ఈ రోజు నేను ఆ మాటలను పడలేక “అలాంటి అనడం మంచిది కాదు “ అన్న ఒక్క పదంతో నా మీద మాటలతో విరుచుకు పడి పోయాడు. నా హృదయం ఎంత మనో వేదనకు గురైందో అక్కడ హస్పిటల్ లో నన్ను చూసిన వారికి నా మనో వ్యథ తో కూడిన బాధ తెలుస్తుంది .
నేను ఈ రోజు మీ ముందు బ్రతికి ఉన్నాను కాబట్టి ఈ మాటలు రాయగలుగుతున్నాను. లేదంటే కమీషనర్ ఏ తప్పు చేయలేదు అని నిరూపణ చేసేవారు. ఒక వ్యక్తికి ఆత్మాభిమానం మించిన జీవితం లేదని నమ్ముతున్నాను.
“మనిషిని మనిషి గా గౌరవించాలనేది కనీస సంస్కారం “ అధికారం, హోదా ఉన్నదని అహంకారంతో సంస్కారం కోల్పోయిన నాడు వారు ఎంతటి వారైనా ఉత్తములు కాలేరు, అన్న మహాత్ముని మాటలు విశ్వసిస్తాను.
“మానసిక పరివర్తనతో మాత్రమే మనుషులు ఉత్తమ వ్యక్తిత్వం అలవర్చుకోగలరు” అన్న బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని అనుసరించే వ్యక్తిని నేను.
30 సంవత్సరాల నుంచి ఎక్సైజ్ శాఖలో నేను నమ్మిన సిద్ధాంతం తో పని చేస్తున్నాను. ఎక్సైజ్ శాఖ ప్రతిష్టను పెంచే విధంగానే ప్రతి పనిలో పాటు పడ్డాను. క్రింది స్థాయి నుండి పై అధికారుల వరకు ప్రతి ఒక్కరి పట్ల మర్యాదగా ప్రవర్తించడం నాకున్న సంస్కారం.
నా ఆరోగ్యం కొంత బాగోలేదు. రెండు రోజుల్లో కుదుట పడినాక నేను త్వరలో ఉన్నతాధికారులను ,ప్రజాప్రతినిధులను కలిసి నా బాధ చెప్పుకోదలచాను. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. అందుకే ఈ రోజు వరకు నేను పత్రికలకు, మీడియాకు దూరంగా ఉన్నాను. నా సమస్యను రాజకీయం చేయదలచుకోలేదు.
నా ఆర్తిని, బాధను అర్థం చేసుకున్న మిత్రులు, అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు నాతో కలిసి వచ్చే వారికి స్వాగతం.
ఇట్లు
వి. సోమిరెడ్డి
డిప్యూటీ కమీషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ,
నిజామాబాద్ డివిజన్.