October 9, 2026

కేసీఆర్ పదేళ్ల పాలన తెలంగాణలో స్వర్ణ యుగానికి నాంది

  • రేవంత్ రెడ్డి పాలన నీతి నియమం లేని రాతి యుగం
  • దేశమే సిగ్గుపడేలా రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి స్కాం లు
  • ఒక జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే చోట ఉండేలా సమీకృత కలెక్టరేట్లు
  • అన్ని మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా సచివాలయం
  • బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
  • అట్టహాసంగా కేసీఆర్ ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాలు
  • వివిధ రంగాల ప్రముఖులకు ఘనంగా సన్మానం
  • కేసీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకాలు

నిజామాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలన తెలంగాణలో ఒక స్వర్ణయుగానికి నాంది పలికిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆవిష్కృతమైన స్వర్ణయుగం గురించి మననం చేసుకోవడానికి శుక్రవారం నిజామాబాద్ జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున పదేళ్ల పండుగ కార్యక్రమాలు నిర్వహించారు.

నిజామాబాద్ నగరంలోని బీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన కేసీఆర్ పదేళ్ల పాలన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలన నీతి నియమం లేని రాతియుగంగా అభివర్ణించారు.

కేసీఆర్ పాలనలో జరిగిన చెడు లేదు , కాంగ్రెస్ పాలనలో జరిగిన మంచి లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. దేశమే అబ్బురపడేలా కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ స్కీమ్ లు అమలు జరగగా దేశమే సిగ్గుపడేలా రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి స్కాం లు జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.

ప్రజల చెంతకే పరిపాలనను చేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విజయం సాధించిందని ఆయన పేర్కొంటూ.. ప్రజల సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు జరిగిందన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చిన చరిత్ర కేసీఆర్ దన్నారు. ఒక జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే చోట ఉండేలా జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలను నిర్మించామని, అధికారుల నివాస సముదాయాల నిర్మాణం కూడా జరిగిందని,
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసులను నెలకొల్పిన కేసీఆర్ సర్కార్ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాల యాన్ని ఆధునిక హంగులతో నిర్మించిందని గుర్తు చేశారు. అన్ని మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఈ సచివాలయాన్ని తీర్చిదిద్దామన్నారు.

అట్టహాసంగా కేసీఆర్ ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ పదేళ్ల పాలనలో సాధించిన విజయాలను కీర్తిస్తూ బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం దశాబ్ది ఉత్సవాలను గులాబీ సైన్యం అంబరాన్ని తాకేలా నిర్వహించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కదం తొక్కిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం క్రిక్కిరిసిపోయింది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం, ఆ తరువాత జిల్లాల కోసం ఉద్యమించిన జేఏసీ నాయకులు, ఉద్యమకారులను జీవన్ రెడ్డి ఘనంగా సన్మానించారు.

జిల్లాల ఏర్పాటుతో కలిగిన ప్రయోజనాలు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులపై స్థానిక మీడియా, సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు.జిల్లా కేంద్రంలో యువతతో కలిసి ర్యాలీలు, బైక్‌ర్యాలీలు నిర్వహించడమే కాకుండా నాయకులందరూ బెలూన్లు ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్,షకీల్ ఆమేర్,మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్,మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు, బాజిరెడ్డి జగన్,మాజీ మేయర్ నీతూ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Total Visitors: 2,909,627