– కూరగాయలు, మిల్లెట్లు, పప్పుధాన్యాలు మరియు నూనెగింజల సాగు పెరిగేలా చర్యలు తీసుకోవాలి
– ఎల్.ని.నో ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ముందస్తు సాగు ప్రణాళికపై మంత్రి తుమ్మల సమీక్ష
– ఎరువుల ధరలను కేంద్రం రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది
– మంత్రి తుమ్మల
హైదరాబాద్: వచ్చే వర్షాకాలంలో ఎల్.ని.నో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉంటుదన్న వాతావరణశాఖ నిపుణుల అంచనాలతో… ముందస్తు సాగు ప్రణాళికలపై మంత్రి తుమ్మల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సాధారణంగా రాష్ట్రంలో దక్షిణా తెలంగాణ కన్నా ఉత్తర తెలంగాణాలో అధిక వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటివరకు ఉన్న వివరాల ప్రకారం ఎల్.ని.నో ప్రభావంతో వచ్చే వర్షాకాలంలో ఉత్తర తెలంగాణాలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దక్షిణ తెలంగాణ అతి తక్కువ వర్షాపాతం నమోదు అవుతుందని అంచనాల వేస్తున్నట్టు వాతావారణ నిపుణులు మంత్రికి తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మే 15 కల్లా వాతావరణ శాఖ నుండి ఖచ్చితమైన నివేదిక తెప్పించుకొని, జిల్లా వారిగా అక్కడి వాతావారణం మరియు వర్షపాతాల అంచనాల ఆధారంగా రైతులు ఏ ఏ పంటలు వేయాలో తెలిపే విధంగా సమగ్ర పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో కూరగాయల సాగు, పప్పుధాన్యాలు, మిల్లెట్లు మరియు నూనే గింజల వంటి పంటల సాగు విస్తీర్ణాలు గణనీయంగా తగ్గిపోయాయని మంత్రి అన్నారు. 2013-14 సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు సాగు వివరాలను గమనిస్తే… వరి సాగు విస్తీర్ణం 131.7 శాతం పెరగింది.
పప్పు ధాన్యాల సాగులో ముఖ్యంగా పెసళ్లు 75.2, మినుములు 71.5 శాతాలకు పడిపోయి మొత్తంగా పప్పుధాన్యాల సాగు 39 శాతం పడిపోయింది. అదేవిధంగా ఉలవలు 71.6, సజ్జలు 95, బొబ్బర్లు 72.4, నువ్వులు 94.9, పొద్దుతిరుగుడు 98.5, ఆముదం 98.5 మరియు వేరుశనగ సాగు 51శాతానికి పడిపోయింది అని మంత్రి వివరించారు.
రాష్ట్రంలో అనుకూలమైన సాగు పరిస్థితులు ఉన్నప్పటికి వీటి సాగు విస్తీర్ణం తగ్గటం వాంచనీయం కాదని పేర్కొన్నారు. మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వీటి సాగును పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి తెలిపారు. మన అవసరాల కోసం పక్క రాష్ట్రాలపై ఆధారపడకుండా, మన రాష్ట్రంలోని కూరగాయలు, పప్పుధాన్యాలు, మిల్లెట్లు మరియు నూనె గింజల సాగును పెంచే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయశాఖ అధికారులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులను మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో రైతులు ఒకే రకమైన పంటను ఎక్కువగా వేయడంతో భూమి సారం తగ్గడంతో పాటు, యూరియా వాడకం కూడా పెరుగుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో కాంప్లెక్స్ ఎరువుల ధర అధికంగా ఉండటం కూడా ఒక కారణమని మంత్రి అభిప్రాయపడ్డారు.
కాంప్లెక్స్ ఎరువుల కన్నా.. యూరియా ధరలు తక్కువకు దొరకడంతో రైతులు కాంప్లెక్స్ ఎరువులకు బదులు యూరియాను అధికంగా వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఎరువులు మరియు యూరియా ధరలు అన్నింటిని రేషనలైజ్ చేయాలని కేంద్రాన్ని ఎన్నో సార్లు కోరినప్పటికి కేంద్రం పట్టించుకోవట్లేదని అన్నారు.
నిన్న జరిగిన సమావేశంలో చర్చించిన విధంగా సన్న రకాల ఎంపికలో తీసుకోవాల్సిన ప్రమాణాలపై ఈ రోజు నిర్వహించిన సమావేశంలో సివిల్ సప్లై అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో సివిల్ సప్లై ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలను సీజన్ల వారిగా మంత్రిగారికి ప్రజంటేషన్ ద్వారా తెలియచేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇప్పటిదాకా సేకరించిన ధాన్యంతో పోల్చుతూ.. వచ్చే సీజన్ లో ఎంత ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుందో అంచనా వేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ అంచనాల ద్వారా ప్రభుత్వం నోటిఫై చేసిన సన్న రకాలలో రైతుల ఆదరణ ఎక్కువగా ఉన్న విత్తనాలను మరియు మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్న రకాల విత్తనాలను రైతులకు అందించాలని అన్నారు.
ఒకవేళ రైతు బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటే మద్ధతు ధర కంటే ఎక్కువ ధర లభించేలా రకాలను ఎంపిక చేయాలని సూచించారు. అందుకోసం రాష్ట్రస్థాయిలో మిల్లర్లతో, FCI అధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. రైతులను దృష్టిలో పెట్టుకొని రకాల ఎంపిక ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సీడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య, IMD డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.