హైదరాబాద్: జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రతపై సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వివరణాత్మక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, ప్రధాన విభాగాధిపతులతో పాటు పాల్గొన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు , గుంటూరు, మరియు నాందేడ్ డివిజన్లలోని డివిజనల్ రైల్వే మేనేజర్లు (డి.ఆర్.ఏంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాలు మరియు రైల్వే స్టేషన్లలో భద్రతా చర్యలను బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, అధికారులు మరియు ఇన్స్పెక్టర్లచే రాత్రి తనిఖీలతో సహా వ్యవస్థీకృత మరియు దశలవారీ తనిఖీల ప్రాముఖ్యతను ప్రస్తావించారు. లెవెల్ క్రాసింగ్లు మరియు విద్యుత్ సరఫరా వ్యవస్థల వంటి కీలక అంశాలలో భద్రతను నిర్ధారించడం లో ఉన్న ముఖ్య పాత్రను ఆయన ఉల్లేఖించారు.
రైళ్ల రాకపోకలు నిరంతరాయంగా, సురక్షితంగా సాగేందుకు భద్రతా పరికరాలు, రైలు బిగింపుల ( రైల్ ఫిట్టింగ్స్) నిర్వహణపై కూడా జనరల్ మేనేజర్ నొక్కి చెప్పారు. భద్రతా వ్యవస్థ అనేది తక్షణ కార్యాచరణ అవసరాలను తీర్చడమే కాకుండా, ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి దీర్ఘకాలిక భద్రతను కూడా కల్పిస్తుందని ఆయన అన్నారు.