హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు గారి జన్మదిన వేడుకలు ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ప్రజా సేవే లక్ష్యంగా సాగుతున్న ఆయన ప్రస్థానంలో భాగంగా, ఈ పుట్టినరోజును పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు మరియు పార్టీ శ్రేణుల మధ్య సంబరాలు మిన్నంటాయి.
సికింద్రాబాద్లోని తార్నాక ప్రాంతంలోని వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం పార్టీ శ్రేణుల సమన్వయంతో విజయవంతంగా జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు మరియు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సామాజిక బాధ్యతతో చేపట్టిన ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొనగా, అందరూ పార్టీ రథసారధికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నినదించారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎన్.గౌతం రావు , బిజెపి రాష్ట్ర కార్యదర్శులు ఓ.శ్రీనివాస్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ , పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులు, బిజెపి సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి , ఇతర నాయకులు, పార్టీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న రాంచందర్ రావు , తన జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి, సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకు మరియు వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.