– జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు మరింత బలం
– రేవంత్ పోవాలి..కేసీఆర్ రావాలి..రాష్ట్ర వ్యాప్తంగా ఇదే నినాదం మార్మోగుతున్నది
– తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి
– డీలిమిటేషన్ పేరుతో మహిళా రిజర్వేషన్ల బిల్లును అటకెక్కించి.. బీజేపీ, కాంగ్రెస్ మహిళలకు తీరని ద్రోహం చేశాయి
– బడే భాయ్ కి భయపడే ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించలేదు
– కార్యకర్తలేమో కొట్లాడుకోవాలి.. మీరేమో విందులు చేసుకోవాలా?
– జగిత్యాల మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు
జగిత్యాల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు జగిత్యాలలో పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ నెల 20న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో, ఆ సభ ఏర్పాట్లను వారు పరిశీలించారు.
అనంతరం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాజకీయాల్లో ఎంతో విలువలతో కూడిన నాయకుడు పెద్దలు జీవన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన చేరిక కరీంనగర్ జిల్లాకే కాదు, యావత్ ఉత్తర తెలంగాణకు, బీఆర్ఎస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుంది.
రాష్ట్రంలో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసింది.. ‘రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి’ అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అనడానికి జీవన్ రెడ్డి చేరిక ఒక సజీవ సాక్ష్యం. నిన్న పార్లమెంటులో జరిగిన రెండు పరిణామాలు తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయి.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే. బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సింది పోయి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గం. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతున్నాయి.
కేసీఆర్ నాయకత్వంలో సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తారా?. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, లోక్సభ, రాజ్యసభలో బిల్లులు పాసై, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఏర్పడింది. కనీస అవగాహన లేకుండా తెలంగాణపై, ఉద్యమంపై బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారు.
ఒక ఎంపీ తప్పు మాట్లాడితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థించడం దారుణం. బీజేపీ తక్షణమే తేజస్వి వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదంటే తెలంగాణ మనోభావాలను దెబ్బతీసిన పార్టీగా బీజేపీ మిగిలిపోతుంది. నిన్నటి లోక్సభ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించింది. మన ఎంపీలు సభలో ఉండి ఉంటే తేజస్వికి తెలంగాణ బిడ్డల తరఫున దీటైన, మూతి పగిలే సమాధానం చెప్పేవాళ్లం.
మన రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా పెదవులు మూసుకొని మౌనంగా కూర్చున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై లేదా? అదే రాజ్యసభలో ఉన్న ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్రాజెక్టులపై అవాకులు చవాకులు పేలిన కేంద్ర జల వనరుల మంత్రికి దీటైన సమాధానం ఇచ్చారు. స్పీకర్ను కలిసి ఆధారాలు చూపించి రికార్డులను సైతం సవరించారు.
రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య ఉన్న బడే భాయ్ ఛోటే భాయ్ బంధం మరోసారి బట్టబయలైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడించాలని బీజేపీ పిలుపునిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో బీజేపీ కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి భోజనానికి వెళ్లాడు. కార్యకర్తలేమో కొట్లాడుకోవాలి.. మీరేమో విందులు చేసుకోవాలా?
డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానం’ ఏంటో ఇవాళ స్పష్టమైంది. అది హైబ్రిడ్ కాదు క్రాస్ బ్రీడ్ అని అర్థమైంది. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అర్థమవుతుందో లేదో. బడే భాయ్ కి భయపడే, తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కనీసం స్పందించలేదు. మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంటులో కొట్లాడినట్లు నాటకాలు ఆడుతూ మహిళలకు తీరని ద్రోహం చేశాయి.
మహిళా బిల్లుకు నిజంగా చట్టబద్ధత కల్పించాలనుకుంటే దాన్ని డీలిమిటేషన్ ప్రక్రియతో ఎందుకు ముడిపెట్టారు? బీజేపీకి పార్లమెంటులో 2/3 మెజార్టీ లేదని, 68 సీట్లు తక్కువ ఉన్నాయని ఆ పార్టీకి స్పష్టంగా తెలుసు. కేవలం రాజకీయాల కోసమే, ఎటువంటి చిత్తశుద్ధి లేకుండానే మహిళా బిల్లును తీసుకొచ్చారు.
మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ చిత్తశుద్ధి ఏనాడో నిరూపితమైంది. కేసీఆర్ నాయకత్వంలో మొదటి తెలంగాణ శాసనసభలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఘనత మా పార్టీదే.