- ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళుతోంది?
- 80 శాతం కొనుగోళ్లు పూర్తయితే ఆ గాలిమోటర్లలో పోవుడెందుకు?
రెడీ - ధాన్యం కొనుగోళ్లు, లెక్కలపై మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే ఏ ఛానల్‌లోనైనా ఓపెన్ డిబేట్‌కు
- నిన్న 90 లక్షల మెట్రిక్ టన్నులన్న మంత్రి ఉత్తమ్ , ఈరోజు 75 లక్షల మెట్రిక్ టన్నులే కొంటామనడం కాంగ్రెస్ చేతగాని తనం
- సమస్యే లేకుంటే ఇసుక, సిమెంట్ లారీలను, ట్రాక్టర్లను ఆపేసి ధాన్యం తరలించాలని రాత్రికి రాత్రే సమీక్షా సమావేశాలు ఎందుకు పెడుతున్నారు?
- ఈ సోయి, ప్రణాళిక నెల రోజుల క్రితం ఎందుకు లేవు?
- కాంగ్రెస్ ది దగా ప్రభుత్వం.. రైతుల ఆక్రందనలు వినబడట్లేదా?
- మంత్రి ఉత్తమ్, భట్టి, తుమ్మలకు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఘోర వైఫల్యాలపై బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేపట్టిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా ఐదు రోజుల క్రితం చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల నుండి ప్రారంభమైన తమ పర్యటనలో రాష్ట్రవ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలలో రైతులు పడుతున్న అగచాట్లను కళ్లారా చూశామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర రోడ్లపై ధాన్యం కుప్పలు పోసి, మండుటెండల్లో భార్యాపిల్లలతో సహా రైతులు కాపలా కాస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు ఐకేపీ కేంద్రాలు ఏఎంసీ సెంటర్లుగా కాకుండా జైళ్లలా కనిపిస్తున్నాయని, అకాల వర్షాలకు ధాన్యం తడిసి, మొలకలు వస్తుంటే ఆరబోసుకోలేక, కాపలా కాయలేక ఆరుగాలం కష్టపడిన రైతన్న కన్నీరు పెడుతున్నాడని, సాగు సమయం దగ్గర పడుతున్నా ధాన్యం అమ్ముడుపోక పొలం పనులు చేసుకోలేని దయనీయ స్థితిలో రైతాంగం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఏలేటి మండిపడ్డారు. ఇప్పటివరకు కేవలం 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 80 శాతం అయిపోయిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ శ్రేణులు కళ్లాల్లోకి వెళ్లి రైతుల పక్షాన పోరాడుతుండటంతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని, అందుకే నిన్న కాంగ్రెస్ మంత్రులు గాలి మోటార్లలో పెద్దపల్లి, మంథని వంటి ప్రాంతాలకు పరుగులు తీశారని ఎద్దేవా చేశారు.
సమస్యే లేకుంటే ఇసుక, సిమెంట్ లారీలను, ట్రాక్టర్లను ఆపేసి ధాన్యం తరలించాలని రాత్రికి రాత్రే సమీక్షా సమావేశాలు ఎందుకు పెడుతున్నారని, ఈ సోయి, ప్రణాళిక నెల రోజుల క్రితం ఎందుకు లేవని ఆయన నిలదీశారు. ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు రాష్ట్రవ్యాప్తంగా దళారుల మాఫియా రాజ్యమేలుతోందని, మిల్లుల వద్ద తరుగు పేరిట సంచికి 2 నుండి 4 కిలోలు కోత విధిస్తూ, క్వింటాలుకు ఏకంగా 10 కిలోల వరకు నష్టపరుస్తున్నారని ఆరోపించారు.
ధాన్యం కొనుగోళ్లు, గన్నీ బ్యాగులు, రవాణా, హమాలీ చార్జీల కోసం కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా నిధులు ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంచికి రూ.75 నుండి రూ.80 వరకు రైతులతోనే బలవంతంగా వసూలు చేయిస్తోందని మండిపడ్డారు. ఈ అదనపు తరుగు, అక్రమ వసూళ్ల ద్వారా రాష్ట్రంలో రైతుల రక్తాన్ని తాగుతూ దాదాపు రూ.4,000 కోట్ల దోపిడీ సాగుతోందని, ఈ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తోందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ‘చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత తనదేనని’ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ఆ మాట ఎందుకు తప్పారని ఏలేటి ప్రశ్నించారు. నిన్న 90 లక్షల మెట్రిక్ టన్నులన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈరోజు 75 లక్షల మెట్రిక్ టన్నులే కొంటామనడం కాంగ్రెస్ చేతగానితనానికి నిదర్శనమన్నారు. ధాన్యమే కాకుండా సోయాబీన్, మక్కలు, జొన్నలు, శనగలు, సన్ ఫ్లవర్ వంటి 10 పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఎకరాకు కేవలం పాక్షికంగానే కొంటూ రైతులను దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ. 15,000 రైతు భరోసా లేదు, ఫసల్ బీమా లేదు, పంట నష్ట పరిహారం ఊసే లేదని, మూసీ పునరుద్ధరణ పేరిట లక్షల కోట్లు మాట్లాడే ప్రభుత్వానికి, రైతులకు రూ.200 కోట్ల ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి చేతులు రావడం లేదని విమర్శించారు. అలాగే స్మార్ట్ఫోన్లు, సాంకేతికత తెలియని సామాన్య రైతులకు యూరియా కోసం ‘యాప్’లు పెట్టడం ఏంటని, యాప్ ఓపెన్ చేయకముందే ‘నో స్టాక్’ అని రావడం వల్ల రైతులు ఆందోళన చెంది బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని, ముందస్తు ప్రణాళిక లేకుండా ఇన్నోవేషన్ పేరిట రైతులను ఇబ్బంది పెట్టడం దుర్మార్గమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు 70 ఏళ్ల వృద్ధ రైతుపై భౌతిక దాడులు చేశారని, ధాన్యం కొనాలని ఆందోళన చేసిన రైతులపై నాన్-బేలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టడం దారుణమన్నారు. స్టేషన్ ఘన్పూర్, లక్సెట్టిపేట ప్రాంతాల్లో ఎండదెబ్బకు, వడగాల్పులకు రైతులు చనిపోతే కనీసం పరామర్శించిన నాథుడు లేడని, ఒక్క పైసా ఎక్స్‌గ్రేషియా ప్రకటించలేదని మండిపడ్డారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌లు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏలేటి ఫైరయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు వయసు మీరి బుద్ధి మందగించినట్లు వ్యవహరిస్తున్నారని, గన్నీ బ్యాగుల కొరతకు బంగ్లాదేశ్ యుద్ధానికి ముడిపెట్టడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో డీజిల్ కొరత లేదని అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబితే, డీజిల్ కొరత వల్లే లారీలు రావడం లేదని తుమ్మల సాకులు చెప్పడం వారి సమన్వయ లోపానికి నిదర్శనమన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్‌లపై గరిష్టంగా వ్యాట్ వసూలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మంత్రులు కేవలం తమ పదవులను కాపాడుకోవడానికి ఢిల్లీ టూర్లు చేస్తూ సూట్‌కేసులు మోయడానికే పరిమితమయ్యారని, పరిపాలన చేతగాకనే బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకు, భట్టి విక్రమార్కకు బహిరంగ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లు, లెక్కలపై మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే ఏ ఛానల్‌లోనైనా ఓపెన్ డిబేట్‌కు రావాలని, తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీ లోపు కళ్లాల్లో ఉన్న ప్రతి గింజను కొనుగోలు పూర్తి చేయాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో తదుపరి ఉమ్మడి కార్యాచరణ, పోరాట ప్రణాళిక ప్రకటిస్తామని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.