- కాంగ్రెస్ నిరుద్యోగ హామీల మోసంపై రాహుల్ గాంధీని నిలదీయాలి
- దొంగఓట్లపై దృష్టి పెట్టండి
- మన ఓట్లు పోకుండా చూడాలి
- ముషీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్
హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి యువతకు యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై రాహుల్ గాంధీని నిలదీయాలని తెలంగాణ యువతకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గానికి రాహుల్ గాంధీని తీసుకువచ్చి అడ్డగోలు హామీలిచ్చి, వారందరినీ మోసం చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డికి కేటీఆర్ గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ వచ్చి డిక్లరేషన్ల పేరుతో ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చి, విద్యావంతులైన యువకులతో కూడా ఓట్లు వేయించుకొని ఇప్పటిదాకా కనీసం మొహం కూడా చూపించడం లేదని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ యువతకు మా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తే తిరిగి వచ్చి అండగా నిలబడతానని మాయమాటలు చెప్పిన రాహుల్ గాంధీ వారిని నట్టేట ముంచారని కేటీఆర్ ఆరోపించారు. కేవలం ఎన్నికల ప్రచారం ఎప్పుడు విద్యార్థుల నిరుద్యోగుల ఓట్లు దండుకొని ఇప్పుడు మొహం చాటేసారన్నారు. తెలంగాణ యువత రాహుల్ గాంధీని ఈ అంశంలో నిలదీయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిందే లేదు అని, కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను భర్తీ చేసి చేతులు దులుపుకుందన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు చేసిన ద్రోహాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ముషీరాబాద్ లో జరిగిన పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. SIR ఓటర్ల నమోదు అవకతవకలపై అప్రమత్తత ఉండా ల. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం సందర్భంగా, ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త జాగ్రత్తగా ఉండాలని.. అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసే ఎన్నికల ఓటర్ల నమోదుకు సంబంధించిన అవకతవకల పైన జాగ్రత్త వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ముషీరాబాద్ నియోజకవర్గ ముఖ్య పార్టీ కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పైన కేటీఆర్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను ఇచ్చారు. పార్టీ తరఫున ఎంపిక చేసిన బూత్ లెవెల్ అసిస్టెంట్లతో సమావేశమయ్యారు.
పార్టీ తరఫున ఎంపిక చేసిన బీఎల్ఏలు ప్రతి ఒక్కరి ఓటు తొలగకుండా కాపాడేలా ప్రయత్నం చేయాలన్నారు. దీనితో పాటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అడ్డగోలుగా డబుల్ ఓట్లను, దొంగ ఓట్లను రాయించే ప్రమాదం ఉన్నదని.. వీటిని అరికట్టేలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరోవైపు, భారత రాష్ట్ర సమితి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, హైదరాబాద్‌లో అద్భుతమైన విజయం సాధించిందని.. హైదరాబాద్ నగర ప్రజలు బీఆర్ఎస్ వెంట నిలిచారని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు, బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను తొలగించే ప్రయత్నం అధికార కాంగ్రెస్ చేసే అవకాశం ఉన్నదని, ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కోరారు.
హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారత రాష్ట్ర సమితి ఘనవిజయం సాధిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగరానికి చేసిన అభివృద్ధి వలనే ఇది సాధ్యమైందన్నారు.
హైదరాబాద్ నగరానికి రెండున్నర సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం ఫ్లైఓవర్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రోడ్లు వంటి నిర్మాణాలు చేస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం ‘హైడ్రా’ పేరిట వేల ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి గత ప్రభుత్వం నిర్మాణం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం విద్వంసం చేస్తున్నదన్నారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కేటీఆర్ కామెంట్స్
వచ్చే నెల నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని తెలిపిన కేటీఆర్, పూర్తి స్థాయిలో డిజిటల్ రూపంలో జరిగే ఈ సభ్యత్వానికి సంబంధించి పార్టీ శ్రేణులకు బూత్ వారీగా శిక్షణ కార్యక్రమాలు ఇస్తామని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాల పైన, అన్యాయాల పైన కూడా పార్టీ శ్రేణులకు శిక్షణ ఇచ్చి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. ఈరోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు.