న్యాయవ్యవస్థ మీనమేషాలు – ప్రజాస్వామ్యానికి సంకెళ్లు!

(ఇంద్రాణి)
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశమంతా అట్టుడికిపోతూ ఉండగా, కేంద్ర ప్రభుత్వంపైన పులిమీద పుట్రలా ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం-2023 సవాలుపై జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఇచ్చిన తీర్పును రికాల్ చేయాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి.
సాధారణంగా క్యూరేటివ్ పిటిషన్ అనేది న్యాయవ్యవస్థలో చిట్టచివరి ప్రక్రియ. సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు ఇచ్చిన తరువాత దానిని మరొక్కసారి పరిశీలించమని రివ్యూ పిటిషన్ వేస్తారు. అది కూడా ముగిసిన తరువాత చిట్టచివరి ఆశతో చేసే ప్రయత్నమే క్యూరేటివ్ పిటిషన్. అలా అని ప్రతి కేసులోనూ ఇటువంటి పిటిషన్లు వేసే అవకాశం ఉండదు; అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇది అనుమతించబడుతుంది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో సహజ న్యాయసూత్రాల (నేచురల్ జస్టిస్) ఉల్లంఘన జరిగితేనో, న్యాయమూర్తి పక్షపాతిగా నిరూపించబడితేనో, లేదా ఆ తీర్పు వలన తీవ్రమైన అన్యాయం జరిగితేనో మాత్రమే ఈ క్యూరేటివ్ పిటిషన్లు అనుమతించబడతాయి.
క్యూరేటివ్ పిటిషన్ల వరకు దారితీసిన ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం వెనుక ఉన్న అసలు కథలో, అంతర్లీనంగా శాసన వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్య నెలకొని ఉన్న అగాధం కూడా ఒక ప్రధాన కారణమనే విషయాన్ని గమనించాలి. భారతదేశంలో న్యాయవ్యవస్థ మరియు కార్యనిర్వాహక వర్గం మధ్య ఘర్షణ లేదా విభేదాలు నిన్న మొన్నటివి కావు. రాజ్యాంగం ఈ రెండింటికీ వేర్వేరు అధికారాలను ఇచ్చినప్పటికీ, అధికార సమతుల్యత సాధించే క్రమంలో తరచూ ఘర్షణపూరిత పరిస్థితులు ఏర్పడుతుంటాయి.
జడ్జీలను కొలీజియం వ్యవస్థ ద్వారా వారే నియమించుకుంటారు. ప్రభుత్వం తరఫున ప్రతినిధులు లేకుండా జడ్జీలే జడ్జీలను నియమించుకోవటం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. 2014 లో పార్లమెంటు 99 వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్’ (NJAC)ను ఏర్పాటు చేసింది.
దాని ప్రకారం న్యాయమూర్తుల నియామకాలు చేపట్టే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, మరో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉంటారు. ఆ ప్రముఖ వ్యక్తులను ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడితో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది.
ఈ సవరణ చట్టబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 4 :1 మెజారిటీతో 99 వ రాజ్యాంగ సవరణను, ఎన్‌జేఏసీ చట్టాన్ని చెల్లదని కొట్టివేసింది. న్యాయమూర్తుల నియామకాల్లో కార్యనిర్వాహక వర్గానికి విపరీతమైన జోక్యం కల్పిస్తే న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందని తమ తీర్పులో పేర్కొన్నారు. అది కార్యనిర్వాహక వ్యవస్థ అహాన్ని బాగా దెబ్బతీసింది.
అప్పటి నుండి కొలీజియం పంపిన పేర్లను ఆమోదించటంలో ప్రభుత్వం జాప్యం చేయటం ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. అయితే ఇక్కడ అంతుబట్టని విషయం ఒకటి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలలో పలుకుబడి ఉన్న వ్యక్తులే ఎక్కువ శాతం ఈ నియామకాలను పొందగలుగుతున్నారు. అది యాదృచ్ఛికమో, పలుకుబడో మనకు అర్థం కాదు. సుప్రీంకోర్టు తన తీర్పుతో న్యాయమూర్తుల నియామకాలను సాంకేతికంగా తన చేతుల్లోనే ఉంచుకోవటమే కాక, పార్లమెంటు చేసే చట్టాలు లేదా రాజ్యాంగ సవరణలను న్యాయసమీక్ష ద్వారా రద్దు చేసే అధికారాన్ని కూడా కలిగి ఉన్నది. ఇది శాసన వ్యవస్థకు కంటగింపుగా మారింది.
అయితే 2023 మార్చిలో ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం ప్రత్యేకంగా ఒక చట్టం చేసేంత వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లను ఎన్నుకోవటానికి ముగ్గురు సభ్యుల కమిటీ ఉండాలని ఆ తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ కమిటీలో భారత ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాలని నిర్దేశించింది. ఆ తీర్పు ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో ఎటువంటి ప్రత్యేకమైన వెసులుబాటు కనిపించలేదు.
ముఖ్యంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఉండటం అస్సలు రుచించని కేంద్ర ప్రభుత్వం, ఆఘమేఘాల మీద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఇతర ఎలక్షన్ కమిషనర్ల నియామక చట్టం-2023 ను తీసుకొచ్చింది. నూతన చట్టం ప్రకారం ఎంపిక కమిటీ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ప్రధాని నామినేట్ చేసిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రిని తీసుకొచ్చారు. ఆ కమిటీని చూసిన ఎవరికైనా అర్థమయ్యే విషయం ఏమిటంటే—కమిటీలో ఉన్న ప్రతిపక్ష నేత పాత్ర కేవలం అలంకారప్రాయం అని! పారదర్శకంగా ఉండటం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఈ చట్టాన్ని సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది.
ఈ చట్టాన్ని సవాలు చేస్తూ అనేకమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ కేసులు అనేక మలుపులు తిరిగాయి. కొత్తగా చేసిన చట్టంలో ఎంపిక కమిటీ నుండి సీజేఐని తొలగించిన నిబంధనపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు పట్టుబట్టారు; కానీ స్టే ఇవ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణ ప్రక్రియలో ప్రయోజనాల ఘర్షణ (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) వలన, మరికొన్ని కారణాల రీత్యా కొందరు న్యాయమూర్తులు విచారణ నుండి తప్పుకున్నారు. ముందుగా డిసెంబర్ 2024 లో అప్పటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ విచారణ నుండి తప్పుకున్నారు. మార్చి 2026 లో జస్టిస్ సూర్యకాంత్ కూడా ఈ కేసు విచారణ నుండి తప్పుకున్నారు. ఆ తరువాత ఈ కేసు జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య బెంచ్‌కు చేరింది.
కేసును ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి పంపించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆమోదించాలా, తిరస్కరించాలా అనే విషయంపై చాలా రోజులు విచారణ జరిపిన అనంతరం, సెప్టెంబర్ 23 , 2026 న ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులను వెలువరించారు. విస్తృత ధర్మాసనానికి పంపించవలసిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ జస్టిస్ దీపాంకర్ దత్తా తీర్పునిచ్చారు. కానీ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మాత్రం ఈ కీలక చట్టం చెల్లుబాటు అంశాన్ని విస్తృత రాజ్యాంగ బెంచ్‌కు రిఫర్ చేయాలని తీర్పునిచ్చారు; అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సమర్థించారు. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య అభిప్రాయభేదం రావటంతో, కేసును తదుపరి ధర్మాసన ఏర్పాటు కోసం సీజేఐ ముందుకు పంపించారు.
ఈలోపుగా కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సమర్థించిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కుమారుడు, ఎలక్షన్ కమిషన్ తరఫున ఒక రాష్ట్ర హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కేసు విచారించే సమయంలో ఆయన ఆ విషయాన్ని వెల్లడించలేదని పిటిషనర్లు ఆరోపిస్తూ సెప్టెంబర్ 29 , 2026 న ఒకరు, అక్టోబర్ 1 వ తేదీన మరొకరు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా సుప్రీంకోర్టు ఈ రీకాల్ పిటిషన్లను అనుమతించాలా వద్దా అనేది విచారించేందుకు అంగీకరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ క్యూరేటివ్ పిటిషన్లను విచారించాలి; వాటిని తిరస్కరించినా, చట్టం చెల్లుబాటును తేల్చడానికి విస్తృత బెంచ్ ఏర్పాటు అంశంపై నిర్ణయం తీసుకోవలసి ఉన్నది.
ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ విషయమై ఇంత ఆందోళన జరుగుతున్న సమయంలో, ఈ కేసులో ఒక జడ్జి నిష్పాక్షికతను కూడా విచారించవలసి రావటం దురదృష్టకరం. జస్టిస్ సతీష్ చంద్ర వ్యవహారం అనేది బహుశా చిన్న విషయంగానే పరిగణించే అవకాశం ఎక్కువ. ఆయన పక్షపాత వైఖరితో వ్యవహరించారు అనడం కంటే, ఆయన తన కుమారుని విషయాన్ని ముందుగానే వెల్లడించి ఉంటే బాగుండేది అనేది న్యాయనిపుణుల ఆలోచన.
ఇంతకంటే మించిన వ్యవహారం మరొకటి ఉన్నది. ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం అనేది పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో అతి ముఖ్యమైన విషయం. ఆ విషయంపై దాఖలైన కేసులు పెండింగులో ఉండగానే, కేంద్ర ప్రభుత్వం తన దారిన తాను కమిషనర్లను నియమించుకున్నది. అదేమీ చట్టవిరుద్ధం (ఇల్లీగల్) కాకపోవచ్చు, కానీ నైతికంగా చూస్తే అప్రజాస్వామికం. ఇక కమిషనర్లకు కల్పించిన రక్షణలు భారత ప్రధాన న్యాయమూర్తికి కూడా లేవు. ఈరోజు జ్ఞానేష్ కుమార్ వ్యవహారానికి అది కూడా ఒక కారణం.
ఇటువంటి పరిణామాలను గమనిస్తూ కూడా విచారణను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ, ఇప్పటికీ ఈ కేసులు ఎప్పటికి తేలుతాయో నిర్ధారించలేని న్యాయవ్యవస్థ వైఫల్యమే ప్రధానంగా చూడవలసిన అంశం. ఒక వ్యవస్థ ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోంది. ఆ విషయాన్ని గమనిస్తూ, అదే విషయమై అనేక కేసులు విచారిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం చట్టం యొక్క చట్టబద్ధతను నిర్ధారించకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఉండటం అంటే, న్యాయవ్యవస్థ కూడా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను మరో రకంగా కాలరాసినట్లే. ఇప్పటికే ఎమర్జెన్సీని ప్రతిఘటించటంలో న్యాయవ్యవస్థ విఫలమైందన్న అపవాదును మోస్తున్న సర్వోన్నత న్యాయస్థానం, ప్రజల హక్కుల కోసం నిలబడటం లేదనే మరో అప్రతిష్టను మూటగట్టుకుంటున్నది.!
