రాజధాని పనుల్లో ‘కూలి’ పోతున్న కార్మికుల బతుకులు

- మా రోజువారీ కూలీ రేట్లు పెంచండి
- కాంట్రాక్టర్లు ఇస్తున్న రేటు సరిపోవడం లేదు
- కిరాణాషాపులు మమ్మల్ని దోచుకుంటున్నాయి
- ప్రైవేటు వైద్యం చేయించుకోలేకపోతున్నాం
- క్యాంపు సైట్లలో వైద్య సౌకర్యం ల్పించండి
- రాత్రిళ్లు మాకు భద్రత కల్పించండి
- మరుగుదొడ్డి, మంచినీటి సౌకర్యం కూడా పెంచకపోతే ఎలా?
- సీఆర్డీఏ సీఎండికి రాజధాని కార్మికుల మొర
- రాజధాని కార్మికుల సమస్యలపై ఏడీసీ సీఎండీ సమీక్ష
- మంచాలు, దుప్పట్లు ఏర్పాటుచేయాలని లక్ష్మీపార్ధసారథి ఆదేశం
అమరావతి: వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకుని రాజధాని పనులు చేస్తున్న బడా కాంట్రాక్టర్లు.. తమ క్యాంపు సైట్లలో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు తమకు ఇస్తున్న వేతనాలు ఏమూలకూ సరిపోవడం లేదని, ప్రధానంగా క్యాంపు సైట్ల వద్ద ఉన్న కిరాణా వ్యాపారులు తమను దోచుకుంటున్నారంటూ కార్మికుల సీఆర్డీఏ సీఎండీకి మొరపెట్టుకున్న వైనం వెలుగుచూసింది.
పేరుగొప్ప కంపెనీలు రాజధాని అమరావతిలో చేస్తున్న పనులకు రాళ్లెత్తుతున్న కూలీల జీవన వ్యథ దారుణంగా ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అమరావతి రాజధాని పనులు చేస్తున్న వేలాది కార్మికులు శ్రమ దోపిడీకి గురువుతున్నారు. వారికి కార్మిక హక్కులు గానీ, రణ చట్టాలు గానీ అమలవుతున్నట్లు భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదని కార్మికులు స్వయంగా వెలిబుచ్చిన ఆవేదనతో బట్టబయలయింది.
కార్మికులు నివసిస్తున్న క్యాంపు సైట్ల వద్ద మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడం, పారిశుథ్య పరిస్థితులు దారుణంగా ఉండటం, కనీసం మంచినీటి సౌకర్యం కూడా సరైన దిశగా కల్పించకపోవడం బట్టి.. పాలకులు అమరావతి రాజధాని కార్మికుల విషాదాన్ని విస్మరించినట్లు స్పష్టమవుతోంది.
రాజధాని అమరావతిలో పనిచేస్తున్న కార్మికులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని గురువారం అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథిని వారిని రాజధానిలో వివిధ ప్రాజెక్టులలో పనిచేస్తున్న కార్మికులు విన్నవించుకున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి అమరావతి నిర్మాణాలలో పనిచేస్తున్న కార్మికులతో గురువారం రాయపూడిలోని ఏడీసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎల్ అంట్ టీ, ఎంవీఆర్, ఎన్‌సీసీ, బీఎస్సార్, ఆర్వీఆర్, మెగా వంటి నిర్మాణ సంస్థలలో పనిచేస్తున్న ఝార్కాండ్, పశ్చిమ బంగా, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు రోజువారీ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎండీ వారికి నివేదించారు.
ప్రధానంగా గుత్తేదారు సంస్థలు ఇస్తున్న వేతనాలు పెంచాలని కోరారు. ప్రస్తుతం పెరిగిపోయిన నిత్యావసర ధరలతో వచ్చే కొద్దిపాటి వేతనాలు సరిపోవటం లేదని చెప్పారు. క్యాంపు సైటల్లో ఉన్న కిరాణా దుకాణాలలో ధరలు మితిమీరి అమ్ముతున్నారని అక్కడి ధరలను వెంటనే నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రైవేటు వైద్యం చేయించుకోలేకపోతున్నామని కొందరు కార్మికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుచ్చారు. లేబర్ క్యాంపు సైటుల్లో వైద్య సదుపాయాలు సమకూర్చాలని కోరారు. అదేవిధంగా రాజధాని గ్రామాల్లో ప్రభుత్వ వైద్య సదుపాయాల సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. రాత్రిళ్లు క్యాంపు సైటుల వద్ద భదత్రను పెంచాని కోరారు. కార్మికులు చెప్పిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎండీ వారు హామీ ఇచ్చారు.
అదేవిధంగా లేబర్ క్యాంపులలో పారిశుద్ధ్యం, తాగునీటి వసతి, మరుగు దొడ్ల నిర్వహణ వంటి కనీస సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏడీసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పడక గదులలో మంచాలు, దుప్పట్లు వంటివి ఏర్పాటు చేయాని గుత్తేదారు సంస్థల ప్రతినిధులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశానికి ఛీఫ్ ఇంజినీర్లు ఆర్. గోపాలకృష్ణారెడ్డి, బి.నరసింహమూర్తి, టి.మోజెస్‌కుమార్, ఇంజినీరింగ్ అధికారులు హాజరయ్యారు.
కార్మిక సంఘాలు నిద్రపోతున్నాయా?
బడా కంపెనీలు తమకు ఇస్తున్న రోజువారీ వేతనాలు సరిపోవడం లేదని, తమ క్యాంపు సైట్లలో మరుగుదొడ్డి, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవంటూ స్వయంగా కార్మికులు సీఆర్డీఏ అధికారుల వద్ద గళం విప్పారు. అయితే రోజూ కార్మికుల సమస్యపై ఉపన్యాసాలు, ధర్నాలు చేసే కార్మిక సంఘాలకు ఇప్పటివరకూ ఈ విషయం తెలియకపోవడమే ఆశ్చర్యం. అమరావతి రైతుల సమస్యలపై గళం విప్పుతున్న వామపక్షాలు, ప్రజాసంఘాలు సైతం.. అమరావతి రాజధాని నగర నిర్మాణానికి, రాళ్లెత్తుతున్న కూలీల దారుణ కష్టాలను పట్టించుకోకపోవడమే వింత.
మున్సిపల్ మంత్రికి కార్మికుల కష్టాలు పట్టవా?
అమరావతి రాజధాని నిర్మాణాలపై నిరంతరం సమీక్షలు, పరిశీలన, పర్యవేక్షణ చేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు కార్మికులు ఎదుర్కొంటున్న మానవీయ సమస్యలు పట్టడం లేదన్న విషయం స్పష్టమయింది. పరాయి రాష్ట్రాల నుంచి పనులకు వచ్చిన కార్మికులకు మరుగుదొడ్డి, మంచినీటి వంటి కనీస సౌకర్యాలు కల్పించని బడా కంపెనీలను మందలించే ధైర్యం కూడా మంత్రికి లేదా? లేక ఆయన మాట బడా కాంట్రాక్టర్లు లెక్కచేయరా? అదీకాకపోతే ‘పైవాళ్ల’తో నేరుగా మాట్లాడుకుంటున్న బడా కాంట్రాక్టర్లు, మంత్రిని లెక్క చేయడం లేదా అన్నదే ప్రశ్న.
