– జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆవేదన
హైదరాబాద్: భారత ప్రజానీకం తమ సాంస్కృతిక వారసత్వం విలువ గుర్తించలేని స్థితిలో ఉన్నారని పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసి రిటైరైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో సమాలోచన ఆధ్వర్యంలో జరిగిన ‘భావదాస్యమూలాలు’ గ్రంథావిష్కరణ సభలో ముఖ్య అతిథిగా, ఆవిష్కర్తగా, ప్రధాన వక్తగా ఆయన పాల్గొంటూ ఆ స్థితిలో మార్పు తీసుకొని రావడానికి డా.బొమ్మరాజు సారంగపాణి రచించిన ఈ ‘భావ దాస్య మూలాలు’ వంటి గ్రంథాలు ఉపయోగపడ గలవని ఆశాభావం వ్యక్తం చేశారు.
జేమ్స్ మిల్, టి బి మెకాలే వంటివారు భారతదేశం ఉత్కృష్టతను తెలిసినవారు ఐనప్పటికీ మనల్ని దారితప్పి ఉంచడానికి బుద్ధి పూర్వకంగా అబద్ధాలతో, తప్పుల తడకలతో నిండిన చరిత్ర పాఠాలను మనతో చదివించారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా శ్రోతలకు సులభంగా అర్థం కాగల అనేక ఉదాహరణలు నిచ్చారు.
తొలుత సభా ప్రారంభంలో ప్రముఖ రచయిత, `జాగృతి’ వారపత్రిక మాజీ సంపాదకులు డా.వడ్డి విజయసారథి మాట్లాడుతూ మనదేశ చరిత్రను అధ్యయనం చేయగోరే వారికి అందుబాటులో లేకుండా పోయిన కాలఖండాలకు సంబంధించిన చరిత్రలను సేకరించి అనువాద రచనల ద్వారా కాని, స్వతంత్ర రచనల ద్వారా కాని పాఠకులకు అందజేసే పనిని నవయుగ భారతి చేస్తున్నదని తెలియజేశారు.
ఈ సందర్భంగా శరద్ హెబాల్కర్ రచించిన ‘హిందూదేశంపై మహమ్మదీయ దండయాత్రలకు అవిస్మరణీయ ప్రతిఘటనా పరంపర’, డా. సారంగపాణి రచించిన ‘భారతదేశంలో విదేశీ ముస్లిం పాలన పర్యవసానాలు’, ‘ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడీ’ , వి.వి. సుబ్రహ్మణ్యం రచించిన ‘విద్యారణ్య విజయం’, స్వర్గీయ పులిచెర్ల సుబ్బారావు రచించిన ‘తెల్లచీకట్లు క్రమ్మినవేళ’, వినాయక దామోదర్ సావర్కర్ రచించిన ‘భారతదేశ చరిత్రలో ఆరు స్వర్ణ పత్రములు’ మొదలుగా గల గ్రంథాలను ఆయన ఉదహరించారు.
రచయిత డా.బొమ్మరాజు సారంగపాణిని పరిచయం చేస్తూ, ‘గంగలో విషనాగులు’ (రాజీవ్ మల్హోత్రా గ్రంథానికి సంక్షిప్త రూపం), ‘బంగ్లాదేశ్ హిందువుల నరమేధం’, ‘ఆర్థికరంగము- దీనదయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు’ తదితర గ్రంథాలను ప్రస్తావించారు. శ్రీమతి ఎస్తేర్ ధనరాజ్ ఇటీవల ప్రచురించిన ఉంబాప్టిజడ్ గ్రంధాన్ని వెలువరించటం లోనూ సారంగపాణి గారి సహకారం ఉందని తెలియజెప్పారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసింహారెడ్డి, గ్రంథ రచయిత బొమ్మరాజు సారంగపాణి, నవయుగ భారతి కార్యదర్శి నేతి క్షీరసాగర్ లను ఈ సందర్భంగా సభా నిర్వాహకులు సత్కరించారు. కె రామచంద్ర సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడ నగరం నుండే గాక గుంటూరు, మచిలీపట్నం వంటి సమీప పట్టణాలనుండికూడా మేధావులు అనేకులు పాల్గొన్నారు.