– పాలసీ జారీ చేశాక సాకులు చెల్లవ్
మెడిక్లెయిమ్ పాలసీ తీసుకున్న వారు ముందస్తు వ్యాధుల వివరాలు చెప్పలేదనే నెపంతో క్లెయిమ్‌ను తిరస్కరించడం ఇకపై కుదరదు. దీనిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
సుప్రీంకోర్టు తీర్పు సారాంశం
ముందస్తు వ్యాధులు: పాలసీ తీసుకునే సమయానికి తనకు తెలిసిన ఆరోగ్య సమస్యలను మాత్రమే ప్రతిపాదకుడు (Proposer) వెల్లడించగలడు.
తిరస్కరణ కుదరదు: ఒకసారి ఇన్సూరెన్స్ పాలసీ జారీ చేసిన తర్వాత, పాలసీదారునికి ముందే వ్యాధులు ఉన్నాయని సాకు చెప్పి క్లెయిమ్‌ను తిరస్కరించడానికి వీల్లేదు.
లక్ష్యం: అకస్మాత్తుగా అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరాల్సి వస్తే ఆర్థిక రక్షణ కోసమే ఎవరైనా పాలసీ తీసుకుంటారని కోర్టు చెప్పింది
ప్రజలకు అర్థమయ్యే పాయింట్లు
పూర్తి వివరాలు: మీకు తెలిసిన ఆరోగ్య సమస్యల గురించి బీమా సంస్థకు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. అయితే, మీకు తెలియని లేదా అప్పుడే బయటపడిన సమస్యలను దాచారని కంపెనీ అనకూడదు.
కోర్టు అండ: బీమా సంస్థ క్లెయిమ్ ఇవ్వనప్పుడు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లేదా ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.
నిరూపణ బాధ్యత: పాలసీదారుడు కావాలనే సమాచారాన్ని దాచాడని నిరూపించాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీపైనే ఉంటుంది.
అడ్వకేట్ల కోసం (Legal Insight)
కేసు పేరు: మన్మోహన్ నందా వర్సెస్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ (2021).
ప్రధానాంశం: ‘Uberrimae Fidei’ (అత్యంత విశ్వాసం) అనే సూత్రం ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. పాలసీ జారీ చేసే ముందే కంపెనీ తగిన పరీక్షలు చేయాలి. పాలసీ జారీ అయ్యాక “Pre-existing disease” పేరుతో క్లెయిమ్ ఆపడం చెల్లదు.
– ఎంఎస్బిరెడ్డి
జర్నలిస్టు