– విద్యార్థులతో బలవంతంగా అండర్ టేకింగ్ లెటర్లు రాయించుకుంటున్న ఇంజినీరింగ్ కాలేజీలు.
– పేద విద్యార్థులకు చదువు దూరం చేసేందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కుట్రలు
– మూడు నెలల్లో ఫీజు కడతామని లెటర్లు
– లేకపోతే ఫలితాలు ఆపేయవచ్చని.. వచ్చే ఏడాది క్లాసులకు రానివ్వకుండా అడ్డుకోవచ్చని లేఖలు
– ఇప్పటికే ఫీజు చెల్లించలేక.. సర్టిఫికెట్లు చేతికి రాక 13 లక్షల మంది విద్యార్థుల ఇబ్బందులు
– రెడ్కో చైర్మన్ మాజీ వై.సతీష్ రెడ్డి
ఫీజు రీయింబర్స్ మెంట్ పై రేవంత్ సర్కారు చేతులెత్తేసి.. పేద విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటోందని బీఆర్ఎస్ నాయకులు, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో కాలేజీలన్నీ విద్యార్థుల నుండి ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. అలాగే.. విద్యార్థులతో బలవంతంగా సంతకాలు చేయించి అండర్ టేకింగ్ లెటర్లు రాయించుకొని తీసుకుంటున్నారని చెప్పారు. త్వరలో బీటెక్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు చెల్లించలేదన్నారు.
దీంతో పరీక్ష ఫీజు కట్టాలంటే… ముందుగా విద్యార్థులతో మూడు నెలల్లో ఫీజు చెల్లిస్తామని లెటర్లు రాయించుకుంటున్నాయన్నారు. ఒక వేల జులై నెలలోపు ఫీజు చెల్లించకపోతే క్లాసులకు హాజరు కాకుండా అడ్డుకోవచ్చని.. పరీక్ష ఫలితాలు కూడా ఆపేయవచ్చని.. దీనికి అంగీకరిస్తున్నట్టు.. విద్యార్థులతో సంతకాలు చేయించుకుంటున్నారని రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి చెప్పారు.
సర్కారు నిర్లక్ష్య వైఖరి వల్ల ఇప్పటికే చదువు పూర్తైన 13 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులే ఫీజు చెల్లించుకోవాలని కోర్టు చెప్పడంతో.. ఇప్పుడు చదువుకుంటున్న మరో 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలు కూడా అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే బీటెక్ లో అడ్మీషన్లు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. రేవంత్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అవుతోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఫీజురీయింబర్స్ మెంట్ పథకాన్ని.. మంచి పథకమని అని కేసీఆర్ గారు కొనసాగించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని పూర్తిగా రద్దు చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఫీజు కడితేనే పరీక్షలు రాయనిస్తామని పాత విద్యార్థులను.. ఫీజు పూర్తిగా కడితేనే బీటెక్ లో అడ్మీషన్ ఇస్తామని కొత్త విద్యార్థులను.. కాలేజీలు వేధిస్తున్నాయని సతీష్ రెడ్డి అన్నారు. కేవలం రేవంత్ రెడ్డి చేతగానితనం వల్లే ఇదంతా జరుగుతోందని ఆయన మండిపడ్డారు. దురుద్దేశంతోనే కోర్టులో సరైన వాదనలు వినిపించలేదని.. అందుకే విద్యార్ధులే ఫీజు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పిందన్నారు.
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని.. పేద విద్యార్థుల బతుకులు ఆగం కాకుండా కాపాడాలని సతీష్ రెడ్డి కోరారు. లేకుంటే.. విద్యార్థుల పక్షాన తాము రోడ్డెక్కి.. సర్కారు దుష్ట బుద్ధిని ఎండగడతామని హెచ్చరించారు.