October 7, 2026

 కాంగ్రెస్ వ్యవహారంపై మిత్రపక్షాల ఆగ్రహం

రాహుల్, ప్రియంకాలపై ఎఫ్ఐఆర్

( సీహెచ్ నరేంద్ర)

ఢిల్లీ: మంగళవారం ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం వరకు జరిగిన ‘ఇండియా బ్లాక్’ మార్చ్‌లో, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఆకాశవాణి భవన్‌లో ధర్నా చేసి అందరి దృష్టిని ఆకర్షించడం కూటమిలోని కాంగ్రెస్ మిత్రపక్షాలకు ఆగ్రహం తెప్పించింది. “నేటి నిరసన ‘ఇండియా బ్లాక్’ నిరసనగా మొదలైంది. కానీ చివరికి అది కాంగ్రెస్, రాహుల్ గాంధీ నిరసనగా మారిపోయింది,” అని వాపోతున్నారు.

అయితే, ఆకాశవాణి భవన్‌లో ధర్నా ప్రణాళికలో భాగం కాదని, గాంధీ సోదర సోదరీమణులు ఆకస్మికంగా ఈ చర్యకు పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు సమర్ధించుకుంటున్నారు. అది “ఆకస్మికమైనది” అని పేర్కొన్నారు. “మేము దీనిని ఎలా ఊహించగలం? ఇతర పార్టీల ఎంపీలు కూడా తిరిగి వచ్చి ఉండవచ్చు, వారిలో కొందరు వచ్చారు కూడా. మిత్రపక్షాలన్నీ భాగస్వామ్యంగా ఉన్నాయని కాంగ్రెస్ నిర్ధారించుకుంది,” అని ఒక కాంగ్రెస్ నాయకుడు పేర్కొన్నారు.

“నేటి నిరసన ‘ఇండియా బ్లాక్’ నిరసనగా మొదలైంది. కానీ చివరికి అది కాంగ్రెస్, రాహుల్ గాంధీ నిరసనగా మారిపోయింది,” అని ‘ఇండియా బ్లాక్’ పార్టీలలోని ఒక వర్గం తెలిపింది. అదేవిధంగా ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తో భేటీ జరగాలని అకస్మాత్తుగా మరో డిమాండ్ తెరపైకి తీసుకు రావడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కా ఆయన రెజీనామాను డిమాండ్ చేస్తూ, భేటీ కోరడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇతర ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించగా, ఆల్ ఇండియా రేడియో ప్రధాన కార్యాలయమైన ఆకాశవాణి భవన్‌లో ధర్నా చేసి గాంధీ కుటుంబం అందరి దృష్టిని ఆకర్షించిందని వారు భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వం “ఆవేశంలో వ్యవహరించిందని”, మిత్రపక్షాలకు సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఏర్పడిన “అవిశ్వాసానికి” విచారం వ్యక్తం చేస్తున్నట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషనల్) కేసీ వేణుగోపాల్ ఇతర ఇండియా బ్లాక్ పార్టీలతో చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో కూడా కాంగ్రెస్ ఇలాగే చేసిందని గుర్తు చేస్తున్నారు.నీట్ పేపర్ లీక్‌ల విషయంలో అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం బయట ధర్నా చేయాలన్న రాహుల్ గాంధీ ప్రణాళిక గురించి మిత్రపక్షాలకు తెలియదు. అప్పుడు, వేణుగోపాల్ వంటి కాంగ్రెస్ నాయకులు మిత్రపక్షాలను సంప్రదించగా, అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే తదితరులు నిరసనలో రాహుల్ గాంధీతో కలిశారు.

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీలో భాగంగా, అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్ ఆవరణలోకి ప్రవేశించినందుకు కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర ప్రతిపక్ష నాయకులు, మద్దతుదారులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు పదేపదే ఆదేశించినప్పటికీ అక్కడి నుండి వెళ్ళడానికి నిరాకరించడంతో ఈ కేసు నమోదు చేశారు.

పార్లమెంట్ భవనం నుండి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయమైన ‘నిర్వచన్ సదన్’ వైపు ‘ఇండియా’ కూటమి ఎంపీలు చేపట్టిన ర్యాలీ తర్వాత వీరు ఈ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ర్యాలీ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. నిరసనకారులు పోలీసులు ఏర్పాటు చేసిన మొదటి బారికేడ్‌ను దాటి, నీతి ఆయోగ్ సమీపంలోని రెండవ బారికేడ్ వైపు వెళ్లారు.

బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉన్నాయని, శాంతియుతంగా చెల్లాచెదురు కావాలని పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ నిరసనకారులు ఆదేశాలను ధిక్కరించడంతో, 10 మంది ఎంపీలతో సహా సుమారు 260 మందిని అదుపులోకి తీసుకుని, తదుపరి చట్టపరమైన చర్యల కోసం వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత చాలా మంది నిరసనకారులు ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయారు. అయితే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, మనీష్ ఛత్రత్, సుమారు 50-60 మంది మద్దతుదారులు అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్ ఆవరణలోకి ప్రవేశించి అక్కడ కూర్చున్నారు. ఆవరణను ఖాళీ చేయాలని కోరినప్పటికీ వారు నిరాకరించారని పోలీసులు పేర్కొన్నారు.

Total Visitors: 2,890,820