– డబుల్ ఇంజన్ సర్కారు సాధన కోసం పోరాడదాం
– తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా పదాధికారుల భేటీ
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నూతన కార్యవర్గ సమావేశం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు నేతృత్వంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ అధ్యక్షతన సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి 2గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.
ఈ కార్యక్రమం లో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ నూతన పదాధికారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులకు దశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కాంతి కిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు సారధ్యంలో మనందరం భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని.. చిత్తశుద్ధి తో పనిచేయాలని.. శ్రేణులకు పిలుపునిచ్చారు.
నాయకులందరూ చట్టసభల్లోకి వెళ్లే విధంగా వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకుంటూ.. పార్టీ అభివృద్ధికి దోహదపడాలని తెలిపారు. రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో చేవెళ్లలో ఇచ్చిన ఎస్సీ డిక్లరేషన్ అమలయ్యే వరకు అవిశ్రాంత పోరారాటికి సిద్ధంగా ఉండాలని నాయకులకు పిలుపునిచ్చారు. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకుండా, సీనియర్ నాయకులతో ఐక్యమత్యంగా ఉండి పార్టీ అభివృద్ధికి నిరంతర కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతన రాష్ట్ర పదాధికారులు రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ ని ఘనంగా సత్కరించారు.