– సామాజిక, సర్వోదయ తెలంగాణ కోసం పోరాటం చేస్తా
– అందరికీ అధికారం అనగానే నాకు కష్టాలు మొదలయ్యాయి
– సామాజిక న్యాయం కోసం కుల సంఘాలు ఏర్పాటు చేసింది మారోజు వీరన్నే
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
– జాగృతి పెట్టబోయే పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు
హైదరాబాద్: తెలంగాణలో అన్ని వర్గాలకు అధికారం దక్కాలన్నదే తన ధ్యేయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ సాధించుకొని 12 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటికీ కనీసం గ్రామ వార్డు పదవి కూడా పొందని కులాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి ఈ నెల 25 న ఏర్పాటు చేయబోతున్న పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించింది.
జాగృతి కార్యాలయంలో సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న సహచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు కవితను కలిసి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ మాత్రం తెచ్చుకోలేకపోయామన్నారు.
ఉద్యమ సమయంలోనే ఈ అంశాన్ని ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర ప్రస్తావించిన విషయాన్ని కవిత గుర్తు చేసుకున్నారు. భారత్ కు స్వాతంత్రం వచ్చిన సమయంలోనూ గాంధీ, అంబేడ్కర్ ముందు కూడా ఇదే సమస్య వచ్చిందని…భారత కుల వ్యవస్థలో ఈ అంశం నిరంతరం మన ముందుంటుందని జయశంకర్ సార్ అన్నారని చెప్పారు.
ముందు మనం భౌగోళిక తెలంగాణ సాధించుకొని ఆ తర్వాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని సూచించారన్నారు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ ఎన్నో కులాలు అధికారానికి దూరంగా ఉన్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు అధికారం కోసం జాగృతి నిరంతరం పోరాటం చేస్తుందని ఆమె చెప్పారు.
బీఆర్ఎస్ లో తాను ఎప్పుడైతే అన్ని వర్గాలకు అధికారం రావాలని కోరానో అప్పటి నుంచే తనకు కష్టాలు మొదలయ్యాయని కవిత చెప్పారు. కానీ ఆ కష్టాలు తన లక్ష్యం కోసం పనిచేసేందుకు తనలో కసి పెంచాయని చెప్పారు. ప్రతి కష్టాన్ని పాఠంగా నేర్చుకుంటూ సామాజిక తెలంగాణ కోసం ముందుకు కదులుతానని అన్నారు. ఈ నెల 25 న తాము నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని చెప్పారు. తెలంగాణ తత్వం, సామాజిక కోణం రంగరించి తమ పార్టీ ముందుకు వెళ్తుందని కవిత స్పష్టం చేశారు.
కులాలు బలంగా ఉన్నప్పుడే వారికి రాజకీయ అధికారం దక్కుతుందని బలంగా నమ్మిన వ్యక్తి మారోజు వీరన్న అని కవిత చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మాజీ మావోయిస్టులు లక్ష మంది వరకు పాల్గొన్నారని కవిత గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో వారంతా బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ బలంగా మారేందుకు చోదక శక్తి అయ్యారన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారెవరికీ కూడా మేలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కోసం ఏ విధంగా భూపోరాటం చేస్తున్నామో…మాజీ మావోయిస్టుల కోసం కూడా అదే విధంగా పోరాడుతామని కవిత హామీ ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ దారుణంగా వంచిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని నమ్మబలికి…ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదని మండిపడ్డారు. ఎన్నికల హామీలైన సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ స్కీం పునరుద్ధరణను గాలికి వదిలేసి కాంగ్రెస్ తన నైజాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. ఉద్యోగుల హెల్త్ స్కీం కేవలం కాగితాలకే పరిమితం చేశారని…రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.