– ఆకివీడు రామాలయం కేసులో హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ కృష్ణంరాజు
– రామాలయంపై ఎటువంటి ప్రతికూల ఉత్తర్వులు ఇవ్వని న్యాయస్థానం
– ప్రభుత్వం, రఘురామ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం
– ప్రభుత్వం నుంచి అండర్‌టేకింగ్ కోరిన హైకోర్ట్
– చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపచేసేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి
– ఏ మతానికి చెందినదైనా అక్రమ నిర్మాణాలను పాలకులు సహించరాదు
విజయవాడ: ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లాయర్ అవతారమెత్తారు. తన నియోజకవర్గంలోని ఆకివీడు రామాలయ నిర్మాణానికి అనుమతి లేదంటూ వేసిన కేసు విచారణకు, స్వయంగా హాజరయిన రఘురామరాజు.. కోర్టు అనుమతితో స్వయంగా వాదించారు. ఆ సందర్భంగా ఆయన సెక్షన్లను ఉటంకిస్తూ వాదనలు వినిపించారు. ఆలయం, చర్చి, మసీదు నిర్మాణాల విషయంలో ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని రఘురామరాజు వాదించారు. ఆకివీడులో రామాలయం సమ్రక నిర్మాణమేనని, ప్రభుత్వ అనుమతులతో భక్తుల విరాళాలతో నిర్మాణం జరుగుతోందని కోర్టుకు వెల్లడించారు.
న్యాయచరిత్రలో ఒక డిప్యూటీ స్పీకర్ కోర్టుకు హాజరయి, స్వయంగా వాదనలు వినిపించడం ఇదే తొలిసారి. రఘురామకృష్ణరాజు కోర్టుకు హాజరయి వాదించడం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణరాజు ఆకివీడు రామాలయం అంశంపై బుధవారం హైకోర్టులో స్వయంగా హాజరై వాదనలు వినిపించటం చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై విజయవాడలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మాణం అనుమతులు లేకుండా జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన రఘురామ కృష్ణంరాజు స్వయంగా కోర్టుకు వెళ్లి తన వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా రామాలయం నిర్మాణం భక్తుల విరాళాలతో జరుగుతోందని, అన్ని చట్టబద్ధ అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు కొనసాగిస్తామని రఘురామ కోర్టుకు హామీ ఇచ్చారు.
చట్టపరమైన నిబంధనలను పూర్తిగా పాటిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో కోర్టు రామాలయంపై ఎటువంటి ప్రతికూల ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు, తన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. అలాగే చట్టపరమైన నిబంధనలు పాటిస్తామని ప్రభుత్వం నుంచి అండర్‌టేకింగ్ ఇవ్వాలని కోర్టు కోరగా, అందుకు ప్రభుత్వ న్యాయవాదులు అంగీకరించారని, దీంతో కేసు ముగించారన్నారు.
అలాగే ఆలయం, చర్చి, మసీదు అన్న తేడా లేకుండా అన్ని మతపరమైన కట్టడాలకు చట్టం సమానంగా వర్తించాలన్నారు. ఏ నిర్మాణానికైనా జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలని ఈ విషయంపై ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ఇతర అవసరాల పేరుతో అనుమతులు తీసుకుని మతపరమైన కట్టడాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు.
కల్వరి టెంపుల్ పేరిట తాడేపల్లిగూడెం, నంబూరు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అయితే అధికారులు ఇప్పటికే ఈ అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపచేసేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. ఆకివీడు రామాలయం అంశం గురించి మీడియా ద్వారా తెలిసిందని, అక్కడికి వెళ్లే సమయంలో తనపై అడ్డంకులు సృష్టించారన్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టులో స్వయంగా వాదనలు వినిపించాల్సి వచ్చిందన్నారు.
రాజ్యాంగాన్ని, చట్టాలను అందరూ పాటించకపోతే ప్రజల్లో తప్పు సందేశం వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ మతానికి చెందినదైనా అక్రమ నిర్మాణాలను పాలకులు సహించరాదన్నారు. రామాలయానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నప్పటికీ, నూతనంగా అన్ని అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణం కొనసాగుతుందని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వ వ్యతిరేక మీడియా తాను చేస్తున్న ఈ వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగిస్తాయని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి రాజ్యాంగ విలువలను కాపాడేందుకు తాను చేస్తున్న కృషి వల్ల ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరు ను, అడ్డుకునేందుకే సదరు మీడియా ఈ తరహా కుట్ర చేస్తోందని ఆరోపించారు.