ఒక ఓషో – ఒక ముక్తానంద

ఓషో… చంద్రమోహన్ జైన్ నుంచి రజనీష్ అయ్యాక ప్రపంచానికి బాగా తెలియవచ్చారు ఓషో. ఆయన మనకూ తెలిసిన వారే. ఓషో ఏ రచనా స్వయంగా చెయ్యలేదు. ఆయన మాటలు దాదాపుగా 500పుస్తకాలుగా ప్రపంచంలో చలామణిలో ఉన్నాయి. 60-70 భాషల్లోకి ఓషో మాటలు అనువాదం అయ్యాయి!
మన తెలుగులో ప్రముఖ కవులైపోయిన పనికిమాలిన భ్రష్టుల్లో లేని ‘కావ్యాభివ్యక్తి’, ‘శిల్పాభినివేశం’ గొప్పగా ఉన్నవారు ఓషో. ‘చెప్పడం’ ఎంతో విశిష్టంగా ఉంటుంది ఓషో చెప్పినప్పుడు. మన తెలుగు కమ్యూనిస్ట్, నక్సలైట్, కుల సాహిత్య మేధావులకూ చదువు రాని, లేని మన తెలుగు ఎమ్.ఎ., ఎమ్.ఫిల్., పీహెచ్.డీ. మేధావులకూ సాధ్యపడని ప్రతిభ, భాష, అభివ్యక్తి ఓషో నుంచి పుష్కలంగా వచ్చాయి.
ఓషో, జిడ్డు కృష్ణమూర్తి ఈ ఇద్దరూ గత శతాబ్ది కాలంలో
ప్రపంచంపై తమ ముద్ర వేసినట్టుగా మరెవరైనా ఉన్నారా? “కా(ర్)ల్ మార్క్స్ కన్నా ప్రపంచంపై ఓషో ప్రభావం ఎక్కువ” అనడం సరైందే! ఓషో ప్రభావం మార్క్స్ ప్రభావం లాగా రాజకీయంగానో, రాజకీయ అవసరాల కోసమో, అధికారం కోసమో, కూలగొట్టడం కొల్లగొట్టడం కోసమో అమలైందీ, చలమణిలోకి వచ్చిందీ కాదు; వీటికి అతీతంగా ప్రగాఢంగా వచ్చింది.
మార్క్స్ గురించి సరిగ్గా చెప్పిన వ్యక్తుల్లో ఓషో ఒకరు. ఆ ఓషో మాట తెలుగు సాహిత్యానికీ, మేధకూ, సమాజానికీ ఆ చెప్పినప్పుడే అవగతం అయుంటే తెలుగు సాహిత్యానికి, సమాజానికి కమ్యూనిజమ్, నక్సలిజమ్ దెబ్బ ఇంతలా ఇప్పుడున్నంతలా తగిలేది కాదేమో?
మార్క్స్ వల్ల ప్రపంచంలో జరిగిన విధ్వంసం, వినాశనం, సాంస్కృతిక చారిత్రిక వక్రీకరణ, దోపిడీ ఓషో వల్ల జరగలేదు. వ్యక్తిగానూ మార్క్స్ కన్నా ఓషో గొప్ప వ్యక్తి, గొప్ప ప్రమాణాలతో, గొప్ప అభిరుచితో, (ఓషో ఏ పనిమనిషికి కడుపు చెయ్యలేదు, అప్పులు ఎగ్గొట్టడానికి దాక్కోలేదు, పాణాలతో ఉండడానికి పారిపోలేదు) నాణ్యమైన జీవన స్థాయితో ‘బతికిన’ వ్యక్తి.
ఓషో మార్క్స్ లాగా విఫలమైన వ్యక్తి కాదు; ఓషో విజయవంతమైన వ్యక్తి. అంతర్జాతీయ అధ్యయనం మార్క్స్ ఎంత విఫలమైన వ్యక్తో ఎప్పుడో తేల్చి చెప్పింది. ఆ అంతర్జాతీయ అధ్యయనాన్ని ఉటంకిస్తూ తెలుగు మేధావులకు అతీతంగా నేను ఈ విషయంగా లోగడ రాశాను.
నేను ఓషో అభిమానినో, అనుయాయినో కాను. నేను ‘మామూలు’ వ్యక్తిని కనుక ఉన్నదున్నట్టుగా విషయాన్ని చెప్పాను.
ఓషో మాటల్ని నేను కొన్నేళ్లుగా తెలుగులోకి తెస్తున్నాను. నేను ఓషోను సమర్థించే వ్యక్తినో, ఓషోను వెనకేసుకొచ్చే వ్యక్తినో కాను.
తెలుగుకు అన్ని విషయాల్లోనూ పెద్దగా హాని చేసిన అంశం మధ్యతరగతి బుద్ధి మాంద్యం. ఆ మధ్యతరగతి బుద్ధి మాంద్యం మేధ అయిపోయింది తెలుగులో. ఆ మేధ తెలుగు అశక్తి దుర్జనత్వంగా కూడా, మానసిక రోగంగా కూడా పరిణమించింది. ఆ మధ్యతరగతి బుద్ధి మాంద్యానికి మించి ‘బతికిన’ వ్యక్తి ఓషో.
ముక్తానంద ఎవరు? 2001లో కీ.శే. అన్నాప్రగడ విజయలక్ష్మి గారి పుస్తకాలు కొన్ని నాకు వచ్చాయి. ఆమె భర్త అన్నాప్రగడ నారాయణరావు గారు ఆ పుస్తకాల్ని నాకు ఇచ్చారు. చెన్నైలోని ప్రముఖ విద్యాలయం ‘జవహర్ విద్యాలయ’, ‘మహోదయ’ అనే స్త్రీ సేవా మందిర్ వంటివి ఈ నారాయణరావు గారివి.
ఈయన తండ్రి అన్నాప్రగడ కృష్ణారావు అప్పట్లో మద్రాసు తెలుగు వారికి తెలిసిన ఉన్నత స్థాయి వ్యక్తి. ఆ విజయలక్ష్మి గారి పుస్తకాల వల్లే నారాయణ దత్త శ్రీమాలి, JOHN WOODROFFE, శివానంద, మహేశ్ యోగి వంటి వారు నాకు తొలిగా తెలియవచ్చారు. అరుదైన జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు నాకు అందివచ్చాయి.
విజయలక్ష్మి గారిని నేను చూడలేదు. ఆమె పోయాకే ఆమె పుస్తకాలు నాకు వచ్చాయి. ఆ పుస్తకాల్లో ‘Meditate’ ఆన్నది స్వామి ముక్తానంద రాసిన (చెప్పిన) పుస్తకం. ఆ విధంగా 23/2/2001న ముక్తానంద పేరును నేను తొలిసారి తెలుసుకున్నాను. ఆ తరువాత 2005లో ముక్తానంద గురువు నిత్యానంద ఫోటో నా దగ్గరకు వచ్చింది. ఆ నిత్యానంద చేతి వేళ్లకు 4 కణుపులు ఉంటాయి! నాకు ఆశ్చర్యం వేసింది. ముక్తానంద 1982లో వెళ్లిపోయారు.
2023లో ముక్తానంద నా అనుభవానికి వచ్చారు; నాకు తెలియవచ్చారు; నాతో మాట్లాడారు! ఎలా? ముక్తానంద నన్ను “గోరా వాలా”అంటారు! 1982లో వెళ్లిపోయిన ముక్తానంద ఇప్పుడు నన్ను “గోరా వాలా” అని ఎలా అంటారు?
నిన్నగాక మొన్న వినాయక చవితి రోజున
పూజకు కూర్చుని సంకల్పం చెప్పగానే ముక్తనంద వచ్చి నన్ను తన మాటలతో ఆశీర్వదించారు! చాల కాలం తరువాత ముక్తనంద నాతో మాట్లాడారు. అదేమిటి 1982లో వెళ్లిపోయిన ముక్తనంద నాతో మాట్లాడడం ఏమిటి? అదెలా?
నాతోనే కాదు నాకు బాగా దగ్గరైన ఒక కుటుంబంతో ముక్తనంద పదేపదే మాట్లాడతారు! ఆ కుటుంబం వల్లే నాకు ముక్తనందతో పరిచయం ఏర్పడింది. ఆ కుటుంబం ఎక్కడుంటుంది? ఎక్కడో కాదు హైదరాబాదులోనే ఆ కుటుంబం ఉంటుంది. ఇంకా మరి కొంత మందితో కూడా ముక్తానంద మాట్లాడుతూంటారు.
కొంత కాలం క్రితం ఒక సందర్భంలో ముక్తానంద నా ఇంటికి వచ్చారు. ఎలా? బుద్ధికి, తెలివికి, చదువుకు, మేధకు అందని చాల అనుభవాలు, సత్యాలు ఆ ఆకాశం లాగా ఉన్నాయి; ఉంటాయి. బాగా చిన్నప్పటి నుంచీ ఆ సత్యాలకు నేను సాక్షిని.
ఒక సామాన్య కుటుంబ మహిళ రోజుకు అరగంట మాత్రమే నిద్రపోతూ ఇరవైమూడున్నర గంటలు మేలుకొని ఉండడం నాకు తెలుసు. ఈ పరిణామాన్ని బుద్ధి, చదువు ఉన్న వైద్య ప్రపంచం నమ్మదు. ఆ మహిళే నన్ను ‘యోగ’లోకి నడిపించిన వ్యక్తి. నన్ను భరించిన వాళ్లలో ఆమె కూడా ఒకరు. మా అమ్మ కన్నా పెద్దామె ఆమె. స్వామి విష్ణుదేవానంద నాకు ఆమె ద్వారానే తెలియవచ్చారు. ఆ తరువాత మరికొన్నీ నా బుద్ధికి, తెలివికి, ప్రతిభకు, తెలివిడికి మించి నాకు అనుభవమయ్యాయి; అవుతున్నాయి.
బుద్ధీ, తెలివి, తెలివిడి, మెదడు, చదువు, మనసు, ప్రతిభ, ప్రయత్నం వీటికి మించిన సత్యాలు, అనుభవాలు ఉంటాయి; అవి నా అనుభవంలోకి వచ్చాయి. మెదడు, మతి, మనసు పగిలిపోయిన, చితికిపోయిన, చెదిరిపోయిన, చదువు చెడిపోయిన వికార జీవులకు ఈ పరిస్థితి లేకపోవచ్చు; వాళ్లు ఈ స్థితిని నమ్మలేకపోవచ్చు.
బుద్ధీ, తెలివి, తెలివిడి, మెదడు చదువు, మనసు, ప్రతిభ, ప్రయత్నం లేని వాళ్లు, ఇవి కుళ్లిపోయిన వాళ్లు, ఇవి పగిలిపోయిన వాళ్లు వీటికి అతీతంగా అనుభవాలు, సంగతులు, సత్యాలు ఉంటాయి అని అవగతం చేసుకోగలారా? పరుగెత్తడం అన్నది కాళ్లు, నడుము లేని వాడి తలపుకు మించినది. స్వర పేటిక లేని వాడికి పైస్థాయిలో పాడడం సాధ్యమవదు. కనుపాప చిట్లిపోతే సూర్యుడూ, సముద్రమూ కూడా కనిపించవు.
ఓషో, ముక్తానంద ప్రస్తావన ఇవాళ, ఇప్పడు ఎందుకు? ముక్తానంద గురించి ఓషో చెప్పిన మాటల ఉదంతం ఒకటి ఒక ఫేస్‌బుక్ పోస్టుగా నాకు తెలియ వచ్చింది. ఏ మాత్రమూ ఆశావహంగా ఉండక్కర్లేదు… అది తెలుగు వాళ్ల పోస్టు కానేకాదు!
తెలుగు వాళ్ల సోషల్ మీడిఅ పోస్టులు ఎలా ఉంటాయి? కులం కుళ్లు, బూతు, చవకబారు తనం, పనికిమాలినతనం, అధమత్వం, ఘంటసాల, సాయిబాబా, కమ్యూనిస్టు భ్రష్టత్వం, మతోన్మాదం, కులోన్మాదంతో కవిత్వనామ అశుద్ధం, చవి చదువు లేని పేలాపనలు, బుద్ధుడు బౌద్ధం పేరుతో సిగ్గు లేని వాగుడు, గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ (ఈ ముగ్గురి వల్ల సమాజానికి ఏం హాని జరిగింది అని ఇకనైనా మనం గ్రహించకపోతే దాన్ని తెలుసుకునేందుకు భవిష్యత్తులో మన సంతతి ఈ దేశంలో ఉండదేమో?) ఇవే కదా తెలుగు వాళ్ల షోషల్ మీడిఅ పోస్టుల్లో పెల్లుబుకుతూండేవి?
ఏ ఇతర భాష బృందం పోస్టో ముక్తానంద గురించి ఓషో మాటాడిన ఉదంతాన్ని నాకు చేర వేసింది. ఓషో ముక్తానంద కలుసుకున్నారని నాకు ఇంత వరకూ తెలియదు. ముక్తానంద గురించి ఓషో మాట్లాడడం కచ్చితంగా ముక్తానందకు బొట్టుపెట్టడమే!
- రోచిష్మాన్
9444012279
