– ఎక్సై్పరీ మందులెందుకు కొనుగోలు చేశారు?
– ఈ టెండర్ ఎప్పుడు ఇచ్చారు?
– టెక్నికల్ బిడ్ వివరాలు ఏమిటి?
– ఫైనాన్షియల్ బిడ్ ఏమిటి?
– ఏ కంపెనీలు పాల్గొన్నాయి?
– చివరికి ఏ కంపెనీకి టెండర్ ఇచ్చారు?
– సరఫరా చేసిన మందుల మాన్యుఫ్యాక్చరింగ్ డేట్ మరియు ఎక్స్పైరీ డేట్ ఏమిటి?
– టెండర్లలో రహస్యమెందుకు?
– ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల్లేవు
– మరి ఈ ఎక్సై్పరీ మందులెలా వచ్చాయి?
– దీనికి సీఎం, ఆరోగ్యశాఖమంత్రి జవాబు చెప్పాల్సిందే
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్
హైదరాబాద్: ఈరోజు రాష్ట్రంలో విద్యా మరియు వైద్య రంగాల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నాయి. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సుమారు రూ.150 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి.
ఒకవేళ ఈ ఆరోపణ నిజమైతే, ఇందులో ఎవరు బాధ్యులు, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్న విషయాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇది అబద్ధ ప్రచారం అయితే, అదే విధంగా ప్రభుత్వం పూర్తి వివరాలతో ప్రజలకు వివరణ ఇవ్వాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ విషయంపై తక్షణం స్పందించి స్పష్టత ఇవ్వాలి.
మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. పేద, బడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులే ఒక్కటే ఆశ్రయం అయినప్పటికీ, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. డాక్టర్ కూర్చుని పేషెంట్లను పరిశీలించడానికి సరైన గది కూడా లేకుండా కారిడార్లలోనే చికిత్స జరుగుతున్న పరిస్థితి ఉంది. స్ట్రెచర్ మీదనే ప్రిస్క్రిప్షన్లు రాయాల్సిన పరిస్థితి ఉంది. మందులు లేవు, గ్లౌజులు లేవు, సర్జికల్ మెటీరియల్ కొరత ఉంది, ఎక్విప్మెంట్స్ ఉన్నా వాటిని నిర్వహించే టెక్నీషియన్స్ లేరు. కొంతమంది పేషెంట్లు డెలివరీకి కూడా బయట నుంచి సామగ్రి కొనుక్కొని రావాల్సిన పరిస్థితి నేను ప్రత్యక్షంగా చూశాను.
ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రులకు అవసరమైన నిధులు హెచ్డిఎస్, ఆరోగ్యశ్రీ మరియు ఇతర వనరుల ద్వారా రావాల్సి ఉన్నప్పటికీ, ఆ నిధులు సమయానికి అందడం లేదు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి జిల్లా ఆసుపత్రులు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు విస్తృతమైన వైద్య వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ నిర్వహణలో ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల టెండర్లు జరుగుతున్నాయి.
మందుల కొనుగోలు విధానం కూడా స్పష్టంగా ఉంది. ఐదు లక్షల లోపు కొనుగోళ్లు లిమిటెడ్ టెండర్ ద్వారా జరుగుతాయి, ఐదు లక్షల పైబడి ఉంటే ఓపెన్ టెండర్ ద్వారా కొనుగోలు చేయాలి. ఇంకా పెద్ద స్థాయిలో కొనుగోళ్లు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా క్వార్టర్ వారీగా జరుగుతాయి. ప్రతి ఆసుపత్రిలో ఓపీ, ఐపీ, ఆపరేషన్లు, కేసుల సంఖ్య ఆధారంగా అవసరాన్ని అంచనా వేసి మందులు కొనుగోలు చేయాలి.
అయితే ఇప్పుడు వచ్చిన ఆరోపణ ప్రకారం, ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్న మందులను భారీగా కొనుగోలు చేసి వాటిని ఉపయోగించకుండా వదిలేసి, తర్వాత వాటిని బయోమెడికల్ వేస్ట్‌గా డిస్పోజ్ చేయడానికి మళ్లీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెబుతున్నారు. ఇది నిజమైతే ఇది చాలా తీవ్రమైన విషయం.
బయోమెడికల్ వేస్ట్ అనేది సాధారణ చెత్త కాదు. ఇందులో సిరంజీలు, కెమికల్స్, ఇంజెక్షన్లు, మెడిసిన్స్ వంటి ప్రమాదకర పదార్థాలు ఉంటాయి. వీటిని సరైన విధంగా నిర్వహించకపోతే భూమి, గాలి, నీటి కాలుష్యం పెరిగి భవిష్యత్ తరాలకు కూడా ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి దీని నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్నది మరియు అత్యంత జాగ్రత్తతో చేయాల్సిన పని.
అయితే ఈ విషయంలో ఈ టెండర్ ఎప్పుడు ఇచ్చారు? టెక్నికల్ బిడ్ వివరాలు ఏమిటి? ఫైనాన్షియల్ బిడ్ ఏమిటి? ఏ కంపెనీలు పాల్గొన్నాయి? చివరికి ఏ కంపెనీకి టెండర్ ఇచ్చారు? వారు సరఫరా చేసిన మందుల మాన్యుఫ్యాక్చరింగ్ డేట్ మరియు ఎక్స్పైరీ డేట్ ఏమిటి? అన్న వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలి. ఈ వివరాలు చెబితే నిజం స్వయంగా బయటపడుతుంది.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గత మూడు సంవత్సరాలుగా ఆసుపత్రుల్లో మందులు లేవని మేము అసెంబ్లీలో అనేకసార్లు చెప్పాం. అయితే ఇప్పుడు ఎక్స్పైరీ అయిన మందులు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఆ మందులు ముందే ఎందుకు ఉపయోగించలేదు? ఎందుకు పంపిణీ చేయలేదు అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.
ఈ వ్యవహారం చిన్న స్థాయి తప్పిదం కాదు. ఇది పైస్థాయి నుంచి జరిగిన అవినీతి అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇందులో అధికారులు, రాజకీయ నాయకులు లేదా ఇద్దరూ కలిసే బాధ్యులా అన్నది ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. చిన్నస్థాయి ఉద్యోగులను బలి పశువులుగా చేసి అసలు బాధ్యులను తప్పించకూడదు.
ప్రజలకు కనీస వైద్యం కూడా అందని పరిస్థితిలో వందల కోట్ల రూపాయలు వృథా కావడం చాలా దురదృష్టకరం. విద్య మరియు వైద్యం ఉచితంగా అందించాలనే చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం ప్రజలకు తీవ్ర అన్యాయం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి వివరాలతో స్పష్టత ఇవ్వాలి. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజలే దీనిపై తీర్పు చెబుతారు.