కంచి పరమాచార్య మహా పెరియవా శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి జయంతి ఇవాళ
మనదేశంలో వచ్చిన పీఠాధిపతుల్లో అత్యుదాత్తమైన వారు, మహోన్నతులు మహా పెరియవా శ్రీ కంచి కామకోఠి పీఠాధిపతి లేదా కంచి శంకర మఠాధిపతి శ్రీలశ్రీ చంద్రశేఖర సరస్వతి. వారు ఈ భూమిపై పుట్టిన అరుదైన సత్పురుషుల్లో ఒకరు.
నిష్ఠ, నియమం, వర్తన, ప్రవర్తన వీటికి సన్మూర్తిమత్వం శ్రీలశ్రీ చంద్రశేఖర సరస్వతి. ఆదిశంకరుల వారు స్థాపించాక కంచి పీఠంలో చంద్రశేఖర సరస్వతి స్థాయి పీఠాధిపతి మరొకరు లేరు.
గొప్ప జ్ఞానవంతులు మహా పెరియవా. మనదేశంలో చరిత్రకారులు, మేధావులు పేరుతో చలామణిలో ఉన్న పలువురు ధూర్తుల కన్నా గొప్ప చరిత్రకారులు పెరియవా; సరైన, మేలైన ‘చదువు’, చింతన ఉన్న వారు మహా పెరియవా.
పండిన హృదయం విశేషమైన మేధ వెరసి మహా పెరియవా.
Paul Brunton అన్న విదేశీ పరిశీలకుడు మహా పెరియవా తేజస్సుకు ఆకర్షితుడై వస్తే వారు రమణ మహర్షి గురించి అతడికి చెప్పి రమణులు విశ్వవ్యాప్తం అవడానికి కారణమయ్యారు. రామకృష్ణ పరమహంస, రమణులు తరువాత అంతటి యోగి కంచి పరమాచార్యుల వారు.
ఈ దేశంపై కూడా మహా పెరియవాకు అక్కర ఉండేది. దేశానికి ఉపయోగకరమైన కొన్ని సూచనల్ని వారు చేశారు. దేశానికి మేలు చెయ్యగలిగిన నాయకులను పిలిచి మాట్లాడేవారు. దేశానికి జరగనున్న హానిని వారు ముందే పసిగట్టేవారు. వాటిల్లో ఒకటి వీ.పీ. సింగ్ ప్రధాని కావడం.
వీ.పీ. సింగ్ ప్రధాని కావడం అన్న పెను ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేశారు మహా పెరియవా. కానీ ఆ అపాయం దేశానికి తప్పలేదు. వీ.పీ. సింగ్ ప్రధాని కాకూడదని ఆయన ప్రధాని అయితే దేశానికి దెబ్బ అని ‘సరిగ్గా’ పసిగట్టి సుబ్రమణియన్ స్వామి, ఆడ్వాణీ వంటి వాళ్లతో ఆ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ప్రముఖ పాత్రికేయులు చో రామస్వామి సమన్వయ కర్త. కానీ పెరియవా ఆలోచనలు, ప్రయత్నాలు ఆచరణలోకి రాలేదు. ప్రధానిగా వీ.పీ. సింగ్ దేశానికి హాని చేసేశారు.
తమిళ్ష్ కవి కణ్ణదాసన్ కటిక నాస్తికుడు; దైవ నమ్మకాన్ని అతి తీవ్రంగా నిందించిన నాస్తికుడు. ఆ కణ్ణదాసన్ బుద్ధి తెచ్చుకుని, తనను తాను ‘సరి’ చేసుకుని మామూలు మనిషి అవడం, ఆస్తికుడు అవడం, తీవ్రమైన దైవారాధకుడు అవడం ఆపై ‘అర్థవంతమైన హిందూ మతం’ (అర్తముళ్ళ ఇన్దు మదం) అనే గొప్ప పుస్తకం రాయడం వంటివి పెరియవా ఆశీర్వాదం, అనుగ్రహం వల్లే జరిగాయి.
మహత్తు, మహనీయత్వం, నిస్స్వార్థం, నిష్ఠ, నిజనైజం, నిర్మలత్వం, సనాతనం, సచ్ఛీలత సమున్నతంగా, సముజ్జ్వలంగా సాకారమైన సిద్ధి మహా పెరియవా శ్రీలశ్రీ చంద్రశేఖర సరస్వతి.
అనర్హమూ, అనర్థమూ అయిన సాయిబాబా కల్మషం, కశ్మలం కలిసిపోయిన హైందవాన్ని ఇదిగో ఈ మహా పెరియవా వంటి వారితో శుద్ధి చేసుకోవాలి. ఏ విషయంగానూ. ఏ పరిగణనానుగుణంగానూ ‘సాయిబాబా ఈ పెరియవా కాలి దుమ్ముకు కూడా సాటి కాదు’ అన్నది చదువు, మెదడు, సరైన మనస్తత్వం, అవాగాహన, విజ్ఞతతో తెలియవచ్చే నిజం.
మనకు, మన హైందవానికి, సమాజానికి కావాల్సింది ఏ సంప్రదాయం, శ్రేష్ఠత, సనాతనత్వం లేని ఏ సాయిబాబాలో కాదు మనకు కావాల్సింది ఇదిగో ఈ మహా పెరియవా వంటి పరమోచ్చిష్టమైన పూజ్యులు.
‘నడిచే దేవుడు’ అని మహా పెరియవాను చెబుతారు. వారి స్మరణ, వారిపై ఆలోచన, వారి గురించి తెలివిడి, వారి నామోచ్చరణతో సాయిబాబా ప్రస్తావన చేసే వాళ్లు తమ నోటిని, మనసును, మెదడును, చింతనను, జన్మను శుద్ధి చేసుకోవాలి.
‘సాయిబాబా దోష’ గ్రస్త హైందవం ఇకపై శుద్ధి అవడానికి, సనాతన స్ఫూర్తికి ఎప్పటికీ మహా పెరియవా ఎంతో అవసరం. సాయిబాబా భక్తి, ఆరాధన అనే అధమత్వానికి, మానసిక రోగానికి, వికృత బుద్ధికి విరుగుడుగా సనాతన తేజస్సు
కంచి మహా పెరియవాను ఆవాహన చేసుకుందాం; ఆ పరమాచార్య స్ఫూర్తితో సాయిబాబా రహిత నిజ హైందవ జీవనం చేద్దాం; మహాపెరియవా జయంతి నాడు వారిని మనసా వాచా స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో సాయిబాబా లేని సనాతన జీవనాన్ని సాధించుకుందాం.
- రోచిష్మాన్
9444012279