(ఇంద్రాణి)
ప్రధానమంత్రికి సీపీఎం సీనియర్ నేత బృందాకారత్ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె ప్రస్తావించిన విషయాలలో ప్రధానమైనది: 2023లో చట్టమైన మహిళా రిజర్వేషన్లను 2024 ఎన్నికలలో ఎందుకు అమలు చేయలేదు అని. మహిళా రిజర్వేషన్ చట్టం చేసినప్పుడే, తదుపరి జనగణన మరియు నియోజకవర్గాల పునర్విభజన తరువాతే అది అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.
అందుకే ఇప్పుడు జనగణనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని బీజేపీ సంకల్పిస్తే, ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని బీజేపీ వాదన.అయితే, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ చట్టసవరణను తీసుకొచ్చినప్పుడు, దానిని డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టకుండా, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో సంబంధం లేకుండా అమలు చేయాలనే నిబంధనతో తీసుకురావచ్చనేది బృందాకారత్ వాదన.
విశదీకరించాలంటే.. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగినా జరగకపోయినా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలనే సవరణ పెట్టి ఉంటే, మహిళా రిజర్వేషన్ చట్టసవరణ బిల్లు ఆమోదముద్ర పొంది ఉండేది. నిజంగా కేంద్రం మహిళా రిజర్వేషన్లను 2029 ఎన్నికలలోనే అమలు చేయదలచుకుంటే, కేంద్రం ముందు దారులు లేకపోలేదు అని బృందాకారత్ గుర్తుచేస్తున్నారు.
అందుకు ఉదాహరణగా ఆమె నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్లను, మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన విధానం గురించి ప్రస్తావించారు. కార్మిక కోడ్లు కార్మికుల కంటే యజమానులకు ఎక్కువగా లాభదాయకంగా ఉన్నాయని ఎంతమంది వ్యతిరేకించినా, కేంద్రం చేయదలచుకున్నది చేసింది. మహిళా రిజర్వేషన్ అనేది పార్లమెంటు సభ్యులు పెరిగితేనే అనే కాన్సెప్ట్ వెనుక ప్రభుత్వం ఉద్దేశ్యం స్పష్టం.
ఎప్పటి నుండో పురుషులు అనుభవిస్తున్న రాజ్యాధికారం తగ్గకుండా మహిళలు చట్టసభలకు రావాలంటే నియోజకవర్గాలు పెరగాలి. “ప్రస్తుతం ఉన్న పార్లమెంటు సీట్లలోనే మహిళలకు రిజర్వేషన్ ఎందుకు కల్పించరు?” అని ఎవరైనా అడిగితే ఎవరి దగ్గరా సమాధానం ఉండదు.ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ఒక్కటే మహిళలకు అన్యాయం చేసిందనుకుంటే పొరపాటు. మహిళా రిజర్వేషన్ పైన మొన్న ఎన్డీయే ఆడిన ఆటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే వారు కూడా ఆడేవారు.
షాబానో కేసులో సుప్రీంకోర్టు ముస్లిం మహిళలు కూడా సెక్షన్ 125 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం భరణానికి అర్హులని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ముస్లిం మతపెద్దలు తీవ్రంగా నిరసించారు. వారు నిరసన మాత్రమే తెలపగలిగారు, కానీ ఆనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు అమలునే ప్రశ్నార్థకం చేస్తూ ముస్లిం మహిళల విడాకుల చట్టాన్ని తీసుకువచ్చింది.
ఆ చట్టం ప్రకారం విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ కేవలం ఇద్దత్ కాలం, అంటే మూడు నెలల కాలం వరకే భరణానికి అర్హురాలు. ఇద్దత్ కాలం వరకు భరణం అనేది అంతకు ముందే ముస్లిం మతాచారాలలో ఏదో ఒక రూపంలో ఉన్నది. ఇద్దత్ కాలం తరువాత కూడా భరణం కావాలని ముస్లిం మహిళ భావిస్తే ఆమె వక్ఫ్ బోర్డును ఆశ్రయించాలి.
అంటే ఆ చట్టం ద్వారా విడాకులు తీసుకున్న మహిళ భవిష్యత్తును మళ్లీ మతపెద్దల చేతుల్లోనే పెట్టారు. ఆ తరువాత 2001లో డేనియల్ లతీఫ్ కేసులో ఇద్దత్ కాలంలో మాత్రమే ఇచ్చే భరణాన్ని సుప్రీం కోర్టు ఆమోదిస్తూనే.. ఆ ఇచ్చే భరణం విడాకులు తీసుకున్న మహిళ జీవిత కాలం గౌరవంగా జీవించడానికి సరిపోయేంత ఉండాలని నిర్దేశించింది.
ఒక మహిళ జీవిత కాలాన్ని, గౌరవంగా బతకడాన్ని ఎలా నిర్ణయిస్తారో అంతుపట్టని విషయం. ఇలాంటి విషయాలను గమనిస్తే, ఎవరైనా మహిళలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు అడ్డుపెట్టుకోవడం మినహాయించి, మహిళల ప్రయోజనాలు పట్టించుకున్న వారు లేరు అని అర్థమవుతుంది.మహిళా రిజర్వేషన్ పట్ల బీజేపీ చిత్తశుద్ధిని తెలిపే మరొక విషయాన్ని బృందాకారత్ ప్రస్తావించారు.
“నారీశక్తి” అంటూ పిలుపునిస్తున్న ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ శాసనసభ్యుల్లో మహిళల శాతం కేవలం 7 మాత్రమే. ఆ విషయం మా ఇద్దరికీ తెలియదు అని మోదీ-అమిత్ షాల ద్వయం ప్రకటిస్తే ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. ఆరోజు రాజీవ్ గాంధీ ముస్లిం ఓటు బ్యాంక్ కోసం సుప్రీంకోర్టు తీర్పునే కొట్టి పారేస్తూ చట్టం చేస్తే, నేడు ఎన్డీయే ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని చర్చకు తీసుకొస్తున్నది.
బ్యాంకులకు ఉపయోగించే కార్డులకు యాడ్-ఆన్ కార్డులను ఇచ్చినట్లు, తమ కుర్చీలను వదిలే అవసరం రాకుండా అదనంగా సీట్లను జత చేసి మహిళలకు కేటాయిస్తారు మన శాసనకర్తలు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఓటు హక్కు పొందిన భారత మహిళ చట్టసభలకు వెళ్లాలంటే ఇన్ని అడ్డంకులు దాటుకుని వెళ్లాలి.
ఇప్పటి నుండి రిజర్వేషన్ అమల్లోకి వచ్చినా, రాజకీయంగా ప్రముఖ స్థానంలో ఉన్న కుటుంబ మహిళలకే ఆ రిజర్వుడ్ సీట్లో పోటీ చేసే అవకాశం వస్తుంది. వారింటి మహిళ అయినా సరే, తమ సీటు ఇవ్వడానికి పురుషాధిక్య సమాజం ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలో ముప్పై శాతం మహిళలకు చోటు కల్పిస్తే, ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన బిల్లుల పైన మహిళలకు నిర్ణయాధికారం లభిస్తుంది.
కానీ ఆ దిశగా ఆలోచన చేసేవారే లేరు.మహిళా రిజర్వేషన్ గురించి గొప్పగా చెబుతుంటే శ్యామ్ బెనెగల్ 1977లో తీసిన “కిస్సా కుర్సీ కా” అనే సినిమా గుర్తుకు వస్తున్నది. అదొక కుర్చీ కథ. కుర్చీ అంటే అధికార పీఠం. ఆ కుర్చీ కోసం నాయకులు ఆడే ఆటలో ప్రజలు ఎలాగైతే మౌన ప్రేక్షకుల మాదిరిగా మిగిలిపోయారో, భారత రాజకీయాలలో కుర్చీ అనేది పురుషుల హక్కు అన్నట్లుగా మహిళా సమాజం మూగబోయి చూస్తున్నది.
అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి 27 సంవత్సరాలు పడితే, దాని అమలు ఒక ప్రహసనంగా మారింది. ఆ సినిమా రాజకీయంగా తమకు ఇబ్బందని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒరిజినల్ ప్రింట్లను కూడా తగలబెట్టింది అనే ప్రచారం జరిగింది. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో చింపివేసిన సంఘటనలు జరిగాయి.మహిళకు ఓటు హక్కును ప్రసాదించిన రాజ్యాంగం కల్పించవలసిన సమానత్వాన్ని, రాజకీయపార్టీలు ఇచ్చే అవసరం పడటమే ఇక్కడ వచ్చిన సమస్య.
కుర్చీని వదులుకోవడానికి పురుష నాయకత్వం ఇష్టపడకపోవడమే మహిళా చట్టసవరణను డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టడానికి గల ప్రధాన కారణం. కనీసం ఆ సినిమాలో మూగబోయిన ప్రజలకు ఎవరి మీద తిరగబడాలో తెలుసు. కానీ మహిళా రిజర్వేషన్ అమలు కోసం మహిళలు వ్యవస్థల మీద తిరగబడాలో, లేదా తమ కుటుంబసభ్యుల మీదే తిరగబడాలో తేల్చుకోలేని అంశం. ఇన్ని పాయింట్లతో ప్రధానిని నిలదీసిన బృందాకారత్, సొంత పార్టీలో మహిళలకు దక్కిన ప్రాధాన్యత ఎంతో వివరించలేని పరిస్థితి.!