పవన్ గారూ.. ‘రాంకీ’ ఫార్మాను పట్టించుకోరా?

- పర్యావరణ నిబంధనల కంటే రాంకీ ఫార్మా గొప్పదా?
- సముద్ర జలాలను నాశనం చేస్తున్నారు
- ‘రాంకీ’ చర్యలతో చేపల మృత్యువాత
- మత్స్య సంపద నాశనం
- పెద్ద చెరువులోకి రాంకీ ఫార్మా వ్యర్థాలు
- రాంకీ యాజమాన్యం పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
- సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గనిశెట్టి డిమాండ్
పరవాడ: ప్రభుత్వాలను ఖాతరు చేయకుండా పర్యావరణ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘిస్తు ప్రజలు, జలాలను నాశనం చేస్తున్న రాంకీ ఫార్మాపై చర్యలకు ఉప ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు భయపడుతున్నారు? రాంకీ ఉల్లంఘనలపై రోజూ మీడియాలో వార్తలు, ఫొటోలు వస్తున్నా రాంకీ ఫార్మాను పవన్ ఎందుకు పట్టించుకోవడం లేదు? పర్యావరణ నిబంధనల కంటే రాంకీ ఫార్మా గొప్పదా? అని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ ప్రశ్నించారు.
పెద్ద చెరువులో మొల్లెడిగడ్డలో నుండి సన్యాసి చెరువు మీదగా ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలను ఏ విధమైన శుద్ధి చేయకుండా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి న రాంకీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
గురువారం పెద్ద చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గనిశెట్టి మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో కాలవలు, చెరువులు, గడ్డల్లోకి వ్యర్థ రసానికి జలాలను విడుదల చేయడం వల్ల భూగర్భజలాలు నాశనానికి కారణమయ్యారని అన్నారు. రాంకీ యాజమాన్యం వర్షం వచ్చినప్పుడు అన్ని ఫార్మా పరిశ్రమల నుండి వచ్చిన వ్యర్ధ జలాలను ఒక్కసారిగా కాలువలు గడ్డలు చెరువుల్లోకి విడుదల చేయడం వలన ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని చర్మ, కిడ్నీ, క్యాన్సర్ , గుండె, ఊపిరితిత్తులు సంబంధించిన జబ్బులకు గురవుతున్నారని అన్నారు.
పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సక్రమమైన పద్ధతుల్లో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా పెద్ద చెరువులో టన్నులు కొద్ది చేపలు చనిపోయాయని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రజలు మంచి గాలి, మంచి నేల, మంచినీరుకి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
శుద్ధిచేసిన జలాలను సముద్రంలోకి పంపించవలసింది పోయి, ఏ విధమైన శుద్ధి చేయకుండా చెరువులు కాలువల ద్వారా సముద్రాన్ని కూడా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకారుల ఉపాధి నష్టం వాటిల్లుతుందని మత్స్య సంపద నాశనం అవుతుందని అన్నారు పర్యావరణాన్ని నాశనం చేస్తున్న రాంకీ కార్యాలయాన్ని ప్రజలను సమీకరించి ముట్టడిస్తామని గని శెట్టి తెలిపారు.
